Share News

చెస్‌లో సువర్ణాధ్యాయం

ABN , Publish Date - Sep 25 , 2024 | 04:53 AM

భారత చెస్‌ అంటే దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ గుర్తుకొస్తాడు. ప్రపంచ చదరంగ చిత్రంపై విషీ అంతలా తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు ఆయన బాటలో సాగుతూ మన యువకిశోరాలు...

చెస్‌లో సువర్ణాధ్యాయం

భారత చెస్‌ అంటే దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ గుర్తుకొస్తాడు. ప్రపంచ చదరంగ చిత్రంపై విషీ అంతలా తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు ఆయన బాటలో సాగుతూ మన యువకిశోరాలు అదరగొడుతున్నారు. క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌లో విన్నర్‌, ప్రపంచకప్‌లో రన్నరప్‌, ప్రపంచ బ్లిట్జ్‌ చెస్‌లో పతకం.. ఇలా ప్రతి అంతర్జాతీయ ఈవెంట్‌లోనూ తమదైన ఆటతీరుతో సమర్థత చాటుతున్నారు. తాజాగా.. చెస్‌ ఒలింపిక్స్‌గా పిలుచుకునే ఒలింపియాడ్‌లోనూ స్వర్ణచరిత్ర సృష్టించి చదరంగంలో మరింత ‘ఎత్తు’కు దూసుకెళ్లారు.


అరవై నాలుగుగళ్ల ఆటలో సంచలనాల మోత మోగిస్తున్న భారత క్రీడాకారులు.. హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన చెస్‌ ఒలింపియాడ్‌లో చాంపియన్లుగా నిలిచి అరుదైన ఘనత సాధించారు. 193 జట్లు పోటీపడ్డ పురుషుల విభాగం, 181 జట్లు తలపడ్డ మహిళల కేటగిరిలోనూ సత్తా చాటి భారత చెస్‌ చరిత్రలో తొలిసారి రెండు స్వర్ణాలు కొల్లగొట్టారు. ఇప్పటిదాకా కాంస్య పతకాలకే పరిమితమైన మన జట్లు ఈమారు ఏకంగా టైటిల్‌తో మురిపించారు. వందేళ్ల చెస్‌ ఒలింపియాడ్‌ చరిత్రలో ఏకకాలంలో ఒకే దేశానికి చెందిన రెండుజట్లు విజేతలుగా నిలవడం ఇది మూడోసారే. గతంలో చైనా, రష్యా ఒకే అంచెలో రెండు పసిడి పతకాలు గెలిచి రికార్డు సృష్టించాయి.

పెంటేల హరికృష్ణ, అర్జున్‌ ఇరిగేసి, గుకేష్‌, ప్రజ్ఞానంద, విదిత్‌ గుజరాతీలతో కూడిన భారత పురుషుల జట్టు చెస్‌ ఒలింపియాడ్‌లో పూర్తి ఆధిపత్యంతో ఆడిన తీరు అమోఘం. పదునైన వ్యూహాలు, విభిన్నమైన ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తుచేస్తూ ఆరంభం నుంచి అగ్రస్థానంలోనే కొనసాగిన జట్టు, చివరిదాకా అంతే జోరును చూపుతూ అద్భుత ఫలితాన్ని రాబట్టిన తీరు ప్రశంసనీయం. ఒక్క రౌండ్‌లోనూ ఓటమన్నదే లేకుండా అజేయంగా ఆడిన మన ఆటగాళ్లు.. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఉజ్బెకిస్థాన్‌, టాప్‌సీడ్‌ అమెరికాలాంటి అగ్రశ్రేణి జట్లను దాటుకొని విజయకేతనం ఎగురవేశారు. ద్రోణవల్లి హారిక, తానియా సచ్‌దేవ్‌, వైశాలి, దివ్యా దేశ్‌ముఖ్‌, వంతికా అగర్వాల్‌లతో కూడిన మహిళల జట్టూ టోర్నీలో చూపిన తెగువ అంతాఇంతా కాదు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన మన అమ్మాయిల బృందం.. చైనా, రష్యాలాంటి బలమైన జట్లను ఢీకొని విజయదుందుభి మోగించింది.


భారత జట్ల చారిత్రక ప్రదర్శనలో తెలుగు క్రీడాకారుల ప్రదర్శన ఎనలేనిది. పురుషుల జట్టులో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ప్రధాన భూమిక పోషించాడు. బోర్డుపై తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తుచేస్తూ జట్టు చాంపియన్‌గా నిలవడానికి బాటలు వేశాడు. తానాడిన మొత్తం పదకొండు గేముల్లో తొమ్మిది విజయాలు సాధించాడంటేనే అర్జున్‌ నైపుణ్యం ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. మరో తెలుగు ఆటగాడు హరికృష్ణ తన అనుభవంతో సహచర ఆటగాళ్లకు మార్గదర్శనం చేస్తూ జట్టును గెలుపు దిశగా నడిపించాడు. ఇక హారిక కీలక సమయాల్లో ప్రత్యర్థులను ఓడించి మహిళల జట్టు పసిడి పతకం నెగ్గడంలో కీలక భాగమైంది. తొమ్మిది గేమ్‌ల్లో మూడింటిలో విజయాలు సాధించి, మూడు గేమ్‌లను డ్రా చేసుకున్న హారిక.. నిర్ణాయక ఆఖరి రౌండ్‌ గేమ్‌లో పైచేయి సాధించి భారత విజయాన్ని ఖరారు చేసిన తీరు అద్భుతం.


చెస్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రాండ్‌మాస్టర్‌ హోదాను పొందిన తొలి భారతీయుడిగా నిలిచిన విశ్వనాథన్‌ ఆనంద్‌.. 1988లోనే ఆ ఘనతను సాధించి దేశంలో ఈ క్రీడకు ఊపిరి పోశాడు. అనంతరం ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచి చదరంగంలో భారత్‌ సత్తాను ఘనంగా చాటాడు. ఆనంద్‌ స్ఫూర్తితో ఇటీవలికాలంలో అనేక మంది భారత క్రీడాకారులు ప్రపంచ వేదికపై తమదైన ముద్ర వేస్తున్నారు. 1988 నుంచి 2017 నాటికి మన దేశంలో గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య 50 ఉంటే.. ఈ ఏడేళ్లలో మరో 35 మంది కొత్త గ్రాండ్‌మాస్టర్లుగా అవతరించారు. ముఖ్యంగా గుకేశ్‌, ప్రజ్ఞానంద, అర్జున్‌లాంటి యువ ఆటగాళ్లు ఒత్తిడిని సమర్థంగా తట్టుకుంటూ అంతర్జాతీయస్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. కొన్నేళ్లుగా చెస్‌ను శాసిస్తున్న ప్రపంచ నెంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో పాటు అత్యుత్తమ ఆటగాళ్లను ఓడిస్తూ ప్రభంజనాలు సృష్టిస్తున్నారు. ప్రజ్ఞానంద నిరుడు ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిస్తే, ఈ ఏడాది క్యాండిడేట్స్‌ టోర్నీలో గుకేశ్‌ టైటిల్‌ గెలవడమే అందుకు నిదర్శనం. ఇప్పుడు సాధించిన ఒలింపియాడ్‌ విజయంతో భారత చదరంగంలో మన యువ తరంగాలు సువర్ణాధ్యాయాన్ని లిఖించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Updated Date - Sep 25 , 2024 | 04:53 AM