కశ్మీర్‌లో కొత్త ఆరంభం!
ABN , Publish Date - Sep 18 , 2024 | 12:32 AM
జమ్మూకశ్మీర్‌లో పదేళ్ళ తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 90 స్థానాల్లో, నేడు తొలివిడతలో ప్రజలు 24 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోబోతున్నారు. పిర్ పంజాల్ పర్వతసానువులకు అటూఇటూగా...
జమ్మూకశ్మీర్‌లో పదేళ్ళ తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 90 స్థానాల్లో, నేడు తొలివిడతలో ప్రజలు 24 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోబోతున్నారు. పిర్ పంజాల్ పర్వతసానువులకు అటూఇటూగా జమ్మూలో మూడు, కశ్మీర్‌లో నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న స్థానాల్లో ఉగ్రవాద దాడుల ప్రమాదం కూడా పొంచివున్నందున బందోబస్తు అధికంగా ఉంది. ఐదేళ్ళక్రితం ప్రత్యేకప్రతిపత్తినీ, రాష్ట్రహోదానూ కోల్పోయి దేశంలో అతిపిన్నవయసుగల కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించిన చోట, సుప్రీంకోర్టు విధించిన గడువు మేరకు జరుగుతున్న ఈ ఎన్నికలను యావత్ ప్రపంచమూ ఆసక్తిగా గమనిస్తున్నది.
అప్పట్లో రెండు పార్టీలే చక్రం తిప్పిన వాతావరణం ఇప్పుడు మారిందని, క్షేత్రస్థాయి పరిస్థితుల్లోనూ మార్పువచ్చిందని చాలామంది అంచనా. నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్లలో మార్పుచేర్పులు భారతీయ జనతాపార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా జరిగాయని స్థానికపార్టీలు ఆరోపించిన విషయం తెలిసిందే. వీటికి తోడు, ఎంతోకాలంగా ఈ పార్టీలు ప్రజలతో ప్రత్యక్షసంబంధం లేకుండా ఉండిపోవడం కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చు. అబ్దుల్లాలు, ముఫ్తీలు తమ ఉనికి చాటుకోవడానికి ఎన్నడూ లేనంతగా కష్టపడవలసి వస్తున్నదని విశ్లేషకుల వాదన.
ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో ఒక్కమాటగా ఉన్నా, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు ఎన్నికల క్షేత్రంలో వేరుదారుల్లోనే పోతున్నాయి. అబ్దుల్లాల పార్టీ ప్రస్తుతం కాంగ్రెస్‌తో పొత్తులో ఉంది. ఈ కూటమిదే కాస్తంత పైచేయి కావచ్చునని అంటున్నారు. ఈ పార్టీలకంటే బీజేపీకి ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏ మేరకు లబ్ధిచేకూరుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే రాష్ట్రహోదా ఖాయమని బీజేపీ గట్టిగా హామీ ఇస్తోంది. మళ్ళీ ప్రత్యేక ప్రతిపత్తి అంటూ ఎవరు హామీ ఇచ్చినా ప్రజలు నమ్మవద్దనీ, అది ఎవరితరమూ కాదని బీజేపీ పెద్దలు గట్టిగా చెబుతున్నారు. ప్రత్యేకప్రతిపత్తిని తిరిగి తెస్తానని నేషనల్ కాన్ఫరెన్స్ చెప్పుకుంటున్నప్పటికీ, కాంగ్రెస్ నేరుగా ఈ మాట అనకుండా రాష్ట్రహోదా విషయంలో మాత్రం గట్టి హామీ ఇస్తోంది. స్థానిక అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా కొన్ని స్థానాల్లో ఈ రెండు పార్టీలూ ‘ఫ్రెండ్లీ కంటెస్ట్’కు దిగుతున్నాయి కూడా.
నేటినుంచి మూడు విడతల్లో సాగే ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొంటారా అన్నది ప్రశ్న. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహంగా ఉన్నమాట నిజం. కానీ, ఆ తరువాత జమ్మూకశ్మీర్ ప్రజలు ఊహించని పరిణామాలనేకం చూశారు. పీడీపీతో పొత్తు తెగదెంపులు చేసుకున్న బీజేపీ రాష్ట్రపతిపాలనతో కొత్త అంకానికి తెరదీసింది. గవర్నర్‌కు సైతం చివరివరకూ ఏమీ తెలియనిస్థితిలో, వేలాది సైనికబలగాల మోహరింపు మధ్య స్వయంప్రతిపత్తి రద్దు, స్థానికనేతల సుదీర్ఘనిర్బంధం, ప్రజలమీదా, మీడియామీదా నెలలతరబడి కొనసాగిన ఆంక్షలూ అణచివేతలూ తెలిసినవే. ఈ నిర్బంధ వాతావరణంలోనే, ఏకపక్షంగా అక్కడ అనేక కొత్త నిర్ణయాలు జరిగాయి, చట్టాలు వచ్చాయి. అభివృద్ధి పేరిట పెట్టుబడులకూ వెలుపలి వ్యక్తులకూ తలుపులు తెరుచుకున్నాయి. 370, 35(ఎ) తొలగిన తరువాతే జమ్మూకశ్మీర్ అన్ని విషయాల్లోనూ బాగుపడిందని కేంద్రం చెప్పుకుంటోంది. అనేక పథకాలద్వారా వేలకోట్లు కుమ్మరించి దాదాపు అన్ని రంగాల్లోనూ విస్తృతమైన మార్పు తెచ్చినమాట నిజం. పెట్టుబడులు ప్రవహించడంతో పాటు, వివిధ వ్యవస్థల్లో ఉన్న జడత్వం కూడా చాలామేరకు వదిలింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయని అంటారు. ఇటీవల వరుస ఉగ్రదాడులు జరిగినప్పటికీ, గతంలో కంటే ఉగ్రవాదం బాగా తగ్గిందని, తాము చేపట్టిన ప్రాజెక్టులతో ప్రజలమధ్యా, ఆయా ప్రాంతాల మధ్యా అనుసంధానం పెరిగిందని ఢిల్లీ బీజేపీ పెద్దలు ఎన్నికల ప్రచార సభల్లో చెప్పుకుంటున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఎంతో చక్కగా జరిగిన నేపథ్యంలో, ఇప్పుడు తమకు మరింత ముఖ్యమైన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం అంతకంటే ఎక్కువగా ఉంటుందనడంలో సందేహం అక్కరలేదు. అయితే, పదేళ్ళ పరిణామాలన్నింటినీ బుర్రనుంచి చెరిపేసి, సెంటిమెంట్ వదిలేసి, డెవలప్‌మెంట్ మాత్రమే చూస్తారా అన్నది ప్రశ్న. ఢిల్లీ పక్షాన ఏకపక్షంగా వ్యవహరించే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కాక, తమ గోడువినే స్థానిక నాయకులు కావాలనుకుంటున్న ప్రజలు ఎంత తెలివైన ఎంపికలు చేసుకుంటారో చూడాలి.