హింసావలయం
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:08 AM
సోనేమార్గ్ దగ్గర ఒక భారీ నిర్మాణ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఏడుగురిని ఆదివారం సాయంత్రం మిలిటెంట్లు కాల్చిచంపడంతో జమ్మూకశ్మీర్ ‘ప్రశాంతత’ మరోసారి భగ్నమైంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన...
సోనేమార్గ్ దగ్గర ఒక భారీ నిర్మాణ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఏడుగురిని ఆదివారం సాయంత్రం మిలిటెంట్లు కాల్చిచంపడంతో జమ్మూకశ్మీర్ ‘ప్రశాంతత’ మరోసారి భగ్నమైంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సొరంగమార్గం పనులలో పాల్గొంటున్న సిబ్బందిని లక్ష్యంగా పెట్టుకుని మిలిటెంట్లు కాల్పులు జరిపారు. కశ్మీర్ స్థానికుడైన ఒక వైద్యుడు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ఇంజనీర్లు, కార్మికులు ఆరుగురు ఈ దాడిలో మరణించారు. నిర్మాణంలోని సొరంగమార్గం జమ్మూకశ్మీర్ నుంచి లడఖ్‌కు వెళ్లేమార్గాన్ని సుగమం చేసి, పర్యాటకాభివృద్ధికి దోహదం చేస్తుంది. జమ్మూకశ్మీర్‌కు ఇతర ప్రాంతాల నుంచి కార్మికులు, ఉద్యోగులు రావడాన్ని, వనరులను అన్యాక్రాంతం చేయడానికి అనువైన అభివృద్ధిని చేపట్టడాన్ని కశ్మీరీ తీవ్రవాదులు వ్యతిరేకిస్తున్నారు. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ఒకటి ఈ కాల్పులకు తమదే బాధ్యత అని ప్రకటించింది. యథావిధిగా దేశ హోంమంత్రి, కశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ హింసాత్మక దాడిని ఖండించారు. అబ్దుల్లా ప్రమాణస్వీకారం తరువాత ఈ రకం సంఘటన ఇది రెండోది.
జమ్మూకశ్మీర్ ప్రతిపత్తిని నిర్వచించే 370 ఆర్టికల్ నిర్వీర్యంచేసి , కేంద్ర ప్రభుత్వం 2019లో కీలకనిర్ణయం తీసుకున్నది. మిలిటెంట్ సంస్థల సానుభూతిపరులనే కాక, ప్రధాన రాజకీయపార్టీల నేతలను కూడా నిర్బంధంలో ఉంచింది. సాధారణ ప్రజలు ఇటువంటి పరిష్కారాన్నే కోరుకుంటున్నారని, ఫలితంగా లభించే అభివృద్ధిని చూసి సంతోషిస్తారని ప్రభుత్వం చెప్పింది. వేర్పాటు, అధిక అధికారాలు వంటి విషయాలను పక్కనబెడితే, రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌తో పాటు, 35(ఎ) కూడా డొల్లగా మారిపోవడంతో, జమ్మూకశ్మీర్ ప్రజలకు ఉండిన ప్రత్యేక హక్కులు పోయాయి. నివసించే, ఆస్తి కలిగి ఉండే హక్కు రాష్ట్రంలోని స్థానికులకు మాత్రమే ఉండేది. అది వారి వనరులకు, ఉపాధికి గ్యారంటీగా ఉండేది. అధిక ప్రతిపత్తి కలిగి ఉండే రాష్ట్రం స్థాయి నుంచి, కేంద్రానికి అధీనంగా మిగిలే కేంద్రపాలిత ప్రాంతం స్థాయికి, జమ్మూకశ్మీర్ ప్రభ తగ్గిపోయింది. ప్రజలలో దీనిపై ఉన్న తీవ్ర అసంతృప్తి ఇటీవలి ఎన్నికలలో వ్యక్తమైంది.
స్థానికేతరుల మీద దాడులు రెండు మూడేళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కొద్దికాలం ఏ సంఘటనా లేకపోయేసరికి, కశ్మీర్ పూర్తి ప్రశాంత స్థితికి వచ్చిందని, తమ విధానాలు ఫలించాయని కేంద్రప్రభుత్వం చెప్పుకోసాగింది. సాపేక్ష ప్రశాంతపరిస్థితి ఏర్పడింది కాబట్టి, ఎన్నికలను నిర్వహించగలుగుతున్నామని చెప్పింది. నిజానికి ఎన్నికల నిర్వహణకు తీవ్రవాదుల నుంచి ఆటంకాలు వస్తాయని కేంద్రం భయపడలేదు, ఎన్నికలలో, పూర్తి వ్యతిరేక ఫలితాలు వస్తాయని, కొత్తగా వచ్చే ప్రభుత్వం 370 పునరుద్ధరణ కోరే తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెడుతుందేమోనని కేంద్రం అనుమానించింది. అటువంటి ప్రమాదాన్ని నివారించడానికి వీలుగా రాష్ట్ర అసెంబ్లీ నిర్మాణాన్ని, గవర్నర్ అధికారాలను పకడ్బందీగా నిర్వచించింది. ఏ తీర్మానం ప్రవేశపెట్టాలన్నా, రాష్ట్రప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరవలసిందే.
తమకు ఉన్న అవకాశాల మేరకు ప్రజలు కేంద్రానికి వ్యతిరేక తీర్పే ఇచ్చారు. అదే సమయంలో, భారతీయ జనతాపార్టీ జమ్మూ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని పెంచుకున్నది. 370 సంగతి పక్కనబెట్టినా, స్థానికులకు వనరులపై, ఉపాధిపై ఉన్న ప్రత్యేక హక్కును పునరుద్ధరించాలని కోరిన పక్షంలో కాంగ్రెస్‌కు జమ్మూలో కొంత ఆదరణ లభించి ఉండేది. కానీ, కాంగ్రెస్ ఆచితూచి, భయంభయంగా కశ్మీర్‌లో పోటీచేసింది. రాజకీయంగా వ్యక్తీకరణకు ఆస్కారం లేకపోయేసరికి, మిలిటెంట్లకు అవకాశం చిక్కుతుంది. స్థానికేతరుల మీద దాడులు గురిపెట్టి వారు తమ ఉనికిని, ఉద్దేశ్యాలను చాటుతున్నారు.
పొట్టకూటి కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చి పనిచేసే నిరుపేద కార్మికులను లక్ష్యం చేసుకుని దాడులు చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఉద్యోగులు, నిపుణులు విషయంలో అయినా సరే, తుపాకులు గురిపెట్టడం అమానుషం. ప్రభుత్వ విధానాలకు వారు ఏ విధంగానూ బాధ్యులుకారు. ప్రభుత్వం నిర్మిస్తున్న రహదారి, సొరంగమార్గాలలో కార్మికులకు వైద్య సేవలందించే ఒక వైద్యుడిని కూడా తీవ్రవాదులు చంపారు. స్థానికుడైన ఆ డాక్టర్ అంత్యక్రియలకు వేలాదిమంది హాజరయ్యారు. హతులైన ఇంజనీర్ల భార్యాబిడ్డల రోదనలు హృదయవిదారకంగా ఉన్నాయి.
చిన్న పోలీసు కానిస్టేబుల్‌ను కూడా బదిలీచేసే, నియమించే, తొలగించే అధికారం ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి లేదు. ఆయన ఏ విధంగానూ ఇటువంటి చర్యలను నిరోధించలేరు, అణచివేయలేరు. కానీ, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం వచ్చిన తరువాత హింస పెరిగిందన్న అపవాదు మాత్రం క్రమంగా పెరిగి పెద్దదవుతుంది. ఏదో ఒక సమయంలో తిరిగి గవర్నర్ పాలనకు సమర్థన పెరుగుతుంది. కశ్మీర్ మౌలిక సమస్యలు, ఆకాంక్షలను పట్టించుకుని, ఏదో ఒక స్థాయి పరిష్కారాన్ని అన్వేషించకపోతే, ఈ హింసా వలయం కొనసాగుతూనే ఉంటుంది.