Ganesh Chaturthi: ఇంట్లో పూజకు వినాయకుడి విగ్రహాన్ని తీసుకుంటున్నారా.. ఇవి గుర్తుంచుకోండి
ABN , Publish Date - Sep 01 , 2024 | 09:10 AM
ఏ పని మొదలుపెట్టిన విఘ్నాలు కలగకుండా ఆశీర్వదించేవాడు విఘ్నేశ్వరుడు. అందుకే వినాయకుడికి(Ganesh Chaturthi) పూజ చేసేటప్పుడు అనేక నియమాలు, నిబంధనలు పాటిస్తారు.
హైదరాబాద్: ఏ పని మొదలుపెట్టిన విఘ్నాలు కలగకుండా ఆశీర్వదించేవాడు విఘ్నేశ్వరుడు. అందుకే వినాయకుడికి(Ganesh Chaturthi) పూజ చేసేటప్పుడు అనేక నియమాలు, నిబంధనలు పాటిస్తారు. సెప్టెంబర్ 7న చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా చాలా మంది తమ ఇళ్లలో విఘ్నేశ్వరుడి ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు చేస్తుంటారు. వినాయకుడి విగ్రహాన్ని మార్కెట్లో కొనుగోలు చేసేముందు కొన్ని అంశాలు గుర్తుంచుకోవాలి. వాటితోపాటు కొన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. ఇంట్లో ప్రతిష్ఠించాక పూజల్లో కూడా కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం..
కొనుగోలు చేసేటప్పుడు..
బొజ్జ గణపయ్య.. కూర్చుని ఉన్న విగ్రహాన్ని కొనుగోలు చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా.. ప్రకృతికి దగ్గరగా ఉండే మట్టి గణపయ్యను తీసుకోవడం ఎంతో మంచిది. విగ్రహానికి కిరీటం ఉండాలి. అలాంటి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి పూజించడం వల్ల ఇంట్లో సంపద, సంతోషం, శ్రేయస్సు కలుగుతాయని అంటున్నారు. లేత గంధం రంగు గణపతి విగ్రహాన్ని పూజించడం ఉత్తమం. ఎలుక విగ్రహంలో కలిసి ఉండాలి. ఇది ఇంటిపై ఇతరులకు విశ్వాసం పెంచేలా చేస్తుంది. వృత్తి జీవితం సంతృప్తికరంగా ఉంటుందట. గణేషుడి చేతిలో మోదకం తప్పనిసరిగా ఉండాలి.
తొండం దిశ ముఖ్యం..
వినాయకుడి తొండం ఎప్పుడూ కుడివైపు తిరిగి ఉండకూడదంట. ఎడమ వైపు తిరిగి ఉండాలని పూజారులు చెబుతున్నారు. కుడివైపున తొండం ఉన్న విఘ్నేశ్వరుడిని పూజించడం వల్ల ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయట. వినాయకుడిని ఎంతో నిష్టతో, నిబద్ధతో ఆరాధించాలి. పూజలో కూర్చునే రోజు మద్యం, మాంసం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదు. మనసు పరిమళంగా ఉంచుకోవాలి. దేవుడిపై ఏకాగ్రత, భక్తి నిలపాలి. ఇలా చేస్తే విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం ఉంటుందని పూజారులు చెబుతున్నారు.
For Latest News click here