Share News

అనుబంధాల ‘రక్షా’బంధన్‌

ABN , Publish Date - Aug 18 , 2024 | 08:40 AM

సోదరభావం ఒక అపురూప సుమం. దానికి ఆత్మీయత అనే గంధం అద్దితే కనిపించే సుందర రూపమే రక్షాబంధన్‌. రాఖీ పౌర్ణమి సోదరీసోదరుల అనుబంధ సూచకంగా శ్రావణ పౌర్ణమినాడు జరుపుకునే పండుగ. శ్రావణ పౌర్ణమికి భారతీయ సనాతన సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యం వుంది.

అనుబంధాల ‘రక్షా’బంధన్‌

  • ఆగస్టు 19: రాఖీపౌర్ణమి

సోదరభావం ఒక అపురూప సుమం. దానికి ఆత్మీయత అనే గంధం అద్దితే కనిపించే సుందర రూపమే రక్షాబంధన్‌. రాఖీ పౌర్ణమి సోదరీసోదరుల అనుబంధ సూచకంగా శ్రావణ పౌర్ణమినాడు జరుపుకునే పండుగ. శ్రావణ పౌర్ణమికి భారతీయ సనాతన సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యం వుంది. యుగయుగాలుగా తరతరాలుగా ఈ పర్వదినం అనేక అద్భుత సందర్భాల సమాహారంగా పవిత్ర ఘటనలకు ప్రతిబింబంగా ధర్మరక్షణ కోసం జరిగిన అవతరణలకు ఆధారంగా నిలుస్తూ వస్తోంది. అలాగే వైదికంగా యజ్ఞోపవీతానికి (జంధ్యానికి) వున్న ప్రాధాన్యాన్ని అనుసరించి దీన్నే ‘జంధ్యాల పూర్ణిమ’ అని కూడా పిలుస్తారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి రాఖీ (రక్షను) కట్టడం ఈ పండుగలోని ప్రధానాంశం. ‘రాఖీ’ అనే పదం రక్ష లేదా రక్షణ సంబంధమైనది. సోదరి తన సోదరుడి చేతికి రక్షను బంధించి, కలకాలం చల్లగా వుంటూ తనకు రక్షణను కలిపించమని మనస్ఫూర్తిగా కోరుకోవటమే ఈ పవిత్ర కార్యం వెనుక వున్న అంతరార్థం.


ఆడపడుచుల దీవెన.. ఆనందాల వెల్లువ..

రాఖీపౌర్ణమి రోజు ఆడపడచులు తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టి గంధం అలంకరిస్తారు. చేతికి రాఖీ కడతారు. ఆ తర్వాత హారతిచ్చి అక్షింతలు వేసి అక్కలైతే ఆశీర్వదిస్తారు, చెల్లెలైతే శుభాకాంక్షలు తెలుపుతారు. రాఖీ కట్టే ముందు ‘యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల’ అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు. ఆ తరువాత మిఠాయిలు తినిపించుకుంటారు. ఇలా ఓ ఆనందాల వెల్లువగా రాఖీ పండుగను జరుపుకుంటారు.

nani1.3.jpg


సోదర ప్రేమ ఒక్కటే కాదు...

ఇది తొలుత ఉత్తర భారతదేశంలో విశేష ప్రచారంలో వుంది. అందుకే ఉత్తర భారతదేశ పురాణ కథా నేపఽథ్యాలు, సంప్రదాయాలు ఈ పండుగ వెనుక ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ కథలను, ఆచారాలను పరిశీలిేస్త ఇది కేవలం సోదర సంబంధమైనది మాత్రమే కాదని తెలుస్తుంది. పురాణ కథలలో బలి చక్రవర్తిని పాతాళానికి అణచినప్పుడు బలి కోరిక మేరకు ఆయన ఇంటి ముంగిట కాపలాగా విష్ణువు వుండి పోతాడు. అప్పుడు తిరిగి విష్ణువును వైకుంఠానికి రప్పించేందుకు బలి చక్రవర్తికి రక్ష కట్టి తన పతిని తాను తీసుకెళుతుంది శ్రీమహాలక్ష్మి. ‘యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వా మభిబధ్నామి రక్షే మా చల మా చల’... ‘ఓ రక్షాబంధమా! మహాబలవంతుడూ, రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు. అందుకే నేను నిన్ను ధరిస్తున్నాను’ అనే మంత్ర శ్లోకాన్ని రక్ష కట్టేటప్పుడు చదువుతుంటారు. అలాగే శిశుపాల వధ సమయంలో శ్రీకృష్ణుడి వేలికి ఆయన ధరించిన సుదర్శన చక్రం ఒరిపిడి తగిలి రక్తం వస్తుంది. అప్పుడు ద్రౌపది కృష్ణుడి వేలికి తన చీర కొంగు చింపి కట్టుకడుతుంది. అది రక్షలాగా అయింది. అందుకు ప్రతిగానే కౌరవ సభలో ద్రౌపది మాన సంరక్షణను కృష్ణుడు చేశాడనే కథ ప్రచారంలో ఉంది.

nani1.jpg


సంప్రదాయకంగా జంధ్యాన్ని ఉపనయనం అయినవారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రీ పూజచేసి కొత్తది ధరించి పాతది తీసివేస్తారు. గాయత్రి అంటేనే రక్షణకు మారు పేరు. అందుకే ఆ మాతను పూజించి ఆ తల్లికి మారు రూపమైన నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తుంటారు.

పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య చాలాకాలం యుద్ధం జరిగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు బలహీనుడయ్యాడు. భర్త నిస్సహాయతను చూసిన ఆయన భార్య శచీదేవి తరుణోపాయం ఆలోచించింది. సమరం చేయడానికి భర్తకు ఉత్సాహాన్ని కలిగించింది. ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపింది. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందాడు. ఈ పండుగ అవతరణం వెనుక చారిత్రక నేపథ్యం కూడా వుంది. అలెగ్జాండర్‌ భార్య ‘రోక్సానా’ తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కట్టింది. ఇలాంటి ఎన్నెన్నో గాథలు రక్షాబంధన్‌ వెనుక వున్నాయి. హయగ్రి జయంతి లాంటి ధర్మరక్షణ కోసం జరిగిన అవతరణ నేపథ్యాలు కూడా శ్రావణ పౌర్ణమి వెనుక వున్నాయి. అందుకే దీనికంత పవిత్రత, ప్రాధాన్యత.

- శ్రీమల్లి

98485 43520


యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడుని చూసిన ఆయన భార్య శచీదేవి తరుణోపాయం ఆలోచించింది. ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపింది.

Updated Date - Aug 18 , 2024 | 08:40 AM