Share News

Chennai: చైనా నుంచి 51 రోజుల తర్వాత స్వగ్రామానికి మెడికో మృతదేహం

ABN , Publish Date - Feb 03 , 2024 | 01:53 PM

చైనాలో మృతిచెందిన వైద్య విద్యార్థిని మృతదేహం 51 రోజుల అనంతరం స్వగ్రామానికి చేరుకుంది. కన్నియాకుమారి(Kanniyakumari) జిల్లా ఇడైకాడు పుల్లందేరికి చెందిన జౌళి వ్యాపారి గోపాలకృష్ణన్‌ ఏకైక కుమార్తె రోహిణి (27) చైనాలో వైద్య విద్య అభ్యసిస్తోంది.

Chennai: చైనా నుంచి 51 రోజుల తర్వాత స్వగ్రామానికి మెడికో మృతదేహం

పెరంబూర్‌(చెన్నై): చైనాలో మృతిచెందిన వైద్య విద్యార్థిని మృతదేహం 51 రోజుల అనంతరం స్వగ్రామానికి చేరుకుంది. కన్నియాకుమారి(Kanniyakumari) జిల్లా ఇడైకాడు పుల్లందేరికి చెందిన జౌళి వ్యాపారి గోపాలకృష్ణన్‌ ఏకైక కుమార్తె రోహిణి (27) చైనాలో వైద్య విద్య అభ్యసిస్తోంది. ఈ నెలలో ఆమె చదువు ముగించి స్వగ్రామానికి రానుండడంతో తల్లిదండ్రులు ఆనందంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, అనారోగ్యం కారణంగా రోహిణి మృతిచెందినట్టు గోపాలకృష్ణన్‌కు సమాచారం అందింది. రోహిణికి రక్తకణాలు తగ్గడంతో గత నెల 12వ తేది మృతి చెందినట్లు తెలిసింది. దీంతో కుమార్తె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌, రాష్ట్రప్రభుత్వం, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. కానీ, న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా మృతదేహాన్ని త్వరగా తీసుకొచ్చేందుకు వీలుకాలేదని సమాచారం. రోహిణిని చైనా పంపించిన ఏజెన్సీని తల్లిదండ్రులు కలువగా, మృతదేహాం తీసుకొచ్చేందుకు భారీగా ఖర్చవుతుందని తెలిపారు. ఇప్పటికే కుమార్తె విద్య కోసం లక్షలు ఖర్చుపెట్టిన తల్లిదండ్రులు ఏమీ చేయాలో దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చొరవతో చైనా నుంచి 51 రోజుల అనంతరం విమానం ద్వారా చెన్నైకి మృతదేహాన్ని తీసుకొచ్చి, అంబులెన్స్‌ ద్వారా స్వగ్రామానికి తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - Feb 03 , 2024 | 01:54 PM