Success Stories : చదరంగపు రారాజు
ABN , Publish Date - Dec 14 , 2024 | 05:20 AM
ప్రపంచ చాంపియన్ అవ్వాలని ప్రతి ఆటగాడూ కోరుకుంటాడు. కొందరు కెరీర్ చరమాంకంలో లక్ష్యాన్ని చేరుకుంటే.. మరికొందరు ఆదినుంచే అద్భుతాలు సృష్టిస్తూ అందనంత ‘ఎత్తు’కు ఎదుగుతారు. తెలుగు మూలాలున్న పద్దెనిమిదేళ్ల తమిళ
ప్రపంచ చాంపియన్ అవ్వాలని ప్రతి ఆటగాడూ కోరుకుంటాడు. కొందరు కెరీర్ చరమాంకంలో లక్ష్యాన్ని చేరుకుంటే.. మరికొందరు ఆదినుంచే అద్భుతాలు సృష్టిస్తూ అందనంత ‘ఎత్తు’కు ఎదుగుతారు. తెలుగు మూలాలున్న పద్దెనిమిదేళ్ల తమిళ ఆటగాడు దొమ్మరాజు గుకేష్ రెండో కోవలో నిలుస్తాడు. ఇటీవలే ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన గుకేష్, ప్రపంచ టోర్నీకి డిఫెండింగ్ చాంపియన్, చైనా ఆటగాడు డింగ్ లిరెన్‌ను సవాల్ చేశాడు. అనుకున్నట్టే తాజాగా సింగపూర్‌లో జరిగిన అసలైన సమరంలో లిరెన్‌ను తన ఎత్తులతో చిత్తుచేసి కొత్త చాంపియన్‌గా అవతరించాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా, కాస్పరోవ్‌లాంటి దిగ్గజాన్ని అధిగమిస్తూ ప్రపంచంలోనే అతి పిన్న వయసు ఆటగాడిగా గుకేష్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు.
చదరంగంలో గుకేష్ ప్రయాణమే ఓ సంచలనం. ఏడేళ్ల వయసులోనే అరవై నాలుగు గళ్ల ఆటను ఔపోసన పట్టేసిన గుకేష్, అనతికాలంలోనే తన ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నాడు. తొమ్మిదేళ్లకే ఆసియా పాఠశాలల చాంపియన్‌షిప్, మూడేళ్ల అనంతరం ప్రపంచ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి తన సహజసిద్ధమైన ప్రజ్ఞను చాటుకున్నాడు. 12 ఏళ్ల ఏడు నెలల పదిహేడు రోజుల వయసులోనే గ్రాండ్‌మాస్టర్ హోదాను దక్కించుకున్నాడు. గ్రాండ్‌మాస్టర్ అయ్యాక మరింత కష్టపడడం మొదలుపెట్టాడు. భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మార్గనిర్దేశనంలో మరోస్థాయికి ఎదిగాడు. తన గురువు ఆనంద్, మాగ్నస్ కార్ల్‌సన్‌లను ఓడిస్తానని ఐదేళ్లక్రితమే ప్రకటించిన గుకేష్.. చెప్పినట్టే అనంతరకాలంలో ఆ ఇరువురు దిగ్గజాలపై పైచేయి సాధించాడు. రెండేళ్ల క్రితం ఒలింపియాడ్‌లో వ్యక్తిగత స్వర్ణం, నిరుడు ఆసియా క్రీడల టీమ్ విభాగంలో రజతం అందుకున్న గుకేష్ ప్రపంచ చెస్‌లో 2750 రేటింగ్ దాటిన అతి పిన్న వయసు ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో తలపడి పదిహేడేళ్ల వయసులోనే టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించాడు. ఇక భారత జట్టు చెస్ ఒలింపియాడ్ ట్రోఫీని సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఈ చెన్నై చిన్నోడు, ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌షిప్‌తో చదరంగ సింహాసనంపై రారాజు జెండా ఎగరేశాడు. ఈ ఘనతలన్నీ అతి తక్కువకాలంలో, చిరుప్రాయంలోనే అందుకొని తనపేరును చిరస్మరణీయం చేసుకున్నాడు.
గుకేష్ మితభాషి. ఎంత తక్కువగా మాట్లాడతాడో అంత ఎక్కువగా తనదైన వ్యూహాలతో చదరంగ బోర్డుపై చెలరేగిపోతాడు. చెస్ శిక్షణలో కంప్యూటర్ల సాయం తీసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ తరం ఆటగాళ్లకు గుకేష్ కొంత భిన్నం. ఈ క్రీడలో క్లాసికల్ ఫార్మాట్ అంటే మక్కువ చూపే గుకేష్, వీలైనంత వరకు కంప్యూటర్ల వాడకాన్ని తగ్గిస్తూ, సంప్రదాయమైన శిక్షణలో కోచ్‌ల పర్యవేక్షణను ఎక్కువగా ఇష్టపడతాడు. ఏ టోర్నీకి వెళ్లినా ఆటకు ముందు గుకేష్ అమ్మతో పావుగంట సేపు మాట్లాడతాడు. ఆ సంభాషణలో ఎక్కడా చెస్ ప్రస్తావన తీసుకురాకుండా జాగ్రత్తపడతాడు. ఎంత ఒత్తిడి దరిచేరుతున్నా, ప్రశాంతంగా ఉంటూ ఆటకు సిద్ధమయ్యేందుకే కాసేపు అమ్మతో మాట్లాడతానని గుకేష్ చెప్తాడు. ఇలా, ప్రతి అంశంలోనూ విభిన్నంగా ఉంటూ బోర్డులో ఎత్తుకు పైఎత్తులు వేస్తూంటాడు.
భారతీయుల ఆటగా పేరొందిన చదరంగంలో గుకేష్‌తో పాటు ప్రజ్ఞానంద, అర్జున్, విదిత్ గుజరాతి, వైశాలి, దివ్యా దేశ్‌ముఖ్ లాంటి యువ ఆటగాళ్లు సాధిస్తున్న విజయాలతో ఇప్పుడు పుట్టింటికి పూర్వ వైభవం వచ్చింది. వీళ్ల అంతర్జాతీయస్థాయి ప్రదర్శనలతో దేశవ్యాప్తంగా చదరంగ విప్లవం మళ్లీ పురుడు పోసుకుంది. 1999లో భారత్‌లో ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లే ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 85కు చేరడమే అందుకు నిదర్శనం. విశ్వనాథన్ ఆనంద్ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ యువతరం తమ క్రీడాప్రజ్ఞకు పదును పెట్టుకుంటుండడం శుభ పరిణామం. క్రీడల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న మన చిన్నారులకు వ్యవస్థాగత తోడ్పాటు, నిరంతరం శిక్షణ అందించే పటిష్ట యంత్రాంగాన్ని తీర్చిదిద్దాలి. క్షేత్రస్థాయిలో అపరిష్కృతంగా ఉన్న మౌలిక సమస్యలపై దృష్టి సారించాలి. ఇందుకు ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు ప్రైవేట్ సంస్థల వెన్నుదన్నూ ఉండాలి.