Gold Rates: తగ్గేదేలే అంటున్న పసిడి.. వామ్మో.. ఇంత పెరిగిందేంటి
ABN , Publish Date - Dec 13 , 2024 | 09:23 AM
Gold Rates: బంగారం తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. సామాన్యులకు రోజూ షాక్ ఇస్తోంది పసిడి. కొనడం సంగతి పక్కనబెడితే కనీసం ముట్టుకోవాలన్నా షాక్ కొట్టేలా ఉంది పరిస్థితి.
బంగారాన్ని మన దేశంలో కేవలం ఆభరణంగానే గాక విలువైన ఆస్తిలా కూడా చూస్తారు. ఎందుకంటే గోల్డ్ కొనుక్కొని పెట్టుకుంటే అవసరమైనప్పుడు తనఖా పెట్టడం లేదా అమ్మడం లాంటివి చేయొచ్చు. అందుకే సామాన్యుల దగ్గర నుంచి ధనవంతుల వరకు అంతా గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మీద ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. అయితే పసిడి మాత్రం తన రూటే సెపరేట్ అన్నట్లు షాకుల మీద షాకులు ఇస్తోంది. తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. కొనడం సంగతి పక్కనబెడితే కనీసం ముట్టుకోవాలన్నా భయపడేలా చేస్తోంది బంగారం.
వెండి కూడా తగ్గట్లే..
బంగారం రేట్లు క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. ఆ మధ్య కాస్త తగ్గిన ధరలు.. ఇప్పుడు పెరుగుతూ 80 వేల మార్క్‌ను అందుకునే దిశగా దూసుకెళ్తున్నాయి. డిసెంబర్ 13, శుక్రవారం నాడు హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.79 వేల 470 పలుకుతోంది. అదే 22 క్యారెట్ల పసిడి రేటు తులం రూ.72 వేల 850 దగ్గర ట్రేడింగ్ అవుతోంది. ఒకవైపు బంగారం ధరలు రయ్‌రయ్‌మని పరుగులు పెడుతుంటే.. వెండి కూడా తానేమీ తక్కువ కాదన్నట్లు దూసుకెళ్తోంది.
ఒక్క రోజులోనే..
డిసెంబర్ 12న వెండి ధరలు కాస్త తగ్గి ఊరటను ఇచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌లో నిన్న రూ.1,000 మేర సిల్వర్ రేటు దిగొచ్చింది. కానీ ఏం లాభం.. 24 గంటలు తిరగకుండానే మళ్లీ అంతే పెరిగింది. శుక్రవారం కిలో మీద రూ.1,000 పెరగడంతో ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ.1,04,000 పలుకుతోంది. అయితే పైన పేర్కొన్న బంగారం-వెండి ధరల్లో ఎలాంటి పన్నులు లేవు. ఒకవేళ టాక్స్ గనుక కలిస్తే ఈ రేట్లు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి మధ్యాహ్నానికి కూడా ధరలు మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో స్థానికంగా ధరలు తెలుసుకోవడం మంచిదని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.