Share News

Atla Tadde: ఆ దోషం తొలగాలంటే.. అట్లతద్ది రోజు ఇలా చేయండి..

ABN , Publish Date - Oct 18 , 2024 | 02:40 PM

పెళ్లి కాని యువతులు తమకు మంచి జీవిత భాగస్వామి రావాలని కోరుతూ ఈ రోజు వ్రతం ఆచరిస్తారు. పెళ్లయిన మహిళలు అయితే.. తమ భర్త దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటూ ఈ నోము చేస్తారు. ఈ రోజు.. అమ్మవారికి అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ క్రమంలో గౌరీదేవిని పూజిస్తారు. పరమశివుడిని భర్తగా పొందాలని కోరుతూ గౌరీదేవి ఈ వ్రతం ఆచరించిందని పురాణాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. స్త్రీలు సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేస్తారు.

Atla Tadde: ఆ దోషం తొలగాలంటే.. అట్లతద్ది రోజు ఇలా చేయండి..

అట్లతద్ది.. అంటేనే మహిళల పండగ. చిన్న పిల్లల నుంచి పెద్దల వాళ్ల వరకు వరకు అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ. ఈ రోజు మహిళలంతా తెల్లవారుజామునే లేచి.. భోజనం చేస్తారు. అలాగే మహిలంతా ఈ రోజు చేతికి గోరింటాకు పెట్టుకోంటారు. అదే గ్రామీణ ప్రాంతంలో అయితే ఈ అట్లతద్ది వేడుకలు ఉత్సాహంగా సందడిగా సాగుతాయి. ఈ అట్లతద్దిపై చాలా పాటలే జనసామాన్యంలో ఉన్నాయి. కానీ అట్లతద్ది అరట్లు.. ముద్దపప్పు మూడట్లో.. అంటూ సాగే పాట మాత్రం మంచి ప్రజాదరణ పొందింది. ఈ పండగను గోరింటాకు పండగ, ఉయ్యాల పండగ అని కూడా పలు ప్రాంతాల్లో పిలుస్తారు. దక్షిణాదిలో అట్లతద్ది అని పిలిస్తే. ఉత్తరాదిలో మాత్రం కర్వా చౌత్ పేరిట మహిళలు ఈ వేడుకను జరుపుకుంటారు. ఇక అట్లతద్ది పండుగ.. ఆశ్వయుజ బహుళ తదియ రోజు వస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 19వ తేదీ.. అంటే శనివారం ఈ పండగ వచ్చింది.


atlathadee.jpg

సౌభాగ్యం కోసం..

పెళ్లి కాని యువతులు తమకు మంచి జీవిత భాగస్వామి రావాలని కోరుతూ ఈ రోజు వ్రతం ఆచరిస్తారు. పెళ్లయిన మహిళలు అయితే.. తమ భర్త దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటూ ఈ నోము చేస్తారు. ఈ రోజు.. అమ్మవారికి అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ క్రమంలో గౌరీదేవిని పూజిస్తారు. పరమశివుడిని భర్తగా పొందాలని కోరుతూ గౌరీదేవి ఈ వ్రతం ఆచరించిందని పురాణాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. స్త్రీలు సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేస్తారు.


కుజ దోషం తొలుగుతుందని..

అట్లతద్ది నాడు ఈ వ్రతం చేయడం వల్ల జాతకంలోని కుజదోషం సైతం తొలుగుతుందని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా అట్లు సమర్పిస్తారు. ఈ అట్లు కుజుడికి మహా ప్రీతి అని వారు చెబుతున్నారు. వీటిని నైవేద్యంగా సమర్పించడం వల్ల వైవాహిక జీవితంలో ఎటువంటి అడ్డంకులు ఉండవని.. గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయని పేర్కొంటున్నారు. అలాగే గర్భ దోషాలు, గర్భస్రావము తదితర సమస్యలతో బాధపడుతున్న మహిళలు ఈ రోజు.. ఇరుగుపొరుగు వారికి అట్లు వాయనంగా సమర్పిస్తే.. గర్భధారణ సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు.


పూజ ఎలా చేయాలంటే..

అట్లతద్ది రోజు ఇంట్లో తూర్పు దిక్కున మండపాన్ని ఏర్పాటు చేయాలి. ఆ మండపంలో గౌరీదేవిని ప్రతిష్టించాలి. తొలుత వినాయకుడిని పూజించాలి. అనంతరం గౌరీదేవిని పూజించాలి. ఈ సందర్భంగా గౌరీదేవికి సంబంధించిన మంత్రాలతోపాటు శ్లోకాలు సైతం పఠించాలి. ఇక సాయంత్రం చంద్రోదయం అనంతరం పూజ నిర్వహించాలి. ఆ క్రమంలో 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత వాటిని ముత్తయిదువలకు వాయనంగా ఇవ్వాల్సి ఉంటుంది.


అట్లతద్ది రోజు..

ఆశ్వయుజమాసంలో ఉసిరి, గోంగూర తదితర ఆహార పదార్ధాలు అధికంగా లభిస్తాయి. ఈ సమయంలో వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ సమయంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల వారి శరీరంలోని అధిక వేడి సైతం తగ్గుతుంది. అలాగే అట్లతద్ది రోజు.. ఆటపాటల వల్ల శరీరానికి మంచి వ్యాయామంతోపాటు మనసు ఉత్సాహకరంగా ఉంటుంది. పచ్చని చెట్ల మధ్య ఊయల ఊగడం వల్ల స్వచ్ఛమైన గాలి సైతం శరీరానికి అందుతుంది. ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల జీర్ణక్రియ సైతం సక్రమంగా పని చేస్తుందని పెద్దలు వివరిస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తలతోపాటు తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 18 , 2024 | 02:54 PM