Share News

Kotha Paluku: నాటి బాణమే.. నేటి బల్లెం!

ABN , Publish Date - Jan 28 , 2024 | 02:56 AM

తాడేపల్లి ప్యాలెస్‌ వణుకుతోంది. పులి మీద పుట్రలా ఎన్నికల ముంగిట ఈ తలపోటు ఏమిటా? అని కలవరపడుతోంది. అధికారం ఉపయోగించి చంద్రబాబును, ఆయన దత్తపుత్రుడిని ముప్పుతిప్పలు పెడుతున్నామని సంతోషిస్తున్న వేళ...

Kotha Paluku: నాటి బాణమే.. నేటి బల్లెం!

తాడేపల్లి ప్యాలెస్‌ వణుకుతోంది. పులి మీద పుట్రలా ఎన్నికల ముంగిట ఈ తలపోటు ఏమిటా? అని కలవరపడుతోంది. అధికారం ఉపయోగించి చంద్రబాబును, ఆయన దత్తపుత్రుడిని ముప్పుతిప్పలు పెడుతున్నామని సంతోషిస్తున్న వేళ, ఇంటిపోరు తలపోటుగా మారుతోందని ఆవేదన చెందుతోంది. 2019 తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌ ఇంతలా వణకడం ఇప్పుడే అని అంతఃపుర భోగట్టా. ఆంధ్రప్రదేశ్‌ మఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని ఇంతలా కలవరపాటుకు గురిచేస్తున్నది మరెవరో కాదు.. ఆయన సొంత చెల్లి, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిలనే. తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని రాజకీయ రణ క్షేత్రంలో తేలిపోయిన షర్మిల, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలోకి అడుగిడినా తమకు కలిగే నష్టం ఏమీ ఉండదని జగన్‌ అండ్‌ కో ఇప్పటిదాకా తలపోశారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా షర్మిల ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డినే ప్రత్యేకంగా టార్గెట్‌ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు అండ్‌ కోను పెత్తందార్లుగా పోల్చుతూ పేదలను మభ్యపెట్టి లబ్ధి పొందాలనుకున్న జగన్‌కు ఇప్పుడు షర్మిల రూపంలో బెడద వచ్చిపడింది. ముఖ్యమంత్రి నైజాన్ని ఆమె పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. దీంతో ఆయన ఉలిక్కిపడుతున్నారు. ప్రస్తుత ఎన్నికల రణక్షేత్రంలో అన్నాచెల్లెలు నేరుగా తలపడుతున్నారు. జగన్‌ నోటి నుంచి వస్తున్న ప్రతి మాటకు షర్మిల కౌంటర్‌ ఇస్తున్నారు. దీంతో జగన్‌ శిబిరం ఆత్మరక్షణలో పడిపోయింది. తనకు వ్యతిరేకంగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చేతులు కలిపిన వేళ ఇంటిగుట్టు రచ్చకెక్కడాన్ని జగన్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే షర్మిల నేరుగా తనను ఎటాక్‌ చేస్తుందని జగన్‌ ఊహించలేదు. ముఖంలో అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూ.. తాను మంచి చేస్తుంటే తన ప్రత్యర్థులందరూ ఏకమై తనని ఒంటరి వాడిని చేస్తున్నారని ప్రజలను నమ్మించి సానుభూతి పొందాలనుకున్న జగన్‌ ప్రయత్నాలకు షర్మిల గండికొడుతున్నారు. అందరూ కాకపోయినా చాలామంది అనుకుంటున్నట్టు జగన్‌ మంచివాడు కాదనీ, రాజశేఖర రెడ్డి కుటుంబం చీలిపోవడానికి అతడే కారణమని షర్మిల తేల్చిపడేశారు. ఇవాళో, రేపో ‘హూ కిల్డ్‌ బాబాయ్‌?’ అని కూడా ప్రశ్నించవచ్చు. రక్తం పంచుకుని పుట్టిన తనకు జగన్‌రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని కూడా ఆమె పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. దోచుకోవడం, దాచుకోవడం మినహా ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనే జగన్‌కు లేదనీ, రాష్ట్రంలో అభివృద్ధి కనుమరుగైందనీ, తమ తండ్రి రాజశేఖరరెడ్డి పాలనకు, జగన్‌రెడ్డి పాలనకు పోలికే లేదనీ షర్మిల తేల్చిపారేశారు. ఆమె విమర్శల ప్రభావం ప్రజలపై ఎంత మేర ఉంటుంది? అధికార, ప్రతిపక్షాలలో ఎవరికి ఎక్కువ నష్టం చేస్తుందో తేలవలసి ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే జగన్‌కు మనశ్శాంతి లేకుండా పోయింది. మరోవైపు రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ల తిరస్కరణకు గురైన ఎమ్మెల్యేలు ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు.

భారతి లండన్‌ టూర్‌ రద్దు!

షర్మిల రంగ ప్రవేశం చేసి అంతఃపుర రహస్యాలను బట్టబయలు చేస్తుండటంతో జగన్‌కు నిద్రపట్టని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. నిజానికి ముఖ్యమంత్రి భార్య భారతీరెడ్డి ఈ వారంలో లండన్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే పార్టీలో అంతర్గత పోరుకు తోడు అంతఃపుర రహస్యాలను కూడా షర్మిల పూసగుచ్చినట్టు చెబుతూ రావడంతో భర్త జగన్‌కు ఈ పరిస్థితులలో తోడుగా ఉండడం కోసం ఆమె తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దీన్నిబట్టి షర్మిల ఎటాక్‌ ప్రభావం జగన్‌రెడ్డిపై తీవ్రంగానే ఉందని అర్థం చేసుకోవచ్చు. అధికార బలంతో ప్రత్యర్థులను కేసులలో ఇరికిస్తూ, కుట్రలు, కుయుక్తులతో ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేస్తూ ఇంతకాలం పబ్బం గడుపుతూ వచ్చిన జగన్‌, ఇప్పుడు తన సోదరే తన నిజ స్వరూపాన్ని విడమర్చి చూపిస్తూ రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రత్యర్థుల ఆరోపణలకు, విమర్శలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎదురుదాడి చేయడం వైఎస్‌ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు తండ్రి బాటలోనే జగన్మోహన్‌ రెడ్డి కూడా ఎదురుదాడినే ఎంచుకున్నారు. వేట కుక్కల కంటే హీనమైన సోషల్‌ మీడియా సైన్యాన్ని, తనపై ఈగ వాలనివ్వని ఉన్మాద మూకను ఇప్పుడు రక్తం పంచుకు పుట్టిన షర్మిలపైకి ఉసిగొల్పారు. దీంతో ఆమె వ్యక్తిత్వ హననం ప్రారంభమైంది. షర్మిల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ విమర్శలు చేయడం మొదలెట్టారు. ఆమె మొదటి పెళ్లి గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. ఆమె రెడ్డి ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నారు. మంత్రులతో పాటు సజ్జల అండ్‌ కో కూడా రంగంలోకి దిగి ఆమెను తిట్టిపోస్తున్నారు. అయితే షర్మిల తనపై వచ్చిన విమర్శలకు బెదరకుండా జగన్మోహన్‌ రెడ్డి నైజాన్ని పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు.

గతంలో తాను ఎందుకు పాదయాత్ర చేయవలసి వచ్చిందో, ఎవరు కోరితే పాదయాత్ర చేశానో కూడా వివరిస్తూ భారతీరెడ్డి పాత్రను కూడా బయటపెడుతున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్‌రెడ్డి ఎలా మారిపోయారో చెప్పుకొస్తున్నారు. గడచిన ఐదేళ్లలో తాను రెండే పర్యాయాలు తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లిన విషయాన్ని గుర్తుచేస్తూ, తాను ఏమీ ఆశించకుండానే జగన్‌రెడ్డి కోసం పనిచేశానని చెప్పారు. జగన్‌ కిరాయి మూక తనపై విమర్శలకు స్వస్తి చెప్పని పక్షంలో మరిన్ని రహస్యాలను ఆమె బయటపెట్టవచ్చు. రాజశేఖర రెడ్డి కుటుంబం చీలిపోవడానికి జగన్‌రెడ్డి కారణం అంటూ అందుకు తన తల్లి విజయలక్ష్మి సజీవ సాక్ష్యం అని చెప్పడం ద్వారా ప్రత్యర్థుల నోళ్లను ఆమె మూయిస్తున్నారు. షర్మిల తన ఇంటి పేరును వైఎస్‌గా చెప్పుకోవడాన్ని కూడా జగన్‌ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో రాజశేఖర రెడ్డి బిడ్డగా తనకు ఆ హక్కు ఉందని, తన కుమారుడికి రాజశేఖర రెడ్డి స్వయంగా తన తండ్రి రాజారెడ్డి పేరు పెట్టిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి నుంచి తాను ఏమీ ఆశించలేదని, తాను ఏదైనా ఆశించి ఉంటే ఆ మాట తన తల్లి విజయలక్ష్మితో చెప్పించగలరా అని సూటిగా ప్రశ్నించడంతో జగన్‌ శిబిరం ఆత్మరక్షణలో పడిపోయింది. ‘పులి కడుపున పులే పుడుతుంది’ అంటూ తాను రాజశేఖర రెడ్డి వారసురాలినే అని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మొండితనం విషయంలో జగన్‌ కంటే షర్మిల రెండు ఆకులు ఎక్కువే చదివారు. అయితే అధికారం తోడు కావడంతో రాజశేఖర రెడ్డి కుటుంబంలో అత్యధికులు జగన్‌రెడ్డితోనే ఉన్నారు. షర్మిల ఒక రకంగా ఒంటరి వారు అయ్యారు. అయినా ఆమె అదరడం లేదు బెదరడం లేదు. తనపై షర్మిల విమర్శల పదును పెరగడంతో స్వయంగా జగన్‌రెడ్డి రంగంలోకి దిగి చంద్రబాబు తరఫున ఆమె కూడా స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజకీయాలలో ఒక కుటుంబంలోని వాళ్లు, ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్లు పరస్పరం తలపడటం కొత్త కాదు. అయితే ప్రస్తుత పరిస్థితి వేరు. జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారంటే అందుకు రాజశేఖర రెడ్డే కారణం. ఇప్పుడు షర్మిలను కాంగ్రెస్‌ పార్టీ ఆదరించి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టినా అందుకూ రాజశేఖర రెడ్డే కారణం. వైఎస్‌ రాజశేఖర రెడ్డి బిడ్డలు కాకపోయి ఉంటే వీరిరువురూ ప్రస్తుతం ఈ పొజిషన్లలో ఉండేవారు కారు. ఈ నేపథ్యంలో అన్నాచెల్లెలి మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్‌రెడ్డి సానుభూతిని పోగేసుకొని కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును హైజాక్‌ చేశారు. దీంతో తాము కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి పొందడానికి కాంగ్రెస్‌ పార్టీ షర్మిలను చేరదీసింది. ఈ క్రమంలోనే దళిత క్రైస్తవులను ఆకట్టుకోవడం కోసం దళితులపై జగన్‌ది కపట ప్రేమ అని షర్మిల చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం షర్మిల వైపు ఆకర్షితులు కాకుండా ఉండడం కోసం షర్మిల భర్త అనిల్‌ కుమార్‌ బ్రాహ్మణుడు అని, ఆమె ఇకపై ఎంత మాత్రం రెడ్డి కాబోరని జగన్‌ అనుకూల శక్తులు సరికొత్త లాజిక్‌ను తెర మీదకు తెచ్చాయి. 2019 ఎన్నికలకు ముందు జగన్‌ తరఫున ప్రచారం చేసి పెట్టిన షర్మిలను రెడ్డి కాదని ఎవరూ వేలెత్తి చూపకపోవడం గమనార్హం. రాజశేఖర రెడ్డి బిడ్డ అనే ప్రొజెక్ట్‌ చేశారు. ఆనాడు జగనన్న కోసం పనిచేసిన బాణం ఇప్పుడు పక్కలో బల్లెం అయ్యేసరికి ఆమె భర్త కుల నేపథ్యాన్ని తెర మీదకు తెచ్చారు. అవసరానికి అనుగుణంగా కులాలను వాడుకోవడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య. తన మేనత్తలు దళితులనే పెళ్లి చేసుకున్నారని చెబుతూ దళితులను బుట్టలో వేసుకొనే ప్రయత్నం చేశారు. దీనికి కౌంటర్‌గా దళితుడినే చంపి డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని తిరుగుతున్న జగన్‌.. దళితులకు ఆత్మబంధువు ఎలా అవుతారని షర్మిల ప్రశ్నిస్తున్నారు. క్రైస్తవుల ఓట్లను, ముఖ్యంగా దళిత క్రైస్తవుల ఓట్లను తిరిగి కాంగ్రెస్‌ పార్టీ వైపు తెచ్చుకోవడానికి షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌ సహజంగానే ప్రయత్నిస్తారు. ఈ కారణంగానే షర్మిల వల్ల రాజకీయంగా తనకు నష్టం జరుగుతుందని జగన్‌రెడ్డి ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల వేళ ప్రత్యర్థులు అందరూ ఒక్కటై జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా మోహరిస్తున్న వేళ అండగా ఉండాల్సిన సోదరి అంతఃపుర రహస్యాలను బయటపెడుతూ చికాకు పెట్టడాన్ని జగన్‌ శిబిరం జీర్ణించుకోలేకపోతున్నది. జగన్‌రెడ్డి స్వయంకృతాపరాధం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. తాను జైలులో ఉన్నప్పుడు తన కోసం కాలికి బలపం కట్టుకుని తిరిగిన సోదరి షర్మిలను అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా ఆదరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. షర్మిలను రాజకీయంగా నిరోధించడంతో పాటు ఆస్తులను కూడా పంచి ఇవ్వకపోవడంతో అన్నాచెల్లెళ్ల మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. పరిస్థితి ఎంత దూరం వెళ్లిందంటే, తన కుమారుడి నిశ్చితార్థానికి మర్యాద కోసం సోదరుడు జగన్‌ను షర్మిల ఆహ్వానించారు. అయితే ఆమె తన ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే భారతీయ జనతా పార్టీ పెద్దలకు ఆగ్రహం వస్తుందని చెప్పి ‘ఇంటికి రావొద్దు’ అని చెల్లికి జగన్‌ చెప్పించారు. ఇంట్లోకి రానివ్వకపోతే గడప వద్దే ఆహ్వాన పత్రిక పెట్టి వెళ్లిపోతానని షర్మిల హెచ్చరించడం విదితమే.


కడప బరిలో సౌభాగ్యమ్మ?

మొత్తమ్మీద షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి జగన్‌ దంపతులు తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. అయితే అక్కడ తమకు షర్మిల దంపతుల నుంచి సాదర స్వాగతం లభించలేదని జగన్‌ దంపతులు కినుకతో ఉన్నారు. ఇదంతా ఆ ఇంటి రామాయణం. ఇప్పుడు ఆ రామాయణమే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్ర రాజకీయాలలోకి షర్మిల ఎంట్రీ జగన్‌రెడ్డి భయపడుతున్నట్టుగా ఆయనకు నష్టం చేస్తుందా.. లేదా అన్నది వేచి చూడాలి. ఆ ఇంటి పోరు ఇకపై ఏ మలుపులు తిరుగుతుందో తెలియదు. వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కూడా షర్మిల నోటి వెంట కొన్ని నిజాలు బయటకు రావొచ్చు. సోదరుడితో విభేదాలు ముదరడానికి ప్రధాన కారణం భారతీరెడ్డి అనే భావనలో షర్మిల గానీ, డాక్టర్‌ సునీత గానీ ఉన్నారు. వివేకా హత్య కేసులో అవినాశ్‌ రెడ్డి అరెస్టు కాకుండా తప్పించుకోగలిగారంటే అందుకు భారతీరెడ్డి అండదండలే కారణమని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కడప లోక్‌సభ స్థానం నుంచి వివేకానంద రెడ్డి భార్యను కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీకి పెట్టాలని షర్మిల భావిస్తున్నారు. అవినాశ్‌ రెడ్డిని ఓడించే అవకాశం ఉన్నప్పుడే ఏ పార్టీ తరఫు నుంచైనా తన తల్లి సౌభాగ్యమ్మను పోటీ పెట్టడం మంచిదని, ఓడించే పరిస్థితి లేకపోతే పోటీకి దింపడం అనవసరం అని డాక్టర్‌ సునీత దంపతులు భావిస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ రావడానికి మరో నెల రోజులకు పైగా వ్యవధి ఉంది. ఆలోపు ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతానికైతే షర్మిల తన మిషన్‌లో కొంత మేర సఫలమయ్యారు. రాష్ట్ర విభజన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్‌ నాయకులలో, కార్యకర్తల్లో ఆమె కొంత కదలిక తీసుకురాగలిగారు. తెలంగాణలో తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినందున దాని ప్రభావం కూడా ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది. అదే జరిగితే జగన్‌రెడ్డి ఓటు బ్యాంకుకు కొంతమేర గండిపడే అవకాశం ఉంది. ఈ కారణంగానే చంద్రబాబును అధికారంలోకి తేవడానికే షర్మిల రాష్ట్ర రాజకీయాలలోకి వచ్చారని జగన్‌ అండ్‌ కో కౌంటర్‌ ప్రచారానికి తెర లేపారు. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మితే జగన్‌ ఓటు బ్యాంకు సేఫ్‌గానే ఉంటుంది.

ప్రస్తుత పరిణామాలను తెలుగుదేశం పార్టీ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నందున కాంగ్రెస్‌ పార్టీ నిజంగానే పుంజుకొని జగన్‌ ఓటు బ్యాంకుతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును కూడా చీల్చే ప్రమాదం ఉందా? అని ఆరా తీస్తోంది. జగన్‌రెడ్డి అధికారాన్ని కోల్పోయిన పక్షంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ బలపడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి జగన్‌కు బీజేపీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలపడటాన్ని బీజేపీ జీర్ణించుకోలేదు. రాష్ట్రంలో తాము పుంజుకోలేని పక్షంలో జగన్‌రెడ్డి అధికారంలో కొనసాగాలన్నది బీజేపీ పెద్దల అభిలాష. ఈ కారణంగా తెలుగుదేశం–జనసేన కూటమి కూడా కాంగ్రెస్‌ పార్టీతో అంటీ ముట్టనట్టుగానే ఉంటుంది. దీన్నిబట్టి ఇటు కుటుంబపరంగా అటు రాజకీయంగా కూడా షర్మిల ఒంటరి పోరాటం చేయాల్సి ఉంటుంది. తమిళనాడులో కరుణానిధి–జయలలిత నాటి రాజకీయాల పట్ల మక్కువ పెంచుకున్న జగన్మోహన్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే ఒరవడి కొనసాగాలని కోరుకుంటున్నారు. ఇప్పటివరకు ఆయన హిట్‌ లిస్ట్‌లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, రాధాకృష్ణ, రామోజీరావు మాత్రమే ఉన్నారు. ఇకపై ఈ జాబితాలో షర్మిల కూడా చేరతారు. రక్తం పంచుకు పుట్టిన షర్మిలను కూడా పెత్తందారుల జాబితాలో చేర్చి తిట్టిస్తారు. తన మనసు దోచుకోవాలంటే తన ప్రత్యర్థులను దుర్భాషలాడటమే లక్ష్యంగా పనిచేయాలని జగన్‌రెడ్డి తన పార్టీ వారి వద్ద మొహమాటం లేకుండా చెబుతారు. ఎవరిని ఏ భాషలో తిట్టాలో కూడా తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఆదేశాలు వెళతాయి. ఈ ఆదేశాలు పాటించని వారిలో కొందరికి ఇప్పుడు టికెట్లు నిరాకరిస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగన్‌నూ, విజయమ్మనూ తిట్టిపోసిన ప్రస్తుత మంత్రి బొత్స ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశాలతో ఎవరినైనా తిట్టడానికి ముందుంటున్నారు. జగన్‌ చల్లని చూపు తమపై ఉండాలంటే తప్పదు మరి అని బొత్స బాటలో మరికొందరు నడుస్తున్నారు.

..అన్నిసార్లూ మోసం చేయలేం!

ఇదిలావుంటే, దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా రికార్డులకు ఎక్కి కూడా తనను పేదల ప్రతినిధిగానే చెప్పుకోవడం మరో జగన్మాయ. దళితులు, బడుగులు, పేదల తరఫున ఆ వర్గాలకు చెందినవారు ఎదగాల్సిన అవసరం లేదు.. మీ కోసం సంపన్నుడైన తాను ఉంటానని చెప్పుకొంటుంటారు. గతంలో కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించిన పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి, మాకినేని బసవపున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు వంటి వారు భూస్వాముల కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ తమ ఆస్తులను పేదలకు పంచి వారి కోసం పోరాడారు. ఇప్పుడు ఈ నయా పేదల ప్రతినిధి అయిన జగన్మోహన్‌ రెడ్డి పేదల తరఫున మాట్లాడుతూ అపర కుబేరుడిగా అవతరిస్తున్నారు. ఇది జగన్‌ మార్కు రాజకీయం. అందుకే తర తమ భేదం లేకుండా తన దారికి అడ్డు చెప్పే వారందరినీ పెత్తందారులుగా చిత్రించే పనిలో బిజీగా ఉంటారు. ఈ ఐదేళ్లలో పేదలకు జరిగిన మేలెంత? జగన్‌కు జరిగిన మేలెంతో లెక్కగట్టి నిగ్గు తేల్చితే అసలైన పెత్తందారుడు ఎవరో తేలిపోతుంది. ఒకరిని ఒకసారి మోసం చేయవచ్చు. అందరినీ కూడా ఒకసారి మోసం చేయవచ్చు. కానీ అందరినీ అన్నిసార్లూ మోసం చేయలేం. జగన్‌రెడ్డి విషయంలో కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. ప్రస్తుతానికి అన్నాచెల్లెలి మధ్య మొదలైన ఆటను గమనిద్దాం!

ఆర్కే

Updated Date - Jan 28 , 2024 | 06:19 AM