Share News

Hyderabad: ఎక్కడ ఉందో.. ఏమైపోయిందో తెలియదు.. మహిళా ఉద్యోగి అదృశ్యం

ABN , Publish Date - Mar 27 , 2024 | 11:43 AM

పాఠశాలకు వెళ్లిన మహిళా ఉద్యోగి అదృశ్యమైన సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌(Sarurnagar Police Station) పరిధిలో చోటు చేసుకున్నది.

Hyderabad: ఎక్కడ ఉందో.. ఏమైపోయిందో తెలియదు.. మహిళా ఉద్యోగి అదృశ్యం

- త్వరగా ఆచూకీ కనిపెట్టాలని పిల్లల విన్నపం

హైదరాబాద్: పాఠశాలకు వెళ్లిన మహిళా ఉద్యోగి అదృశ్యమైన సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌(Sarurnagar Police Station) పరిధిలో చోటు చేసుకున్నది. అదృశ్యమైన తమ తల్లి ఆచూకీ కనిపెట్టాలని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తుండగా, పోలీసులు మాత్రం ఫిర్యాదు చేసిన వెంటనే మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కర్మన్‌ఘాట్‌ శ్రీనివాసనగర్‌ కాలనీలోని శ్రీ చైతన్య కళాశాలలో స్టోర్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఎ.శేషవాహిని అలియాస్‌ భవాని(44) తన భర్త చనిపోవడంతో తన ఇద్దరు కుమారులు ప్రణీత్‌, ప్రవీణ్‌కుమార్‌లతో కలిసి కర్మన్‌ఘాట్‌ భాగ్యనగర్‌ కాలనీలోని వెంకటసాయి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. అయితే, ప్రతిరోజులాగే ఈ నెల 23న ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లారు. సాయంత్రం వరకు తల్లి ఇంటికి రాకపోవడం, ఆమె ఫోన్‌ స్విచ్చాఫ్‌ వస్తుండడంతో పాఠశాలకు వచ్చి కుమారులు ఆరా తీశారు. ఆమె ఆస్పత్రికి వెళ్తున్నానంటూ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పాఠశాల నుంచి వెళ్లి పోయారని సిబ్బంది తెలిపారు. దీంతో కుమారులు ఆమె కోసం ఎక్కడ వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె చిన్నకుమారుడు ప్రవీణ్‌ శనివారం రాత్రి సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పట్టించుకోవడం లేదంటూ సోషల్‌ మీడియా ద్వారా..

శేషవాహని శనివారం మధ్యాహ్నం నుంచి కనబడడం లేదంటూ సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆమె కుమారుడు ప్రణీత్‌, అతని స్నేహితుడు సందీ్‌ప సోషల్‌ మీడియాలో ఓ వీడియో ద్వారా ఆరోపించారు. ఏసీపీకి ఫోన్‌ చేస్తే ఆదివారం కదా, హోలీ హాలిడేస్‌ కదా అంటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆమె కుమారుడే సీసీ కెమెరాలు పరిశీలించి, స్కూల్‌ వద్ద నుంచి ఒక ఆటోలో వెళ్లిపోయినట్లు గుర్తించి పోలీసులకు తెలియజేశామని, అయినా ఆచూకీ కనిపెట్టకలేకపోయారని సందీప్‌ ఆరోపించారు.

ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాం: ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి

శేషవాహిని తప్పిపోయినట్లు ఫిర్యాదు చేసిన వెంటనే శనివారం రాత్రి మిస్సింగ్‌ కేసు నమోదు చేశాం. ఆమె ఫోన్‌ స్విచ్చాఫ్‌ ఉండడంతో కాల్‌ డేటాను పరిశీలించి, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నాం. ఆమె ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు జరుపుతున్నాం. కేసు విచారణలో ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదు.

Updated Date - Mar 27 , 2024 | 11:43 AM