UBER: త్వరలో ఉబర్ బస్సులు.. మొదట ఆ నగరంలోనే
ABN , Publish Date - May 22 , 2024 | 05:41 PM
ఇన్నాళ్లు కారు సర్వీసులు అందిస్తున్న ఉబర్(Uber Buses) సంస్థ మరో సేవల్ని ప్రయాణికులకోసం అందించడానికి రెడీ అయింది. ఉబర్ బస్సు సేవల్ని త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఢిల్లీ: ఇన్నాళ్లు కారు సర్వీసులు అందిస్తున్న ఉబర్(Uber Buses) సంస్థ మరో సేవల్ని ప్రయాణికులకోసం అందించడానికి రెడీ అయింది. ఉబర్ బస్సు సేవల్ని త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తొలుత ఢిల్లీలో(Delhi) ప్రారంభించి.. అక్కడి ఫలితాల ఆధారంగా దేశంలోని ప్రధాన నగరాలకు విస్తరించాలని భావిస్తోంది. ఢిల్లీ ప్రీమియం బస్ స్కీమ్ పేరుతో ఈ బస్సులను నడపనుంది.
ఈ మేరకు ఢిల్లీ రవాణా శాఖ నుంచి ఆ సంస్థ లైసెన్స్‌ను అందుకుంది. ఇలాంటి లైసెన్స్ జారీ చేసిన తొలి రవాణా శాఖ ఢిల్లీనే కాగా.. దీన్ని అందుకున్న తొలి అగ్రిగేటర్‌గా ఉబర్ నిలిచింది. ఆ సంస్థ భారత్ అధినేత అమిత్ దేశ్‌పాండే మాట్లాడుతూ.. ఏడాదిగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు కోల్‌కతా నగరంలోనూ ప్రయోగాత్మకంగా ఈ బస్సులను నడిపినట్లు వివరించారు. దేశ రాజధానిలో ఉబర్ బస్సులకు మంచి ఆదరణ కనిపించిందన్నారు.
దీంతో ఢిల్లీలో తమ సేవల్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఢిల్లీ తదనంతరం కోల్‌కతాలో సర్వీసులు నడపడానికి గతేడాదే పశ్చిమ బెంగాల్ సర్కార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. వారం ముందుగానే ఉబర్ క్యాబ్‌లను బుక్ చేసుకున్నట్లు, ఉబర్ బస్సులను సైతం వారం ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించారు.
ఉబర్ అధికారిక యాప్‌లో ఉబర్ షటిల్‌ని క్లిక్ చేసి బస్సు ప్రయాణించే మార్గాలు, లైవ్ లొకేషన్ వంటి సమస్త సమాచారం ఉంటుందని చెప్పారు. ఉబర్ ఒక్కో బస్సులో ఒకే సారి 19 - 50 మంది జర్నీ చేసేందుకు వీలు ఉంటుందని తెలిపారు. ఇందులో వాడే ఉబర్ సాంకేతికత సాయంతో స్థానికంగా శిక్షణ తీసుకున్న ఆపరేటర్లే వీటిని నడుపుతారని వెల్లడించారు. దేశ రాజధానిలో ప్రయాణ రంగంలో ఉబర్ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..