Hyderabad: కల్లులో కలిపే 560 కిలోల క్లోరల్ హైడ్రేట్ పట్టివేత
ABN , Publish Date - Jan 04 , 2024 | 12:26 PM
బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు బుధవారం ఓల్డుబోయినపల్లి డెయిరీ ఫాం రోడ్డులో చేపట్టిన వాహనాల తనిఖీలో 560 కిలోల క్లోరల్ హైడ్రేట్(Chloral hydrate) పట్టుబడింది.
- ఒకరి అరెస్ట్.. మిగతా వారి కోసం గాలింపు
బాలానగర్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు బుధవారం ఓల్డుబోయినపల్లి డెయిరీ ఫాం రోడ్డులో చేపట్టిన వాహనాల తనిఖీలో 560 కిలోల క్లోరల్ హైడ్రేట్(Chloral hydrate) పట్టుబడింది. ఎక్సైజ్ పోలీసుల కథనం ప్రకారం.. వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కారులో 560 కిలోల క్లోరల్ హైడ్రేట్(కల్లులో మత్తు కోసం ఉపయోగించేందుకు)ను తరలిస్తున్నట్లు గుర్తించారు. కారు నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిజామాబాద్‌కు చెందిన నిందితుడు బస్పల్లి రామాగౌడ్(43) బోయినపల్లిలో నివాసం ఉంటున్నాడు. ముంబైకి చెందిన వ్యాపారి రాజు వద్ద కిలో రూ. 200కు క్లోరల్ హైడ్రేట్ కొనుగోలు చేసి ఆదిలాబాద్, మరికొన్ని ప్రాంతాలకు తరలించి కిలో రూ. 400కు విక్రయిస్తానని పోలీసులకు చెప్పాడు. పోలీసులు 560 కిలోల క్లోరల్ హైడ్రేట్, కారు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రామాగౌడ్, రాజుతోపాటు ఆదిలాబాద్‌లో వ్యాపారం చేసే ఆరుగురిపై కేసు నమోదు చేశారు. రామాగౌడ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఆదిలాబాద్(Adilabad)కు చెందిన ఆరుగురు వ్యాపారులు, రాజు కోసం గాలిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలో బాలానగర్ ఎక్సైజ్ సీఐ వేణుగోపాల్, నర్సిరెడ్డి, ఎస్సైలు రఘు, శ్యాంసుందర్, రష్మిత, ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు.