Chennai: వామ్మో ఎంతఘోరం.. ఇద్దరు పిల్లల తల్లిని హత్య చేసి కాల్చేసిన ప్రియుడు
ABN , Publish Date - Feb 04 , 2024 | 01:48 PM
ఇద్దరు బిడ్డల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక యువకుడు ఆమెను చంపేసి... కాల్చేశాడు. ఈ దారుణ ఘటన నామక్కల్ జిల్లా కొల్లిమలైలో వెలుగు చూసింది.
- నామక్కల్ జిల్లాలో దారుణం
అడయార్(చెన్నై): ఇద్దరు బిడ్డల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక యువకుడు ఆమెను చంపేసి... కాల్చేశాడు. ఈ దారుణ ఘటన నామక్కల్ జిల్లా కొల్లిమలైలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. కొల్లిమలైకు చెందిన వల్లరసు (28) సేలం జిల్లా వాళప్పాడి సమీపంలో ఒకటిన్నర ఎకరం పొలం కొనుగోలు చేసి, సాగుచేస్తూ, అక్కడే ఉంటున్నారు. అతనితో కలిసి ఒక మహిళ, ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వారిమధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురై వల్లరసు మహిళను చంపేసి, పొలంలోనే మృతదేహాన్ని కాల్చివేశాడు. ఆ సమయంలో అటుగా వెళ్లిన కొందరు స్థానికులు పొలంలో పొగలు రావడాన్ని గమనించి, దగ్గరకు వెళ్ళి చూడగా, మహిళ మృతదేహం సగం కాలిన స్థితిలో ఉంది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు తరలించారు. ఆ తర్వాత పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో.. మృతురాలిని సుగుణ (32)గా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగా భర్తకు దూరంగా తన ఇద్దరు పిల్లలతో జీవిస్తూ వచ్చిన ఆమెకు వల్లరసుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో పొలంలో వ్యవసాయ పనులు చేసుకుందామని తీసుకొచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. పరారీలో ఉన్న వల్లరసు కోసం పోలీసులు గాలిస్తున్నారు.