Share News

‘సంకీర్ణ’ బడ్జెట్‌

ABN , Publish Date - Jul 24 , 2024 | 04:47 AM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024–25 సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌ ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేసింది. అలాగే, బీజేపీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ మనుగడ, ప్రయోజనాలకు...

‘సంకీర్ణ’ బడ్జెట్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024–25 సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌ ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేసింది. అలాగే, బీజేపీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ మనుగడ, ప్రయోజనాలకు అనుగుణంగా తమ భాగస్వామ్య పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలకు అధిక నిధులు ఇచ్చే ప్రయత్నమూ జరిగింది. మెరుగైన కేటాయింపుల ద్వారా తెలుగుదేశం, జనసేన, జనతాదళ్‌ (యునైటెడ్‌) పార్టీలను ఆర్థికమంత్రి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కొత్తగా గెలుచుకున్న ఒడిశాలో నిలదొక్కుకోవడానికి ఆ రాష్ర్టానికి ప్రత్యేకంగా చేసిన కేటాయింపులు ఉపకరిస్తాయి.

గత ఐదేళ్ళ అస్తవ్యస్త పాలన కారణంగా రాజధాని అంటూ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మిగిలిపోయింది. ఆ లోటును తీర్చడానికి కేంద్ర బడ్జెట్లో రూ.15 వేల కోట్ల ఆర్థిక సహాయం ఉపకరిస్తుంది. భవిష్యత్తులో రాజధానికి మరిన్ని నిధులు అందించే ప్రయత్నం సాగుతుందని కూడా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్లిప్త వైఖరి కారణంగా అసంపూర్తిగా ఉండిపోయిన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని ప్రకటించడం, విశాఖపట్టణం–చెన్నై, హైదరాబాద్‌–బెంగళూరు కారిడార్‌లలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం బాగుంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో హామీలకు అనుగుణంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూడా కొన్ని కేటాయింపులు జరిగాయి. ఇదేరీతిలో ఎన్‌డీఏలో భాగస్వామి అయిన మరో కీలక రాష్ట్రం బిహార్‌కు కూడా భూరి కేటాయింపులు, భారీ ప్రాజెక్టులతో బడ్జెట్లో మంచి వాటా దక్కింది. బిహార్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల సర్వతోముఖాభివృద్ధి కోసం ‘పూర్వోదయ’ ప్రణాళిక రూపొందించనున్నట్టు కూడా ఆర్థికమంత్రి ప్రకటించారు.


ఎనిమిదిమంది బీజేపీ ఎంపీలను ఇచ్చిన తెలంగాణకు ఈ బడ్జెట్‌లో ఏమాత్రం చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సంకీర్ణధర్మాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకున్న కేంద్రప్రభుత్వం విభజనచట్టంలో తెలంగాణకు ఉన్న హామీలను విస్మరించింది. పాలమూరు–రంగారెడ్డి సహా ఏ ఒక్క అంశంలోనూ కేంద్రంనుంచి సహకారం దక్కని, తెలంగాణ ఊసేలేని బడ్జెట్‌ ఇది. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దని పక్షంలో బీజేపీ రాజకీయంగా నష్టపోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హెచ్చరికను అర్థం చేసుకోవచ్చు.

తొలి పదేళ్ళకు భిన్నంగా ఈ మూడోవిడత పాలనలో మోదీ ప్రభుత్వం తనను నిలబెడుతున్న రెండు పార్టీల డిమాండ్లకు తలొగ్గి ఆ రాష్ట్రాలకు కేటాయింపులు చేయడంతో విపక్షాలు దీనిని సర్కార్‌ బచావో, కుర్సీ బచావో బడ్జెట్‌గా వ్యాఖ్యానిస్తున్నాయి. బిహార్‌ సంగతి అటుంచితే, ఆంధ్రప్రదేశ్‌ మాత్రం ఈ ప్రత్యేక సహాయానికి యోగ్యమైనదే. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని, పోలవరం ఎంతముఖ్యమో, వాటికి కేంద్రం చేయూతనివ్వడం ఎంత అవసరమో విపక్షనేతలకు తెలియనిదేమీ కాదు. ఇక, యువత, ఉపాధి, నైపుణ్యాలకు సంబంధించి బడ్జెట్‌లో ప్రకటించిన పథకాలు అనేకం తన మానిఫెస్టోనుంచి తీసుకున్నారని కాంగ్రెస్‌ గుర్తుచేస్తోంది. రాహుల్‌ న్యాయ్‌యాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు కూడా ఈ బడ్జెట్‌లో ప్రతిఫలించాయని అంటోంది.

దేశాన్ని వికసిత్‌ భారత్‌గా తీర్చిదిద్దే క్రమంలో తొమ్మిది కీలక ప్రాధాన్యతలను ఆర్థికమంత్రి ప్రకటించారు. వ్యవసాయ ఉత్పాదకతల పెంపునకు పెద్దపీట వేశారు. కోటి మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా ప్రోత్సహించడం, కూరగాయల ఉత్పత్తిని పెంచడానికి క్లస్టర్ల ఏర్పాటు వంటి ప్రతిపాదనలు వ్యవసాయరంగాన్ని ఉత్తేజితం చేస్తాయి.


ఉపాధి కల్పనను కూడా ప్రభుత్వం ప్రాధాన్యతాంశంగా చెబుతోంది. కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించే యాజమాన్యాలకు ప్రోత్సాహకాలు ప్రకటించడం బాగుంది. దీర్ఘకాలంగా ఆదాయపు పన్ను విభాగంలో ఎలాంటి మార్పులు జరగనందున, కొత్త ఐటీ అసెస్‌మెంట్‌ విధానం ఎంచుకునే వారికి కొన్ని ప్రయోజనాలు దక్కాయి. స్టాండర్డ్‌ డిడక్షన్‌ మొత్తాన్ని, వివిధ ఐటీ శ్లాబ్‌లలోకి వచ్చే ఆదాయ పరిమితిని పెంచడం వల్ల ఒక్కో ఐటీ అసెసీకి ఏడాదికి రూ.17,500 మేరకు పన్ను భారం తగ్గుతుందని అంచనా. మూడు కేన్సర్‌ ఔషధాలపై కస్టమ్స్‌ సుంకం జీరో స్థాయికి తగ్గించడం పరోక్ష పన్నుల విభాగంలో తీసుకున్న పెద్ద చర్య. దీని వల్ల కేన్సర్‌ రోగులకు ప్రాణాధార ఔషధాలు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. మహిళా ఆధారిత అభివృద్ధిని ఉత్తేజితం చేయడానికి మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్లు కేటాయించడం సముచితం. ప్రభుత్వం ప్రాధాన్యతా విభాగాలుగా ప్రకటించిన పేదలు, యువత, అన్నదాత, మహిళలకు ప్రయోజనం చేకూర్చే ప్రతిపాదనలు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఆరోగ్య రంగానికి చెప్పుకోదగ్గ ప్రాధాన్యం లభించకపోవడం నిరాశ కలిగిస్తుంది.

Updated Date - Jul 24 , 2024 | 04:47 AM