Share News

నిజం నిగ్గుతేల్చటంలోనూ నీతి పాటించాల్సిందే!

ABN , Publish Date - Dec 12 , 2024 | 05:24 AM

సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు విషయంలో గౌతమ్‌ అదాని అవినీతికి పాల్పడ్డారంటూ అమెరికా నుంచి వెలువడ్డ ఆరోపణలు దేశాన్ని కుదిపేశాయి. వ్యాపారవేత్తగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గౌతమ్‌ అదాని మీదా, అతని అనుయాయుల మీదా అమెరికాలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌

నిజం నిగ్గుతేల్చటంలోనూ నీతి పాటించాల్సిందే!

సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు విషయంలో గౌతమ్‌ అదాని అవినీతికి పాల్పడ్డారంటూ అమెరికా నుంచి వెలువడ్డ ఆరోపణలు దేశాన్ని కుదిపేశాయి. వ్యాపారవేత్తగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గౌతమ్‌ అదాని మీదా, అతని అనుయాయుల మీదా అమెరికాలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ చేపట్టిన అవినీతి ఆరోపణల దర్యాప్తు నేపథ్యంలో మన దేశంలోని సంస్థలు కూడా దర్యాప్తు చేపట్టాల్సిన అగత్యం ఏర్పడింది.

తమిళనాడు, ఒరిస్సా, జమ్మూకశ్మీర్‌, చత్తీస్‌గడ్‌ రాష్ట్రాలే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా అదానీ గ్రీన్‌ – అజుర్‌ పవర్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌ సంస్థలతో సోలార్‌ ఎనర్జీ విషయంలో సరఫరా ఒప్పందాలు చేసుకున్నాయని చెబుతున్నారు. అవినీతి ఆరోపణలు అమెరికాలోని హిండెన్‌బర్గ్‌ రిసెర్చి బయటపెట్టటంతో అదానీ సంస్థతో పాటు, భారతదేశ ప్రభుత్వం, కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇరుకున పడ్డాయి. ఈ విషయమై చర్చలూ వదంతులూ తారాస్థాయికి చేరుకున్నాయి. కానీ పరిష్కార మార్గాలను మాత్రం రాజకీయ నాయకులూ, ప్రభుత్వాలూ బయటపెట్టడం లేదు.

ప్రజల వద్ద నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బును ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నాయా లేదా అన్నది ప్రజలకు ముఖ్యం. ప్రజల అవసరాల నిమిత్తం సోలార్‌ ఎనర్జీ కొనుగోలు చేసిన విధానంలో అవినీతి చొరబడిందన్న అంశం మరో దేశం దర్యాప్తులో బయటపడినప్పుడు ప్రజలకు తాము ఎన్నుకొన్న ప్రభుత్వాల మీద నమ్మకం పోతుంది. ఇలా ఎన్ని రకాలుగా వారి సొమ్ము వారికి కాకుండా పోతున్నదో అన్న భయంతో కూడిన అనుమానాలు పెరుగుతాయి. పార్లమెంట్‌ సమావేశాలు ఈ సమస్యకు పరిష్కారం చూపించాల్సింది పోయి, సమస్యలో ఒక భాగంగా మారిపోవటం దురదృష్టకరం. నిజానికి అధికారపక్షం చొరవ చూపి ఇంతటి సంచలనాత్మక విషయానికి సంబంధించిన నిజానిజాలను సభల్లో బయటపెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలు కూడా ఈ సమస్యకు ఒక పరిష్కార దిశగా చర్చలు కొనసాగించటానికి బదులు అధికార పక్షాన్ని ఇరుకునపెట్టాలని ప్రయత్నించటమూ దురదృష్టకరమే. సానుకూల ధోరణిలో అవగాహనతో కూడిన సంయమన దృక్పథంతో ఇరు పక్షాలూ వ్యవహరించినప్పుడే రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య మనుగడ సాధ్యపడుతుంది. ఏకపక్ష ధోరణిలో ఎవరు వ్యవహరించినా అంతిమంగా నష్టపోయేది రాజకీయ నాయకులూ, వ్యాపార సంస్థలూ కాదు – ప్రజలు!

కొన్ని సంవత్సరాల క్రిందట రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన దేశానికి చెందిన ఒక జర్నలిస్ట్‌ విదేశంలో సేకరించిన సమాచారం వల్ల బయటపడిన భోఫోర్స్‌ ఉదంతం దేశాన్ని కుదిపేసింది. ఆనాటి ప్రధానమంత్రి అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణ సంచలనం కలిగించింది. ఇప్పటి అవినీతి సొమ్ముతో పోల్చుకుంటే అప్పటి సొమ్ము పరిగణనలోకి తీసుకోవాల్సినంత పెద్దదేమీ కాదు. కానీ ప్రజల డబ్బు ప్రజల డబ్బే, అవినీతి అవినీతే! జాయింట్‌ పార్లమెంటరీ కమిటీకి ఆనాటి ప్రభుత్వం ఒప్పుకోక తప్పలేదు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి అలాంటి ప్రక్రియ పార్లమెంటుకు అందుబాటులో ఉన్నప్పుడు మీనమేషాలు లెక్కపెట్టాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉండకూడదు. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు ఈ విషయంలో స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అడిగే హక్కు కూడా ఉంది. ప్రభుత్వానికి జవాబివ్వాల్సిన బాధ్యత ఉంది. ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వ మార్గంలోకి నెట్టేయకూడదు!


మార్కెట్‌ షేర్ల ధరలను మానిప్యులేట్‌ చేయటంతో పాటు, జరిగిన ఒప్పందాలను, ఫండ్స్‌ను లాభసాటిగా వ్యాపారంలో తిప్పిన తీరును అదాని సంస్థ బయటపెట్టటానికి ఇబ్బంది పడటంతో ఈ వ్యవహారం ఇంత జటిలంగా మారింది. నిఘా సంస్థలు కానీ ప్రభుత్వాలకు సంబంధించిన రెగ్యులేటరీ సంస్థలు కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరును ప్రభుత్వాలు పట్టించుకోకపోవటంతో ఇప్పుడు మీడియాతో పాటు ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద – అదానీ సంస్థ మీద విమర్శ బాణాలు ఎక్కుపెట్టాయి. ఎక్కుపెట్టిన బాణం ఎవరికి తగులుతుందో అన్నది కాదు సమస్య, తప్పుచేసిన వారికి శిక్ష పడాల్నా లేదా అన్నదే సమస్య. నష్టపోతున్న ప్రజాధనాన్ని ప్రభుత్వాలు రాబట్టుకోలేవా అన్న ప్రశ్నకు జవాబు కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించక తప్పదు. గౌతమ్‌ అదాని కేంద్రంలోని ప్రముఖులకు ఇష్టుడు అన్న అపవాదును తొలగించుకోక తప్పదు. రాష్ట్రాల ఒప్పందాలతో మాకు సంబంధం లేదు అన్నట్లు తప్పించుకొనే ధోరణి ఎంత మాత్రం సమంజసం కాదు. వారి ఏలుబడిలో ఉన్న రెండు మూడు రాష్ట్రాలు కూడా ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంతవరకూ ఇప్పటి కూటమి ప్రభుత్వం ఈ ఆరోపణల వెనక నిజాలను తమ సంస్థల ద్వారా దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని చెబుతున్నది. ఒప్పందాల పత్రాలూ – నిర్ణయాలూ – ఫైళ్లతో పాటు అప్పటి అధికార వర్గంపై దృష్టి పెడితే నిజాలు ఇట్టే తెలుస్తాయి. ఒప్పందం రద్దు వల్ల నష్టపరిహారంగా మరింత సొమ్ము ఇవ్వాల్సి వస్తుందన్న వాదన సమంజసం కాదు. మొత్తం పెట్టుబడులూ ఒప్పందాలూ అవినీతిమయం అన్న ఆరోపణల నేపథ్యంలో న్యాయస్థానంలో నిజాలు నిరూపణ అయితే నేరస్థులతో ఆ అవినీతి సొమ్మును కక్కించవచ్చు. ప్రజలకు నష్టం కలగొచ్చు అన్న సాకుతో నైతిక ధర్మానికి తిలోదకాలు ఇవ్వటానికి ప్రయత్నిస్తే కూటమి ప్రభుత్వం కూడా విమర్శలకు గురికావలసి వస్తుంది. రాజకీయాలు అవసరమే కానీ నైతికతను పణంగా పెట్టి రాజకీయం చేయటాన్ని ప్రజాస్వామ్యం హర్షించదు.

అదానీ వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించక తప్పదు. గౌతమ్‌ అదాని కేంద్రం లోని ప్రముఖులకు ఇష్టుడు అన్న అపవాదును తొలగించుకోక తప్పదు. రాష్ట్రాల ఒప్పందాలతో మాకు సంబంధం లేదు అన్నట్లు తప్పించుకొనే ధోరణి ఎంతమాత్రం సమంజసం కాదు. వారి ఏలుబడిలో ఉన్న రెండు మూడు రాష్ట్రాలు కూడా ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్నాయి.

l రావులపాటి సీతారాంరావు

Updated Date - Dec 12 , 2024 | 05:24 AM