Hyderabad: ఇల్లు అమ్ముకోనివ్వట్లేదని ‘అమ్మ’ ఊపిరి తీశాడు..
ABN , Publish Date - Jan 07 , 2024 | 11:33 AM
ఉప్పల్ పోలీసు స్టేషన్(Uppal Police Station) పరిధిలో ఓ తల్లిని కన్న కొడుకే హతమార్చాడు. పోలీసు కథనం ప్రకారం.. ఉమ్మడి వరంగల్ జిల్లా బురహాన్‌పల్లికి చెందిన కాసవేణి సుగణమ్మ(65) కొడుకు అనిల్, కోడలు తిరుమలతో కలిసి రామంతాపూర్‌లోని
- భార్య, స్నేహితుడితో కలిసి ఓ కొడుకు కిరాతకం
- సహజమరణంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం
- రామంతాపూర్‌లో ఘటన
ఇంటిని అమ్ముకుందామనుకుంటే అడ్డుపడుతుందనే కోపంతో ఓ వ్యక్తి తన కన్నతల్లినే కడతేర్చాడు. భార్య, ఓ స్నేహితుడి సాయంతో కన్నతల్లి గొంతునులిమి ప్రాణం తీశాడు. హత్యను సహజమరణంగా చిత్రీకరించేందుకు యత్నించి పోలీసులకు పట్టుబడ్డాడు.
ఉప్పల్(హైదరాబాద్), (ఆంద్రజ్యోతి): ఉప్పల్ పోలీసు స్టేషన్(Uppal Police Station) పరిధిలో ఓ తల్లిని కన్న కొడుకే హతమార్చాడు. పోలీసు కథనం ప్రకారం.. ఉమ్మడి వరంగల్ జిల్లా బురహాన్‌పల్లికి చెందిన కాసవేణి సుగణమ్మ(65) కొడుకు అనిల్, కోడలు తిరుమలతో కలిసి రామంతాపూర్‌లోని వెంకట్‌రెడ్డి నగర్‌లో నివాసం ఉంటున్నారు. అక్కడే ఓ ఇంటిని కొనుగోలు చేసి దానిని సుగుణమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొడుకు, కోడలు చేసిన ఒత్తిడి మేరకు సుగుణమ్మ ఆ ఇంటిని ఐదేళ్ల క్రితం తిరుమల పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. అయితే, ఆ ఇంటిని అమ్ముకుందామని అనిల్, తిరుమల ప్రయత్నిస్తుండగా సుగుణమ్మ అడ్డుకుంటుంది. తాను బతికి ఉన్నంత వరకు ఇంటిని అమ్మేది లేదని తేల్చిచెప్పింది. దీంతో తల్లి అడ్డు తొలగించుకోవాలని భావించిన అనిల్, భార్య తిరుమల, శివ అనే స్నేహితుడితో కలిసి హత్యకు పథకం వేశాడు. ఈ మేరకు శుక్రవారం ఉదయం తిరుమల, శివ కలిసి సుగుణమ్మ నోట్లో చేతి రుమాలు కుక్కి పట్టుకోగా అనిల్ తువ్వాలుతో ఉరి వేసి హత్య చేశాడు. ఆపై, ఏమీ తెలియనట్టుగా.. అమ్మ మరణించిందని బంధువులకు కబురు పంపాడు. అయితే, మృతదేహాన్ని అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా సుగుణమ్మ శరీరంపై గాయాలను చూసిన ఆమె తల్లి దాసరి ఐలమ్మ(85) మనవడు అనిల్‌ను నిలదీసింది. సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.. భార్య, స్నేహితుడితో కలిసి తన తల్లిని తానే హత్య చేశానని అనిల్ పోలీసు విచారణలో అంగీకరించాడు.