Hyderabad: భూ వివాదం.. లాయర్, ఎమ్మెల్యేపై కేసు.. ఓ సంఘాన్ని మోసం చేసి రూ. 7 కోట్లు స్వాహా
ABN , Publish Date - Feb 16 , 2024 | 11:23 AM
హైకోర్టు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ, అతనికి సహకరించి బెదిరింపులకు పాల్పడిన మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల(Malakpet MLA Ahmed Bala)పై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): హైకోర్టు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ, అతనికి సహకరించి బెదిరింపులకు పాల్పడిన మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల(Malakpet MLA Ahmed Bala)పై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ గండిమైసమ్మ మండలం భౌరంపేటలో బుడగ జంగాల సంఘానికి (100 కుటుంబాలు) సుమారు 90 ఎకరాల భూమి ఉంది. చింతల్‌కు చెందిన చింతల మల్లయ్య 1982లో సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ భూములను కాపాడుతూ వస్తున్నారు. 1989లో ఆయన మృతి చెందడంతో కుమారుడు యాదగిరి సంఘాన్ని నడుపుతున్నారు. 2005లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది రైతులను రెచ్చగొట్టి ఆ భూమిని ఆక్రమించుకుకున్నారు. దాంతో భూ వివాదం న్యాయస్థానానికి చేరింది. సంఘం తరఫున కోర్టులో వాదించేందుకు సైదాబాద్ ప్రాంతానికి చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణను ఏర్పాటు చేసుకున్నారు. ఫీజు కింద రూ. 30 లక్షలు చెల్లించారు. ఏళ్లు గడిచినా కేసు తేలడం లేదు. దాంతో సంఘం నాయకులు వెంకటరమణను కలిశారు. ప్రత్యర్థులు బలంగా ఉన్నారని, వారిని గెలవాలంటే జడ్జిలను మ్యానేజ్ చేయాలని, అందుకు రూ. 10కోట్ల వరకు ఖర్చు అవుతుందని నమ్మబలికాడు. దాంతో సంఘం సభ్యులంతా డబ్బులు పోగేసి రూ. 7 కోట్లు వెంకటరమణకు ఇచ్చారు. ఇక మనం కేసు గెలిచినట్లేనని, మీరు స్వీట్లు పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలని బాధితులను నమ్మించాడు. కానీ, అడ్వొకేట్ ఏనాడూ కేసును సీరియ్‌సగా తీసుకోలేదు. అనుమానంతో అడ్వొకేట్ తీరుపై ఆరా తీయగా, ప్రత్యర్థుల నుంచి రూ.25 కోట్లు తీసుకొని వారికి సహకరిస్తున్నట్లు బాధితులు గుర్తించారు. తమ డబ్బు తిరిగి ఇవ్వాలని అతడిపై ఒత్తిడి చేశారు. రూ. కోటి తిరిగి ఇచ్చిన వెంకటరమణ మిగిలిన డబ్బులు ఇవ్వకుండా వారిని వేధిస్తున్నాడు. మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలను సంప్రదించి సంఘం నాయకుల నుంచి తనను బయటపడేయాలని మొరపెట్టుకున్నాడు. ఎమ్మెల్యే, అయన అనుచరులు సంఘం నాయకులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాంతో వేదుల వెంకటరమణ, ఎమ్మెల్యే బలాల నుంచి తమ సంఘానికి, తమ కుటుంబాలకు ప్రాణహాని ఉందని బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు న్యాయవాది, మలక్‌పేట ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.