Share News

Stock Market: కొనసాగుతున్న నష్టాలు.. 24, 700 వేల దిగువకు నిఫ్టీ..

ABN , Publish Date - Oct 22 , 2024 | 10:57 AM

యుద్ధ భయాలు, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితుల కారణంగా మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో సూచీలు తీవ్ర ఒడిదుడకులను ఎదుర్కొంటున్నాయి.

Stock Market: కొనసాగుతున్న నష్టాలు.. 24, 700 వేల దిగువకు నిఫ్టీ..
Stock Market

దేశీయ సూచీల నష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. యుద్ధ భయాలు, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితుల కారణంగా మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో సూచీలు తీవ్ర ఒడిదుడకులను ఎదుర్కొంటున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి విడుదలవుతున్న ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోవడం మదుపర్ల సెంటిమెంట్‌‌ను దెబ్బతీస్తోంది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి (Business News).


సోమవారం ముగింపు (81, 151)తో పోల్చుకుంటే 4 పాయింట్ల స్వల్ప లాభంతో 81, 155 వద్ద మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్ నిమిషాల వ్యవధిలోనే లాభాల్లోకి దూసుకెళ్లింది. ఏకంగా 350 పాయింట్లకు పైగా లాభపడి 81, 504 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. అయితే ఆ తర్వాత అంతే వేగంగా నష్టాల్లోకి జారుకుంది. గరిష్టం నుంచి దాదాపు 800 పాయింట్లు నష్టపోయి 80, 727 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆ తర్వాత కొద్దిగా కోలుకుంది. సెన్సెక్స్ ప్రస్తుతం ఉదయం 10:45 గంటలకు 291 పాయింట్ల నష్టంతో 80, 859 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ఫ్లాట్‌గా ఓపెన్ అయి దాదాపు 100 పాయింట్లకు పైగా ఎగబాకింది. ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం 104 పాయింట్ల నష్టంతో 24, 677 వద్ద కొనసాగుతోంది.


సెన్సెక్స్‌లో సిటీ యూనియన్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్సియల్స్ లాభాల బాటలో ఉన్నాయి. టాటా కెమికల్స్, భెల్, డీఎల్‌ఎఫ్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 769 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.07గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 22 , 2024 | 10:57 AM