Hyderabad: కార్పొరేటర్‌పై మహిళల దాడి.. నలుగురిపై కేసు
ABN , Publish Date - Mar 14 , 2024 | 10:43 AM
ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో పలువురు మహిళలు.. ఓ మహిళా కార్పొరేటర్‌పై దాడికి పాల్పడారు. కారులో కూర్చున్న ఆమెపై పిడిగుద్దులు కురిపించారు.
- ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో ఘటన
హైదరాబాద్: ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో పలువురు మహిళలు.. ఓ మహిళా కార్పొరేటర్‌పై దాడికి పాల్పడారు. కారులో కూర్చున్న ఆమెపై పిడిగుద్దులు కురిపించారు. వాహనం అద్దాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. దాడికి పాల్పడిన నలుగురు మహిళలపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గంలో యూసుఫ్‌గూడ చౌరస్తాతో పాటు, పలుప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సంబంధిత కార్యక్రమం పూర్తయ్యాక ట్రాఫిక్‌కు ఆటంకంగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్యరావు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఈ నెల 12న రాత్రి జీహెచ్‌ఎంసీ సిబ్బంది కొన్ని ఫ్లెక్సీలు తొలగించేందుకు యూసు్‌ఫగూడ చౌరస్తాకు చేరుకున్నారు. ఫ్లెక్సీలను తీస్తుండగా అక్కడే ఉన్న మహిళలు సిబ్బందిని అడ్డుకున్నారు. వారితో వాగ్వావాదానికి దిగారు. దీంతో వారు కార్పొరేటర్‌కు సమాచారం ఇచ్చారు. కార్పొరేటర్ దేదీప్యరావు, ఆమె భర్త విజయ్‌కుమార్, కార్యకర్త ఫయీం కారులో అక్కడకు చేరుకోగానే కారులో ఉన్న కార్పొరేటర్ దేదీప్యరావుపై అక్కడి మహిళలు పిడిగుద్దులు కురిపించారు. పోలీసులకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. వారి నుంచి తప్పించుకునేందుకు కారు అద్దాలు మూసేయగా, వాటిని కూడా పగలకొట్టేందుకు ప్రయత్నించారు. గాయపడ్డ దేదీప్యరావు, ఆమె భర్త విజయ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు భావన, నాగలక్ష్మి, హెస్సెన్, లక్ష్మిపై ఐపీసీ 323, 504,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి విచారణ చేపట్టాలి: ఎమ్మెల్యే మాగంటి
ఒంటరిగా ఉన్న మహిళా కార్పొరేటర్‌పై రాత్రివేళ దాడి చేయడాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమగ్ర విచారణ చేపట్టాలని కోరతానని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(MLA Maganti Gopinath) తెలిపారు. మధురానగర్‌లోని కార్పొరేటర్ నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించిన అనంతరం బుధవారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి దాడులు జరగలేదని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసిన అజహరుద్దీన్‌కు, తమకు ఎలాంటి గొడవా లేదని, అధికారంలోకి వచ్చామంటూ మధ్యలో ఉన్న వారే అడ్డగోలుగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. చేతనైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికలు, రానున్న కార్పొరేటర్ ఎన్నికల్లో గెలిచి చూపించండని సవాల్ విసిరారు. కార్పొరేటర్‌ను పరామర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, వనం సంగీత, మన్నె కవితరెడ్డి ఉన్నారు.