Share News

చింతనాత్మక రాజకీయాలు యేవీ?

ABN , Publish Date - Aug 23 , 2024 | 05:55 AM

వికసిత్‌ భారత్‌! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగంలోని ప్రధాన అంశాన్ని, స్వాతంత్ర్య శతాబ్ది (1947) భారత్‌ గురించిన ఆయన దార్శనికతను ఆ ఒక్కమాటలో సంక్షేపించి

చింతనాత్మక రాజకీయాలు యేవీ?

వికసిత్‌ భారత్‌! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగంలోని ప్రధాన అంశాన్ని, స్వాతంత్ర్య శతాబ్ది (1947) భారత్‌ గురించిన ఆయన దార్శనికతను ఆ ఒక్కమాటలో సంక్షేపించి చెప్పవచ్చు. ‘అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌’.. ఇది బాగా అరిగిపోయిన మాట కాదూ? 1950 దశకం రాజకీయ వాగ్ఝరిలోని ఆ భావన అప్పటి నుంచి ఇప్పటికీ రాజకీయవేత్తల, ముఖ్యంగా ప్రభుత్వాధినేతల నోట పదే పదే పునరుక్తమవుతూనే ఉంది. వినీ వినీ శ్రోతలు విసిగి వేసారిపోతున్నారు. అయినా రాజకీయ వేత్తలు ఆ మంత్రాన్ని జపిస్తూనే ఉన్నారు! దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది కేవలం ఒక వాక్శూరుని మేధో పరిమితి మాత్రమే కాదు; సమస్త రాజకీయవేత్తల అహేతుక ఆలోచనా ధోరణి– కృశించిన లేదా క్షీణించిన రాజకీయ ఆలోచనాశక్తిని ప్రతిబింబిస్తోంది. వాస్తవమేమిటంటే అధికార పక్షాల నాయకులు మాత్రమే కాదు, భావజాలాలకు అతీతంగా ప్రతి ఒక్క రాజకీయుడికి ‘అభివృద్ధి’ అనేది ఒక ఊతపదమైపోయింది. పైగా ఆ లక్ష్య సాధనకు తమ నిబద్ధతను పదే పదే ఏకరువు పెడుతూ ప్రజలను వారు నిత్యం సతాయిస్తూనే ఉన్నారు.

రెండు దశాబ్దాల క్రితం సంస్కృత భాష గురించి విఖ్యాత సంస్కృత విద్వాంసుడు Sheldon Pollock ఇప్పటికీ తరచు ఉదహరింపబడుతున్న ఒక వ్యాసాన్ని రాశారు అది: ‘The Death of Sanskrit in 18th century India’. సంస్కృతం మృత భాష అయిపోయిందని చెప్పడం ఆయన ఉద్దేశం ఎంత మాత్రం కాదు. ఆ పురాతన భారతీయ భాష తన ఉనికిని కొనసాగిస్తూనే ఉన్నది. ఇండియాలో యూరోపియన్ల వలస పాలన ప్రారంభమైన తరువాత భారతీయ నాగరికత మేధో వ్యాసంగాల, సాంస్కృతిక భావాల వ్యక్తీకరణకు సంస్కృతం ప్రధాన మాధ్యమంగా ఉండడం నిలిచిపోయిందని చెప్పడమే ఆ పాశ్చాత్య విద్వాంసుని అభిమతం. ఆ అభిప్రాయానికి సుదీప్త కవిరాజ్‌ ప్రతిస్పందిస్తూ ‘The Sudden Death of Sanskrit knowledge’. అనే వ్యాసాన్ని రాశారు. ఒక విశిష్ట చింతనా ధోరణి సంబంధమైన భావనాత్మక విశ్వం ఆకస్మికంగా అంతరించిపోయిందని కవిరాజ్‌ విశదీకరించారు.

సరిగ్గా అటువంటి విపరిణామమే మహోన్నత ఆధునిక భారత రాజకీయ చింతనా సంప్రదాయానికి కూడా సంభవించింది. వలసపాలనా కాలంలోనూ, స్వాతంత్ర్య సాధన అనంతరమూ దేశ రాజకీయాలను సమున్నత విలువలతో తీర్చిదిద్దిన, అభివృద్ధిపరిచిన మహా ప్రశస్త రాజకీయ చింతనే ఆ సంప్రదాయమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరే, ఇప్పుడు నైతిక రాజకీయాలు క్షీణించిపోవడాన్ని అందరూ గుర్తించారు, విమర్శిస్తున్నారు, వేదన చెందుతున్నారు. అయితే అంతకంటే శోచనీయమైన ఒక వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవడం లేదు: మన రాజకీయ దార్శనికత శుష్కించి పోయింది, రాజకీయ సంవాదాలు సంకుచితమవడమే కాదు, వికృతమూ అవుతున్నాయి. మన రాజకీయ వివేకం నిస్సారమైపోయింది, రాజకీయ నిర్ణయాలలో భావ దారిద్ర్యం, రాజకీయ కార్యాచరణలో మందకొడితనం, సాహసోపేత క్రియాశీలత కొరవడడం.... నిజంగా ఇదొక విషాద వాస్తవం. భారత పునరుజ్జీవన, జాతీయోద్యమ యుగ రాజకీయాలను తీర్చిదిద్దిన, సమున్నతపరిచిన భావాల వాహిని ఎండిపోయింది. ఈ పరిణామాన్ని ఆధునిక భారత రాజకీయ చింతన హఠాన్మరణమని మీరు భావించవచ్చు.


భావాల ప్రపంచంలో సంభవించిన అన్ని ఉద్యమాల విషయంలో మాదిరిగానే ఈ ‘మరణం’ ఎప్పుడు చోటు చేసుకున్నదో ఒక తేదీని కచ్చితంగా చెప్పలేము. అయితే వలసపాలనానంతర, అంటే స్వతంత్ర భారతావని మొదటి పాతికేళ్ల (1947–72)లోనే సంభవించిందని నిశ్చితంగా చెప్పవచ్చు. స్వాతంత్ర్య ఉషోదయంలో క్రియాశీలంగా ఉన్న మన రాజకీయ చింతకులను, వారి భావ విస్తృతి, ప్రభావశీలతను గుర్తుచేసుకోండి. కేవలం గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్‌లు మాత్రమే కాదు ఇంకా ఎంతో మంది ఉన్నారు. మన ఆలోచనలను విశాలం చేసిన తేజోమూర్తులు వారు. వారు విశ్వసించిన, ప్రతిపాదించిన భావజాలం ఏదైనా జాతి అభ్యుదయాన్ని మాత్రమే ఆ సమున్నతులు తమ దృష్టిలో ఉంచుకున్నారు. నవ్యమానవవాదాన్ని ప్రతిపాదించిన మానవేంద్రనాథ్‌ రాయ్‌, హిందూ చింతన, సంస్కృతిని మహోన్నత స్థాయికి తీసుకువెళ్లిన జాతీయవాద ప్రవక్త శ్రీ అరబిందో అప్పటికి క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలిగారు. రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నవారిలో కాంగ్రెస్‌ నాయకుడు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌; సోషలిస్టు భావుకులు, పోరాటయోధులు ఆచార్య నరేంద్ర దేవ, జయప్రకాష్‌ నారాయణ్‌, రామ్‌ మనోహర్‌ లోహియా; కమ్యూనిస్టు నాయక దిగ్గజాలు ఎస్‌ఏ డాంగే, పిసి జోషి; సామాజిక న్యాయపోరాటయోధుడు పెరియార్‌ రామస్వామి నాయకర్‌; స్వేచ్ఛా వాణిజ్య విధానాలను ప్రవచించిన సి. రాజగోపాలాచారి; హిందూ మతానికి ప్రాధాన్యమిచ్చిన వినాయక్‌ దామోదర్‌ సావర్కార్‌; ముస్లింల పక్షాన మాట్లాడిన మౌలానా మౌదూది ఆ తేజో మూర్తులలో కొందరు మాత్రమే.

ఆ ఉదాత్తుల భావాలు, ఆలోచనలతో మీరు అంగీకరించినా లేక విభేదించినా వారు ఉత్కృష్ట రాజకీయ తాత్త్వికులు అనే వాస్తవాన్ని మీరు నిరాకరించలేరు. అవును, వారు రాజకీయ క్రియాశీలురు. అయితే వారి రాజకీయ కార్యాచరణ భావి భారతీయ సమాజ నిర్మాణం గురించిన విశాల దార్శనికతతో ప్రేరణ పొందింది. సమున్నత లక్ష్యాలకు పరిపూర్ణంగా నిబద్ధమైన రాజకీయ కార్యాచరణ అది. దైనందిన రాజకీయాలలో పాల్గొంటూనే సర్వసాధారణమైన పాక్షికతలు, పక్షపాతాలకు అతీతంగా ఆలోచించారు, సమాజంతో సంభా షించారు, ప్రజలకు విపులంగా వివరించేందుకు తమ భావాలకు స్ఫూర్తిదాయకమైన అక్షర రూపమిచ్చారు. భారత దేశం, భారతీయుల బాగోగులే వారి ఉచ్ఛ్వాసనిశ్వాసాలు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎల్లెడలా జరుగుతున్న సంఘటనలు, వాటి పూర్వాపరాలను సమగ్రంగా తెలుసుకునేవారు. చదవడం, రాయడం ఆంగ్లంలోనే అయినప్పటికీ భారతీయ భాషల మహోన్నత సాంస్కృతిక వారసత్వం, సాహిత్య వైభవం వారి మేధో కృషికి, సమాజ సేవా కార్యకలాపాలకు ఒక స్ఫూర్తిగా, ఆలంబనగా ఉండేవి. ఆధునికత, సంప్రదాయంపై వారు విశాల దృక్పథంతో భిన్న రీతుల్లో వివేచించారు. అయితే పూర్తిగా దేశీయ అంటే విలక్షణమైన భారతీయ ఆధునికత రూపుదిద్దుకోవడానికి సమష్టిగా దోహదం చేశారు ఆ దేశభక్తులు, మానవతావాదులు విశిష్టమైన రాజకీయ ఆలోచనల సంచయాన్ని సృష్టించారు. ఆ భావాల సంచయమే మన రాజ్యాంగాన్ని విశిష్టంగా రూపొందించింది. భిన్న భావజాలాలు ప్రభవించి వర్థిల్లడానికి, విభిన్న రాజకీయ కార్యాచరణలకు ఆస్కారమిచ్చింది.

స్వతంత్ర భారతావని తొలి పాతికేళ్లలో ఈ మహోదాత్త రాజకీయ చింతనా సంప్రదాయం ఆకస్మికంగా అంతరించి పోయింది. 1970 దశకం తొలినాళ్లకు ప్రస్తావిత చింతకులు చాలా మంది కీర్తిశేషులయ్యారు. రాజకీయ చింతనలో రాజకీయ నాయకుల ప్రాబల్యం కొనసాగుతున్నప్పటికీ వారి ఆలోచనలు 1947లో ప్రజలకు మార్గదర్శకంగా ఉన్న రాజకీయ భావాలతో ఎంత మాత్రం పోల్చదగ్గవి కావు. వ్యక్తులుగా కూడా ఆ నేతలకు పాతతరం ఉదాత్తులకు మధ్య చాలా తేడా ఉన్నది. ఆ నాటికి సోషలిస్టు భావుకతలో ఇంకా మినుకు మినుకుమంటూ మిగిలి వున్నది లోక్‌ నాయక్‌ జయప్రపకాష్‌ నారాయణ్‌ ‘సంపూర్ణ విప్లవ’ భావన మాత్రమే. చారు మజుందార్‌ సిద్ధాంతాలు మార్క్సిజంకు తుది సృజనాత్మక భాష్యాలు. వినోబా భావే చింతన ఏకపక్షమైనదే అయినప్పటికీ గాంధేయవాదులలో ఆయన ప్రముఖుడు. ఎమ్‌ఎస్‌ గోళ్వాళ్కర్‌ ‘హిందూత్వ’ వాదాలను ప్రచారం చేస్తూనే ఉన్నారు గ్రామీణ భారతదేశ అభ్యున్నతికి ఒక విశిష్ట కార్యక్రమాన్ని ప్రతిపాదించిన దార్శనికుడు చౌదరి చరణ్‌ సింగ్‌. ఈ జాబితా అసంపూర్ణమైనది. అయితే ప్రస్తావితులు అందరూ దేశ ప్రజలను ప్రభావితం చేసినవారనడంలో సందేహం లేదు.

ఇరవయో శతాబ్ది తుది సంవత్సరాలకు వచ్చేసరికి రాజకీయ క్రియాశీల–చింతకులు కూడా చాలవరకు శాశ్వతంగా నిష్క్రమించారు. మిగిలి ఉన్న కిషెన్‌ పట్నాయక్‌, సచ్చిదానంద సిన్హా, రామ్‌దయాళ్‌ మండా, ధరమ్‌పాల్‌, బిడి శర్మ ప్రధాన స్రవంతి రాజకీయాలకు వెలుపలే ఉండిపోయారు అప్పటి నుంచి రాజకీయ కార్యాచరణలపై వివేచించిన, వాటిని ప్రభావితం చేసిన అర్థవంతమైన రాజకీయ చింతన ఏదీ మనకు లేకుండా పోయింది.

రాజకీయ ఆలోచనాశక్తి క్షీణించిపోవడం, మరింత ధైర్యంగా, స్పష్టంగా ఆధునిక భారత రాజకీయ చింతన ‘మరణం’ గురించి మాట్లాడడమంటే రాజకీయ వ్యవహారాల గురించి నిశిత వివేచన చేసే ప్రశస్త మేధావులు, ఆలోచనాపరులు, రచయితలు మనకు ఇంకెంతమాత్రం లేరు అని చెప్పుతున్నట్టుగా భావించనవసరం లేదు. అటువంటి చింతకులు, భావుకులు ఉన్నారు. బహుశా ఇంతకు ముందు కంటే ఎక్కువ మందే ఉన్నారు. అయితే రాజకీయాలు, కనీసం వాటి సంకుచితార్థంలో సైతం వారి చింతనకు కేంద్రంగా లేవు. మన యెఱుక, అనుభవంలోకి వస్తున్న వర్తమాన రాజకీయ చింతనలోని ఏ స్రవంతిలోనూ మేధో కృషిని రాజకీయ కార్యాచరణలతో సంధాయకం చేసే ఒక సుసంగత సంభాషణ, ఒక శక్తిమంతమైన వాదన, ఒక అర్థవంతమైన చర్చ లేవు. అయితే ఇందుకు గౌరవప్రదమైన మినహాయింపులు లేకపోలేదు. అభివృద్ధి నమూనాపై నిశిత విమర్శలు, బహుళ ప్రత్యామ్నాయాల అన్వేషణ, స్త్రీవాద, అంబేడ్కరైట్‌ శ్రేణులలో సందర్భానుసారమైన చర్చలు, వాదోపవాదాలు రాజకీయ చింతనా సంప్రదాయాన్ని సజీవంగా ఉంచుతున్నాయి.

మొత్తం మీద రాజకీయ చింతన క్రమంగా విశ్వవిద్యాలయాలకు పరిమితమయింది. రజనీ కొఠారి, డిఎల్‌ సేథ్‌, ఆశీస్‌ నంది, పార్థా చటర్జీ, సుదీప్త కవిరాజ్‌, రాజీవ్‌ భార్గవ మొదలైన ప్రశస్త రాజకీయ సైద్ధాంతికవేత్తలను మన విశ్వవిద్యాలయాలు సృష్టించాయి. అయితే వారి భావాలు రాజకీయ కార్యాచరణలను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పేందుకు ఆస్కారం లేనే లేదు. రాజకీయ చింతనను విశ్వవిద్యాలయాల రాజనీతిశాస్త్ర విశారదులు స్వీకరించి స్వాధీనం చేసుకోవడమనేది ఒక మేధోపరమైన విపత్తు మాత్రమేకాకుండా ఒక రాజకీయ అనర్థం కూడా.

మన రాజకీయాలలోని ప్రస్తుత దుస్థితి, శోచనీయ పరిస్థితులకు చైతన్యశీల రాజకీయ చింతన క్షీణించిపోవడమే ప్రధాన కారణం. భారత రాజ్యంగ నిర్మాతలు నెలకొల్పిన మన సమున్నత ప్రజాస్వామిక గణతంత్రరాజ్యాన్ని మళ్లీ సాధించుకుని, సంరక్షించుకునేందుకు ఆధునిక భారత రాజకీయ చింతనా సంప్రదాయాన్ని పునరుద్ధరించుకుని పునశ్శక్తిమంతం చేసుకోవడమనేది చాలా చాలా అవసరం.

మన రాజకీయాలలోని ప్రస్తుత దుస్థితికి చైతన్యశీల రాజకీయ చింతన క్షీణించిపోవడమే ప్రధాన కారణం. భారత రాజ్యంగ నిర్మాతలు నెలకొల్పిన మన సమున్నత ప్రజాస్వామిక గణతంత్రరాజ్యాన్ని మళ్లీ సాధించుకుని, సంరక్షించుకునేందుకు ‘మరణించిన’ ఆధునిక భారత రాజకీయ చింతనా సంప్రదాయాన్ని పునరుద్ధరించుకుని పునశ్శక్తిమంతం చేసుకోవడమనేది చాలా చాలా అవసరం.

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

Updated Date - Aug 23 , 2024 | 05:55 AM