Vedanta: లక్ష కోట్ల పెట్టుబడిని ప్రకటించిన వేదాంత.. రెండు లక్షల మందికి జాబ్స్
ABN , Publish Date - Oct 18 , 2024 | 07:51 PM
మైనింగ్ రంగ దిగ్గజ సంస్థ వేదాంత దేశంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడిని అనౌన్స్ చేసింది. దీని ద్వారా ఏకంగా రెండు లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించింది. అయితే ఈ పెట్టుబడులు ఏ రాష్ట్రానికి వచ్చాయి. ఎప్పటివరకు అమల్లోకి రానున్నాయనే విషయాలను ఇక్కడ చుద్దాం.
మెటల్స్, మైనింగ్ రంగ దిగ్గజ సంస్థ వేదాంత(Vedanta) దేశంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రకటించింది. ఒడిశాలో 6 మిలియన్ టన్నుల అల్యూమినా రిఫైనరీ, 30 లక్షల టన్నుల గ్రీన్ అల్యూమినియం ప్లాంట్ల ఏర్పాటుకు ఈ కొత్త పెట్టుబడి పెట్టనున్నట్లు వేదాంత ఓ ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని, 2030 నాటికి ఒడిశా 500 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే లక్ష్యాన్ని చేరుకోవడానికి తోడ్పతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
స్కూల్స్ కూడా
ఇది కాకుండా ఈ సంస్థ ఒడిశా ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో విద్యా కేంద్రాలు, ఆసుపత్రులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతోపాటు 'ప్లే స్కూల్స్' కూడా ప్రారంభించనుంది. వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని ఇటివల ముంబైలో కలిశారు. ఈ క్రమంలో జనవరి 2025లో ఒడిశాలో జరగనున్న పెట్టుబడిదారుల సదస్సుకు ముందు శనివారం జరగనున్న 'రోడ్ షో' కోసం మాఝీ ముంబైలో ఉన్న నేపథ్యంలోనే ఈ ప్రకటన రావడం విశేషం. ముంబై పర్యటన సందర్భంగా మాఝీ JSW గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్, గోద్రెజ్ ఇండస్ట్రీస్‌కు చెందిన నాదిర్ గోద్రెజ్‌లతో కూడా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
కీలక పాత్ర
వేదాంత వృద్ధిలో ఒడిశా ఎల్లప్పుడూ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అగర్వాల్ అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు కంపెనీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. కొత్త పెట్టుబడి కాస్టింగ్ వంటి పరిశ్రమలకు 'భారీ పారిశ్రామిక సముదాయం' సృష్టిస్తుందని ప్రకటన వెల్లడించింది. దీని ద్వారా అల్యూమినియం ఆటోమోటివ్, ఎలక్ట్రికల్, నిర్మాణ, రైల్వే వంటి రంగాలతో సహా అనేక ఉపయోగాలు ఉన్నాయని వెల్లడించారు. కొత్త ఝార్సుగూడ మాదిరిగానే ఒడిశాలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా రాయగడ ఉంటుందని విశ్వసిస్తున్నట్లు వేదాంత తెలిపింది.
సంతోషం
ఈ నేపథ్యంలో భవిష్యత్ లోహం అల్యూమినియం డిమాండ్ 2030 నాటికి రెట్టింపు అయ్యే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. ఏది ఏదైనా ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులు రావడం పట్ల రాష్ట్ర ప్రజలతోపాటు వ్యాపారవేత్తలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో ఈ పెట్టుబడుల గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
ఇవి కూడా చదవండి:
Gold Rates Today: సామాన్యులకు పసిడి రేట్ల షాకింగ్.. ఇప్పుడే ఇలా అయితే, మరి పెళ్లిళ్ల సీజన్ నాటికి..
Manappuram Finance: మణప్పురం ఫైనాన్స్‌కు భారీ షాక్.. 11 నెలల కనిష్టానికి షేర్లు
Stock Market: వారాంతంలో స్టాక్ మార్కెట్లో లాభాల జోష్.. కొన్ని గంటల్లోనే లక్షల కోట్ల లాభం..
Lay Offs: మళ్లీ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో లే ఆఫ్స్.. భయాందోళనలో టెకీలు..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More Business News and Latest Telugu News