Hyderabad: డాక్టర్ ఇంట్లో ప్రమాదకర ఇంజక్షన్లు.. కువైట్ పారిపోయిన వైద్యుడు
ABN , Publish Date - Jan 19 , 2024 | 12:38 PM
తెలంగాణ నార్కొటిక్ బ్యూరో, రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు గురువారం సంయుక్తంగా ఆసిఫ్‌నగర్‌లోని ఓ ఇంటిపై దాడులు నిర్వహించి అధిక మత్తునిచ్చే 57 ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
రాజేంద్రనగర్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నార్కొటిక్ బ్యూరో, రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు గురువారం సంయుక్తంగా ఆసిఫ్‌నగర్‌లోని ఓ ఇంటిపై దాడులు నిర్వహించి అధిక మత్తునిచ్చే 57 ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫ్ నగర్‌లో నివాసం ఉంటున్న డాక్టర్ అశన్ ముస్తాఫా ఖాన్(Dr. Ashan Mustafa Khan) ఓ ఆస్పత్రిలో అనస్తీషియన్. సర్జరీల సందర్భంగా మత్తు కోసం ఇచ్చే ఫెంటానిల్ మత్తు ఇంజక్షన్‌లను బయట మార్కెట్‌లో రూ. 17,500కు విక్రయిస్తున్నాడు. ఇవి హెరాయిన్ కంటే 50 శాతం ఎక్కువ, మార్ఫిన్ కంటే మరింత ఎక్కువ ప్రమాదకరమని పోలీసులు తెలిపారు. యాప్ ద్వారా బయట వ్యక్తులకు డాక్టర్ అశన్ ముస్తాఫా ఖాన్ విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు నిఘా పెట్టారు. ప్రతీ రోజు ఓ డెలివరీ యాప్ పార్సిల్ ద్వారా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గురువారం అతడి ఇంటిపై దాడి చేయగా డాక్టర్ కువైట్ పారిపోయినట్లు గుర్తించారు. అతడి భార్య లుబ్నా నజీబ్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి 57 మత్తు ఇంజక్షన్లు, రెండు సెల్‌ఫోన్‌లు, రూ. 6లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ వస్తే అతడు ఎవరెవరికి మత్తు ఇంజక్షన్‌లు విక్రయిస్తున్నాడనే వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.