‘మహా’ విజయం ఎలా సాధ్యమైంది?
ABN , Publish Date - Nov 30 , 2024 | 05:47 AM
ఈ నెల 15న ప్రచురితమైన నా కాలమ్ శీర్షిక ‘వెలలేని మాగాణి మహారాష్ట్ర’. బీజేపీ, శివసేన, ఎన్‌సీపీలతో కూడిన మహాయుతి కూటమి నవంబర్ 20 ఎన్నిక
ఈ నెల 15న ప్రచురితమైన నా కాలమ్ శీర్షిక ‘వెలలేని మాగాణి మహారాష్ట్ర’. బీజేపీ, శివసేన, ఎన్‌సీపీలతో కూడిన మహాయుతి కూటమి నవంబర్ 20 ఎన్నికలలో ఆ ‘మాగాణి’ని గెలుచుకున్నది. ఆ విజయం తిరుగులేనిది అనడానికి నేనేమీ సంకోచించను. మహారాష్ట్ర శాసనసభలోని 238 సీట్లకు గాను 230 స్థానాలను మహాయుతి స్వాయత్తం చేసుకున్నది.
మహాయుతి మహా విజయానికి ప్రధాన కారణమేమిటి? ఈ విషయమైపెద్ద చర్చ ప్రారంభమయింది. లడ్కీ బెహన యోజన (ఎల్‌బివై) కారణమని అత్యధికులు అంగీకరిస్తున్నారు. ప్రతి గృహిణికి (కుటుంబ వార్షిక ఆదాయం రెండున్నర లక్షల రూపాయల కంటే తక్కువగా ఉన్న పక్షంలో) నెలకు రూ.1500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని మహాయుతి వాగ్దానం చేసింది. ముఖ్యమంత్రి శిందే ప్రభుత్వం గత జూలై 1 నుంచి ఆ పథకాన్ని అమలుపరుస్తోంది. 2.5 కోట్ల మంది గృహిణులు ఎల్‌బివై లబ్ధిదారులుగా ఉన్నారు. తమను మళ్లీ ఎన్నుకున్న పక్షంలో ఆ ఆర్థిక సహాయాన్ని రూ.2100కు పెంచుతామని కూడా మహాయుతి హామీ ఇచ్చింది. లడ్కీ బెహన యోజన సంపూర్ణంగా విజయవంతమయింది. వ్యవసాయరంగంలో దురవస్థలు, పెచ్చరిల్లి పోతున్న నిరుద్యోగిత, గ్రామీణ మహిళలకు కొరవడిన ఉపాధి అవకాశాలు, గ్రామీణ వేతనాలు గొర్రె తోకలా ఉండిపోవడం, ద్రవ్యోల్బణం మొదలైన సమస్యలు ఆ ఆర్థిక సహాయ పథకం ప్రజలను విశేషంగా ఆకట్టుకునేలా చేశాయి. అయితే అదేమీ వినూత్న పథకమేమీ కాదు. అదొక అనుకరణ పథకం. మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటికే అమలవుతున్న పథకాలను అనుసరించి ఎల్‌బివైను రూపొందించారు. సరే, మహాయుతి ప్రధాన ప్రత్యర్థి ఎమ్‌వీఏ సైతం తాము అధికారంలోకి వస్తే ప్రతి పేద మహిళకు నెలకు రూ.3000 చొప్పున ఆర్థిక సహాయమందిస్తామని హామీ ఇచ్చింది. పాలక, ప్రతిపక్ష కూటముల వాదనలను తుల్యంగా చూస్తే లడ్కీ బెహన యోజన ఎన్నికలలో మహాయుతి విజయానికి దోహదం చేసిన నిర్ణయాత్మకమైన కారణమని నేను భావించడం లేదు.
ఒక ప్రచ్ఛన్న సందేశం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేసిందని నేను భావిస్తున్నాను. బీజేపీ నాయకత్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు ఆ సందేశాన్ని మహారాష్ట్ర ఓటర్లకు చేరవేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శ్రేణులు ఆ సందేశాన్ని మరింత విపులంగా ప్రజల మనసుల్లో నాటాయి. బీజేపీ నాయకత్రయం రెండు నినాదాలనిచ్చారు. ఒకటి– ‘ఏక్ హై తో సేఫ్ హై’ (మనం ఒకటిగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం); రెండోది ‘బాతేంగే తో కటేంగే’ (విభజనలతో వినాశనమవుతాం). ఈ నినాదాలు తటస్థ స్వభావంతో ఉన్నట్టు అనిపిస్తుంది కదూ. అయితే అదొక వంచనాత్మక తటస్థత. నిజానికి ఒక నిర్దిష్ట సామాజిక సమూహాన్ని ఉద్దేశించే ఆ నినాదాలనిచ్చారు. ‘లవ్ జిహాద్’, ‘ఓట్ జిహాద్’పై భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రసంగాలు అడ్డు ఆపూ లేకుండా జరిగాయి. పాత నినాదాలు అయిన ‘తుక్డే తుక్డే గ్యాంగ్’, ‘అర్బన్ నక్సల్స్’ను పునరుద్ధరించి విరివిగా ఉపయోగించుకున్నారు. ఈ సందేశాలను చాల చాకచక్యంగా వెలువరించారు. లక్ష్యంగా పెట్టుకున్న సామాజిక వర్గాలకు చేరేలా చేయడంలో సఫలమయ్యారు. ఇది గమనించిన తరువాత గత లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ నాయకుల ప్రచారం గుర్తుకువచ్చింది. ‘మీకు రెండు గేదెలు ఉంటే ఒకదాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకెళుతుంది. మీ మంగళసూత్రాలను సైతం తీసుకువెళతారు. అలా తీసుకు వెళ్లిన వాటినన్నిటినీ అధిక సంతానం ఉన్న వారికి ఇచ్చి వేస్తారు’ అని మోదీ ప్రభృతులు ప్రచారం చేయలేదూ?!
బీజేపీ నాయకులు ఏ సామాజిక సమూహానికి ఆ సందేశాలను ఉద్దేశించారన్నది స్పష్టమే. ఆ లక్ష్యిత సామాజిక సమూహానికి ఏ సామాజిక సమూహం నుంచి ప్రమాదం వాటిల్లనున్నదని నర్మగర్భితంగా చెప్పారన్నది కూడా తేటతెల్లంగా తెలుస్తూనే ఉన్నది. కాలమిస్ట్ ఆర్. జగన్నాథన్ (బీజేపీ సానుభూతిపరుడు) ఆ ప్రభావశీల నినాదాలను హిందూ ఓటర్లను సంఘటితం చేసేందుకు ఇచ్చారని అంగీకరించారు. ఈ ఏడాది విజయదశమి రోజున ఆరెస్సెస్ సర్ సంఘ్ ప్రచారక్ మోహన్ భాగవత్ వెలువరించిన ప్రసంగ సారాంశాన్ని ఆ కొత్త నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. మోహన్ భాగవత్ ఆ ప్రసంగంలో ఇలా అన్నారు: ‘అసంఘటితంగా, బలహీనంగా ఉండిపోతే దుర్మార్గుల దురాగతాలను కొని తెచ్చుకోవడమే అవుతుందన్న సత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ తెలుసుకోవాలి’. ఈ నినాదాలు, ప్రసంగాలు అన్నీ విద్వేషపూరిత ప్రచారంలోను, ‘విభజించి గెలవడం’ అనే ఎన్నికల వ్యూహంలో భాగమే.
ప్రతి దేశంలోను మైనారిటీ వర్గాలు ఉంటాయి. అవి మతపరమైనవి లేదా భాషా పరమైనవి లేదా జాతి పరమైనవి కావచ్చు. అమెరికాకు నల్ల జాతి ప్రజలు, లాటినోలు; చైనాకు ఉయీఘర్ ముస్లింలు; పాకిస్థాన్‌కు షియాలు; బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లకు హిందువులు; శ్రీలంకకు తమిళులు, ముస్లింలు; ఆస్ట్రేలియాకు మూలవాసులు; ఇజ్రాయెల్‌కు అరబ్‌లు, యూరోపియన్ దేశాలకు యూదులు, రోమాలు మైనారిటీ వర్గాలు. తమ మైనారిటీ వర్గాల భద్రతకు కౌన్సిల్ ఆఫ్ యూరోప్ 1998లో ‘ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ నేషనల్ మైనారిటీస్’ను ఆమోదించింది తమ తమ సమాజాలలోని అన్ని వర్గాల మధ్య సమానత్వాన్ని పెంపొందించేందుకు, జాతీయ మైనారిటీల సంస్కృతి, అస్తిత్వాన్ని పరిరక్షించేందుకు ఈ ఒడంబడికను ఉద్దేశించారు. రాజనీతిజ్ఞుడు, సామాజిక తాత్వికుడు అయిన డాక్టర్ అంబేడ్కర్ ఎంతో దూరదృష్టితో మైనారిటీల హక్కులను భారత రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక హక్కులుగా పొందుపరిచారు.
బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో హిందువుల హక్కుల పరిరక్షణ విషయమై భారత ప్రభుత్వమూ, భారతీయులూ తరచు భావోద్వేగాలకు లోనవుతుంటారు. పొరుగు దేశాలలోని హిందువుల హక్కుల గురించి ప్రభుత్వ నాయకులు గట్టిగా మాట్లాడుతుంటారు. విదేశీ విశ్వవిద్యాలయాలలో భారత సంతతికి చెందిన విద్యార్థులకు ఎదురవుతున్న వేధింపుల గురించి కూడా మనం ఆందోళన చెందుతుంటాం. విదేశాలలోని హిందూ ఆలయాలు, సిక్కు గురుద్వారాలపై దాడులు జరిగినప్పుడు మనం బిగ్గరగా మండిపడుతుంటాం. అయితే విదేశాలు, మానవ హక్కుల సంఘాలు మన దేశంలోని మైనారిటీ వర్గాలకు ఎదురవుతున్న వేధింపుల గురించి ప్రస్తావించినప్పుడు, ప్రశ్నించినప్పుడు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి ‘మా అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని’ హెచ్చరిస్తుంది. ఇదొక నయవంచన ధోరణి, సందేహం లేదు. బంగ్లాదేశ్‌లో ఒక హిందూ సాధువును అరెస్ట్ చేశారు; ఇస్కాన్‌ను నిషేధించాలన్న డిమాండ్ పెరుగుతోంది. బంగ్లాదేశ్‌లో పరిణామాలకు ప్రతిస్పందనగా మన దేశంలోని ఒక మఠం అధిపతి ‘ముస్లింలకు ఓటింగ్ హక్కులు నిరాకరించాలని’ అన్నట్టు వార్తలు వచ్చాయి. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రెండు సంకుచిత వైఖరులు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కావు. ‘విభజించి గెలిచే’ రాజకీయ క్రీడను ఎన్‌డీఏ కొనసాగిస్తున్న పక్షంలో మైనారిటీల సమస్య భారత్‌ను వెంటాడుతూనే ఉంటుంది. ఆ ఎన్నికల ఎత్తుగడ బ్రిటిష్ వలస పాలకుల కుటిల ‘విభజించి పాలించు’ వ్యూహానికి భిన్నమైనది కాదు.
‘విభజించి గెలిచే’ రాజకీయ క్రీడను ఎన్‌డీఏ కొనసాగిస్తున్న పక్షంలో మైనారిటీల సమస్య భారత్‌ను వెంటాడుతూనే ఉంటుంది. ఆ ఎన్నికల ఎత్తుగడ బ్రిటిష్ వలస పాలకుల కుటిల ‘విభజించి పాలించు’ వ్యూహానికి భిన్న మైనది కాదు.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)