Secretariat: సచివాలయానికి బాంబు బెదిరింపు.. రిటైర్డ్ టీచర్ అరెస్టు
ABN , Publish Date - Mar 02 , 2024 | 11:02 AM
సచివాలయంలో బాంబులు పేలనున్నాయంటూ బెదిరింపు ఫోన్‌కాల్ చేసిన రిటైర్డ్ టీచర్(Retired Teacher)ను పోలీసులు అరెస్టు చేశారు. బాంబు బెదిరింపు కారణంగా సచివాలయం అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చెన్నై: సచివాలయంలో బాంబులు పేలనున్నాయంటూ బెదిరింపు ఫోన్‌కాల్ చేసిన రిటైర్డ్ టీచర్(Retired Teacher)ను పోలీసులు అరెస్టు చేశారు. బాంబు బెదిరింపు కారణంగా సచివాలయం అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాంబ్ స్క్వాడ్ సభ్యులు మెటల్ డిటెక్టర్లు, పోలీసు జాగిలాలతో తనిఖీ చేశారు. చెన్నైకి చెందిన ఓ ప్రైవేటు టీవీ ఛానల్‌కు శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఓ వ్యక్తి ఫోన్ చేసి సచివాలయంలో బాంబులు అమర్చి ఉన్నాయని కాసేపట్లో అవి పేలనున్నాయని చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెంటనే ఆ ప్రైవేటు టీవీ ఛానల్ నిర్వాహకులు పోలీసు కంట్రోలు రూంకు సమాచారం చేరవేశారు. వెంటనే సచివాలయ భద్రతా దళం, స్థానిక పోలీసులు, బాంబ్ స్క్వాడ్... మెటల్ డిటెక్టర్లు, పోలీసు జాగిలాలతో సుమారు రెండు గంటలపాటు క్షుణ్ణంగా తనిఖీ జరిపారు. చివరకు అది ఉత్తుత్తి బాంబు బెదిరింపేనని నిర్ధరణకు వచ్చారు. ఆ తర్వాత పోలీసులు ప్రైవేట్ టీవీ ఛానెల్ కార్యాలయం నెంబర్‌కు ఫోన్ చేసిన వ్యక్తి ఆచూకీని గుర్తించారు. ఆ బాంబు బెదిరింపు చేసింది కడలూరు జిల్లా నెల్లికుప్పానికి చెందిన రిటైర్డ్ టీచర్ ప్రకాష్ అని వెల్లడైంది. ప్రకాష్ గత కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని వానగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఆయనను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
ప్రైవేట్ స్కూలుకు...
ఇదే విధంగా మాంగాడు ప్రాంతంలోని ప్రైవేటు స్కూలుకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఆ స్కూల్‌కు పంపి న ఈ-మెయిల్ లో కాసేపట్లో స్కూలులో దాచిన బాంబులు పేలుతాయని పేర్కొన్నారు. వెంటనే ఈ విషయాన్ని స్కూలు నిర్వాహకులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాంబు స్క్వాడ్‌తో వెళ్లి మెటల్ డిటెక్టర్లు, పోలీసు జాగిలాలతో తనిఖీలు జరిపారు. చివరకు అది ఉత్తుత్తి బాంబు బెదిరింపేనని కనుగొన్నారు. బాంబు బెదిరింపు చేసిన వ్యక్తి ఆచూకీని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.