Share News

పొలిటికల్‌ ఎన్‌కౌంటర్‌

ABN , Publish Date - Sep 26 , 2024 | 02:05 AM

మహారాష్ట్రలోని థానేజిల్లా బద్లాపూర్‌ స్కూల్లో ఇద్దరు పిల్లలపై లైంగికదాడిచేసిన అక్షయ్‌ షిండే సోమవారం ఎదురుకాల్పుల్లో మరణించడంమీద ముంబై హైకోర్టు బుధవారం అనేక అనుమానాలు వ్యక్తంచేసింది...

పొలిటికల్‌ ఎన్‌కౌంటర్‌

మహారాష్ట్రలోని థానేజిల్లా బద్లాపూర్‌ స్కూల్లో ఇద్దరు పిల్లలపై లైంగికదాడిచేసిన అక్షయ్‌ షిండే సోమవారం ఎదురుకాల్పుల్లో మరణించడంమీద ముంబై హైకోర్టు బుధవారం అనేక అనుమానాలు వ్యక్తంచేసింది. ఏమాత్రం నమ్మదగ్గట్టుగా లేదనీ, ఓ కట్టుక‌థలాగా కనిపిస్తున్నదని ఆక్షేపించింది. పాఠశాలలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనకు సంబంధించి ఒకపక్క విచారణ జరుగుతూండగా, నిందితుడిమీద అతని మొదటిభార్య పెట్టిన కేసులో ప్రశ్నించడానికి పోలీసులు సిద్ధమైనారు. తలోజా జైల్లో ఉన్న అతడిని బద్లాపూర్‌ తీసుకుపోతుండగా, మార్గమధ్యంలో అక్షయ్‌ షిండే తప్పించుకొనే ప్రయత్నంలో ఒక పోలీసునుంచి తుపాకీ లాక్కొంటే మరో పోలీసు అధికారి కాల్పులు జరిపాడు, దీంతో నిందితుడు మరణించాడు. ఈ ఎన్‌కౌంటర్‌ మీద ప్రభుత్వం నియమించిన సిట్‌ దర్యాప్తు అయినా నిజాయితీగా జరిగేట్టు చూడాలని కోర్టు వ్యాఖ్యానించింది.


ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా పేరొందిన సంజయ్‌షిండే అనే పోలీసు అధికారి చేతిలో అక్షయ్‌షిండే అనే ఈ నిందితుడు మరణించినట్టుగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే చేసిన ప్రకటన రాజకీయంగా కూడా అగ్గిరాజేసింది. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని విపక్షాలు వ్యాఖ్యానించినందుకు ఒక పాపిని వెనకేసుకొస్తున్న పాపం మీకు తగులుతుందని బీజేపీ నాయకులు శపిస్తున్నారు. బద్లాపూర్‌ ఘాతుకం మహారాష్ట్రనే కాదు, యావత్‌ దేశాన్ని నిర్ఘాంతపరచింది. ఆస్పత్రుల్లో మహిళా వైద్యులకు భద్రతలేదని, రక్షణకరువై వారు నిస్సహాయంగా అత్యాచారాలకు గురికావాల్సి వస్తున్నదని పశ్చిమబెంగాల్‌ ఉదంతం గుర్తుచేసిన తరుణంలోనే, అభంశుభం తెలియని పిల్లలకు చివరకు ఆక్షరాలు దిద్దేచోటకూడా రక్షణలేకుండా పోయిందని బద్లాపూర్‌ ఘటన హెచ్చరించింది. బెంగాల్‌ అత్యాచార ఘటనమీద వీరోచితమైన పోరాటం సాగిస్తున్న బీజేపీని బద్లాపూర్‌ ఆత్మరక్షణలోకి నెట్టేసింది. వందలాదిమంది వీధుల్లోకి వచ్చి ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. రైళ్ళరాకపోకలను నిలిపివేశారు, విధ్వంసకాండకు పాల్పడ్డారు.

అరెస్టులు, సస్పెన్షన్లు, సిట్‌ ఏర్పాటు, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు విచారణ ఇత్యాదివి ప్రకటించి, సీనియర్‌ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌ను స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమించినప్పటికీ, ఈ ఉదంతం తమకు రాజకీయంగా తీవ్ర నష్టం చేస్తుందన్న భయం పాలకులకు లేకపోలేదు.


ఈ నేపథ్యంలో నిందితుడి ఎన్‌కౌంటర్‌ను మిగతా రాజకీయపక్షాలు అనుమానించడం, ప్రశ్నించడం సహజం. కేసు దర్యాప్తు, విచారణ కొనసాగినంత కాలం, మీడియాలో ఆ వార్తలు వినబడుతున్నంత వరకూ సదరు ఘోరం ప్రజలకు గుర్తుకొస్తూనే ఉంటుంది కనుక అధికారపక్షానికి ఆ మేరకు నష్టం తప్పదు. బుధవారం నాటి వ్యాఖ్యలను బట్టి దానిని బూటకపు ఎన్‌కౌంటర్‌ గా న్యాయస్థానం భావిస్తున్నదని అర్థం. నిందితుడు మూడుబుల్లెట్లు పేల్చితే ఒకటి మాత్రమే పోలీసు అధికారి తొడలోకి దూసుకుపోతే, మిగతా రెండు బుల్లెట్లు ఏమైనాయని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇందుకు ప్రతిగా సదరు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు కాల్చిన ఒకే ఒక్క బుల్లెట్‌ నేరుగా నిందితుడి తలలోకి దూసుకుపోయి అతడు అక్కడికక్కడే మరణించాడు. కారులో మరో నలుగురు ఉన్నా నిందితుడు మీదకు లంఘించి నియంత్రించకపోవడం, పోలీసులనుంచి అతడు తుపాకీ లాక్కోవడం, అతి సులువుగా సెకన్లలో లాక్‌ తీసి పోలీసు అధికారి దిగువభాగంలో కాల్చడం ఇత్యాది ప్రతీ దశమీదా న్యాయమూర్తి వెలిబుచ్చిన అనుమానాలు సామాన్యులకు సైతం కలిగేవే.


న్యాయస్థానం ఎంతగా హూంకరించినప్పటికీ, తమకు ఒనగూరే నష్టమేమీ లేదని, ఈ ఎన్‌కౌంటర్‌తో బద్లాపూర్‌ కథ సుఖాంతమైందని పాలకులు నమ్ముతున్నారు. ‘బద్లా పూరా’ అంటూ తుపాకీ ధరించిన ఫడ్నవీస్‌ కటౌట్‌లు మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో దర్శనమిచ్చాయి. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ఏలిన పవిత్రభూమిలో ఆడపిల్లమీద అఘాయిత్యాలకు పాల్పడే దుర్మార్గులకు శిక్షలు ఇలాగే ఉంటాయి అని వాటిమీద రాశారు. ఈ నకిలీ ఎన్‌కౌంటర్‌ కీర్తి తమ నాయకులకు దక్కాలని ఫడ్నవీస్‌, షిండే అభిమానులు పోటీపడుతున్నారు. తమ కుమారుడిని అన్యాయంగా చంపేశారంటూ నిందితుడి తల్లిదండ్రులు గుండెలుబాదుకుంటున్నా, హక్కుల సంఘాలు ప్రశ్నిస్తున్నా, ఈ తక్షణన్యాయానికి సామాన్యజనం తన్మయులై తమను కీర్తిస్తున్నందుకు పాలకులు సంతోషిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌, హర్యానాతో పాటు జరగాల్సిన మహారాష్ట్ర ఎన్నికలను ఎన్నికల సంఘం ఏ కారణంతో వాయిదావేసినప్పటికీ, నవంబరులో అవి జరగవచ్చునని అంటున్న తరుణంలో ఈ నకిలీ ఎన్‌కౌంటర్‌ తమకు మరో నాలుగు ఓట్లు తెస్తుందని పాలకులు గట్టిగా నమ్ముతున్నారు.

Updated Date - Sep 26 , 2024 | 02:17 AM