Hyderabad: సినీ నిర్మాతను అగౌరవ పరిచేలా పోస్టులు.. రైటర్‌పై కేసు నమోదు
ABN , Publish Date - Jan 13 , 2024 | 11:02 AM
సినీ నిర్మాతను అగౌరవ పరిచేలా పోస్టులు పెట్టడంతో సోషల్ మీడియాలో దూషణలకు దిగిన సినీ రచయితపై జూబ్లీహిల్స్ పోలీసులు(Jubilee Hills Police) కేసు నమోదు చేశారు.
బంజారాహిల్స్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): సినీ నిర్మాతను అగౌరవ పరిచేలా పోస్టులు పెట్టడంతో సోషల్ మీడియాలో దూషణలకు దిగిన సినీ రచయితపై జూబ్లీహిల్స్ పోలీసులు(Jubilee Hills Police) కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 76లో నివసించే కూచిబొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద సినీ నిర్మాత. కొద్ది కాలం క్రితం తాడినాట రాజనర్సింహ అనే రచయిత కలిసి తన వద్ద కథలు ఉన్నాయని చెప్పాడు. కొన్ని కథలను విన్నాక అవి నచ్చకపోవడంతో వివేకానంద సినిమా వరకు తీసుకువెళ్లలేకపోయారు. దీన్ని దృష్టిలోపెట్టుకొని రాజనర్సింహ తప్పుడు ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. కొద్ది కాలానికి తన వల్ల పోరపాటు జరిగిందని ఒప్పుకున్నాడు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పడంతో వివేకానంద లక్ష రూపాయలు ఇచ్చాడు. మరోసారి కథల గురించి ప్రస్తావించడంతో వివేకానంద టెక్నికల్ సిబ్బందికి వినిపించాలని సూచించాడు. రాజనర్సింహ చెప్పిన కథలు సిబ్బందికి నచ్చలేదు. దీంతో సినిమా తీయలేమని రాజనర్సింహకు చెప్పాడు. ఇదే విషయమై వివేకానందను కలిసేందుకు ప్రయత్నించగా కుదరలేదు. దీంతో వివేకానంద్ గౌరవాన్ని భంగపరిచేలా రాజనర్సింహ సోషల్ మీడియా పోస్టులు పెట్టడం ప్రారంభించాడు. బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు. వివేకానంద ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు రాజనర్సింహపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.