Share News

Stock Market: కొనసాగుతున్న నష్టాలు.. మూడు రోజుల్లో 600 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ..

ABN , Publish Date - Dec 18 , 2024 | 04:10 PM

నిఫ్టీ మూడు రోజుల్లో ఏకంగా 600 పాయింట్లు దిగజారింది. మంగళవారం వెయ్యి పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్ బుధవారం మరో ఐదు వందల పాయింట్లు కోల్పోయింది. ఒక్క ఐటీ మినహా మిగతా రంగాలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ రోజు అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడనున్నాయి

Stock Market: కొనసాగుతున్న నష్టాలు.. మూడు రోజుల్లో 600 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ..
Stock Market

అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు,బ్యాంకింగ్, ఆటో రంగాల్లో అమ్మకాలు దేశీయ సూచీలకు నెగిటివ్‌గా మారాయి. మళ్లీ విదేశీ మదుపర్లు అమ్మకాలకు దిగడం మరింత ప్రతికూలంగా మారింది. దీంతో నిఫ్టీ మూడు రోజుల్లో ఏకంగా 600 పాయింట్లు దిగజారింది. మంగళవారం వెయ్యి పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్ బుధవారం మరో ఐదు వందల పాయింట్లు కోల్పోయింది. ఒక్క ఐటీ మినహా మిగతా రంగాలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ రోజు అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడనున్నాయి (Business News).


మంగళవారం ముగింపు (80, 684)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కొద్దిసేపు లాభాల్లోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం తర్వాత నష్టాలు మరింత పెరిగాయి. ఒక దశలో 600 పాయింట్లకు పైగా కోల్పోయి 80, 050 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. చివరకు 502 పాయింట్ల నష్టంతో 80, 182 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 40 పాయింట్ల నష్టంతో రోజును ప్రారంభించింది. ఒక దశలో 180 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివరకు 137 పాయింట్ల నష్టంతో 24, 198 వద్ద రోజును ముగించింది.


సెన్సెక్స్‌లో ఐజీఎల్, అరబిందో ఫార్మా, సుప్రీమ్ ఇండస్ట్రీస్, లూపిన్, ట్రెంట్ షేర్లు లాభాలు అందుకున్నాయి. పిరామిల్ ఎంటర్‌ప్రైజెస్, ఎన్‌ఎమ్‌డీసీ, పీవీఆర్ ఐనాక్స్, ఫెడరల్ బ్యాంక్, జియో ఫైనాన్సియల్స్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 432 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 695 పాయింట్లు నష్టపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.92గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 18 , 2024 | 04:10 PM