Share News

పాఠ్యాంశంగా మళ్లీ అమరావతి

ABN , Publish Date - Dec 12 , 2024 | 05:31 AM

మన దేశ రాజధాని ఢిల్లీ మహానగర చరిత్ర, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌ల చరిత్రలను పాఠ్యగ్రంథాల ద్వారా నేటి తరానికి తెలియజేస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల రాజధానుల చరిత్రలకు ఏ మాత్రం తీసిపోని ఘనమైన

పాఠ్యాంశంగా మళ్లీ అమరావతి

మన దేశ రాజధాని ఢిల్లీ మహానగర చరిత్ర, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌ల చరిత్రలను పాఠ్యగ్రంథాల ద్వారా నేటి తరానికి తెలియజేస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల రాజధానుల చరిత్రలకు ఏ మాత్రం తీసిపోని ఘనమైన చరిత్ర అమరావతిది. తెలుగు రాజులైన శాతవాహనుల రాజధాని ధాన్యకటకం. శాతవాహనులు రాజధానిని ఎంతగానో అభివృద్ధి చేశారు. దీనినే ధరణికోట అని పిలిచేవారు. కాలక్రమంలో అమరావతిగా స్థిరపడింది. శ్రీకృష్ణదేవరాయలు తమ విజయయాత్రలోను, క్రీ.పూ.5వ శతాబ్దిలో గౌతమబుద్ధుడు ఈ ప్రదేశాన్ని సందర్శించారు.

అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం. ఆ వెనుక సూర్యకిరణాల పలకరింపునకు మెరుస్తున్న బంగారుపూత అమరేశ్వరాలయం శిఖరం. ఎత్తయిన ఆ శిఖరానికి చుట్టూతా ఎన్నో ఆలయాలు. ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుబడ్డ బౌద్ధస్థూపాలు, పడమట శాతవాహనుల రాజధాని ధాన్యకటకం, ఉత్తరాన ఆ స్థూపాల్ని, ఆ ఊరిని వడ్డాణంలా చుట్టి గలగల పారుతున్న కృష్ణానది. అద్గది అమరావతి.

2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ఎంపికచేసి, ఎంతో అద్వితీయమైన చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక చరిత్రను నేటి తరానికి తెలియజేయాలనే సత్సంకల్పంతో పదవ తరగతి తెలుగు వాచకంలో ‘అమరావతి’ శీర్షికతో పాఠాన్ని ఎంపికజేసి బోధింపజేశారు. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగా రాజధాని అమరావతితో ఆడుకుంది. దీంతో పాటు పదవ తరగతి పాఠ్యాంశంగా ఉన్న అమరావతిని కూడా తొలగించింది.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరింది. అవిభాజ్య రాష్ట్రంలో హైదరాబాద్‌ను ప్రపంచశ్రేణి మహానగరంగా తీర్చిదిద్దిన విశేష అనుభవమున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రులు గర్వపడే విధంగా ‘అమరావతి’ పాఠ్యాంశాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి.

– అంగలకుదురు వీరాస్వామి

Updated Date - Dec 12 , 2024 | 05:31 AM