Share News

అద్భుత ఛాంపియన్లు

ABN , Publish Date - Jul 02 , 2024 | 12:52 AM

టీమిండియా మరో సువర్ణాధ్యాయానికి తెరతీసింది. కదనరంగంలో కసిగా పోరాడితే అందలం ఎలా దక్కుతుందో నిరూపించింది. నాటి కపిల్‌ డెవిల్స్‌, ధోనీ సేన సాధించిన విజయాలను మరిపిస్తూ...

అద్భుత ఛాంపియన్లు

టీమిండియా మరో సువర్ణాధ్యాయానికి తెరతీసింది. కదనరంగంలో కసిగా పోరాడితే అందలం ఎలా దక్కుతుందో నిరూపించింది. నాటి కపిల్‌ డెవిల్స్‌, ధోనీ సేన సాధించిన విజయాలను మరిపిస్తూ ప్రపంచ కప్పును ఒడిసిపట్టుకుంది. తుది పోరులో దక్షిణాఫ్రికాను ఓడించి రెండో పర్యాయం టీ20 ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ చారిత్రక సందర్భమే టీ20 ఆటనుంచి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజాలకు ఘన వీడ్కోలును కూడా ఇచ్చింది.

ఆటలో గెలుపోటములు సహజం. సరిగ్గా ఏడునెలల క్రితం మన దేశంలోనే జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ రన్నరప్‌గా నిలిచింది. అజేయమైన ఆటతీరుతో ఫైనల్‌ చేరి, కప్పుపై ఎన్నో కలలు పెట్టుకున్న రోహిత్‌సేన ఆ టోర్నీ తుదిపోరులో ఓడడం కోట్లాది భారతీయుల హృదయాలను కలచివేసింది. ఆస్ట్రేలియా చేతిలో పరాజయం మన ఆటగాళ్లను ఎంతో మనోవేదనకు గురిచేసింది. ఇది వారిలో మరింత కసిని పెంచింది. అవసరాలకనుగుణంగా వ్యూహాల్లో మార్పులు చేసుకొని ముందుకు సాగేలా చేసింది. గోడకు కొట్టిన బంతిలా ఎగసి, ఆ తరువాత ఏడు నెలల్లోనే జరిగిన ఈ పొట్టికప్పు విశ్వసమరంలో జట్టు అద్భుత ప్రదర్శన కనబరచింది. తమకు ఎదురే లేదనుకున్న ఆస్ట్రేలియన్లను, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఓటమన్నదే లేకుండా వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చినా, ఏమరుపాటుకు అవకాశమివ్వలేదు.


కలిసికట్టుగా కదం తొక్కి రెండో టైటిల్‌తో క్రికెట్‌లో నవచరిత్రను ఆవిష్కృతం చేసింది. సమర్థమైన నాయకుడిగా ముందుండి నడిపించిన రోహిత్‌ శర్మ జట్టు విజయంలో ఆటగాడిగానూ కీలకపాత్ర పోషించాడు. కొన్ని మ్యాచుల్లో భారీస్థాయిలో పరుగులు రాబట్టి గెలుపు బాట వేశాడు. ఈ విజయంతో భారత్‌కు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజాలు కపిల్‌ దేవ్‌, ఎంఎస్‌ ధోనీ సరసన నిలిచిన రోహిత్‌, తన పదిహేడేళ్ల టీ20 కెరీర్‌ను అద్వితీయంగా ముగించాడు. ప్రపంచ క్రికెట్‌లో కింగ్‌గా నీరాజనాలందుకుంటున్న విరాట్‌ కోహ్లీ ఈ టోర్నీలో వరుస మ్యాచుల్లో విఫలమైనా, ఆఖరి ఆటలో అత్యుత్తమంగా రాణించాడు. ఫైనల్‌కు ముందు ఏడు మ్యాచుల్లో 75 పరుగులే చేసిన కోహ్లీ అసలైన సమరంలో 76 పరుగులు సాధించి తన విలువేంటో చాటిచెప్పాడు. తన చివరి పోరులో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకొని తన 14 ఏళ్ల టీ20 కెరీర్‌కు సగర్వంగా ముగింపు పలికాడు.

ఘోర రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడిన రిషభ్‌ పంత్‌, ఈ టోర్నమెంట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. మునుపటి స్థాయిలో బ్యాటింగ్‌లో, కీపింగ్‌లో నైపుణ్యాన్ని చాటుకొన్నాడు. మన బౌలర్లను ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. పేస్‌ దళపతి జస్‌ప్రీత్‌ బుమ్రా ముందుండి బౌలింగ్‌ను నడిపించాడు. అవసరమనుకున్న ప్రతిసారీ వికెట్‌ పడగొట్టి ప్రస్తుత తరంలో ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్‌గా తన పేరును సార్థకం చేసుకున్నాడు. యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ 17 వికెట్లతో టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్ల వీరునిగా నిలిచాడు. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ బంతితో మాయాజాలం చేశాడు. పేలవమైన ఫామ్‌తో ప్రపంచకప్‌నకు ముందు అనేక విమర్శలు ఎదుర్కొన్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన ఆటతోనే సమాధానమిచ్చాడు.


హార్దిక్‌కు దీటుగా అక్షర్‌ పటేల్‌ బంతి, బ్యాటుతో విజృంభించిన తీరు ప్రశంసనీయం. ఇలా.. ప్రతి ఆటగాడు బాధ్యతాయుతంగా ఆడి జట్టును విశ్వవిజేతగా నిలిపారు. పదిహేడేళ్ల క్రితం వెస్టిండీస్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రాహుల్‌ ద్రవిడ్‌ కెప్టెన్సీలో భారత జట్టు తొలిరౌండ్లోనే వెనుదిరగడంతో నాడు అతను తలదించుకున్న పరిస్థితి. కానీ, ఇప్పుడు అదే విండీస్‌ గడ్డపై గురువు స్థానంలో జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టి తలెత్తుకున్న తీరు సర్వదా ప్రశంసనీయం. మూడేళ్లు జట్టు వెంటే ఉండి మార్గదర్శనం చేసిన తనకు ఇప్పుడు శిష్యులు ప్రపంచకప్‌ను అందించారు. ఎన్నడూ తన భావాలను బయటకు కనిపించనీయని ద్రవిడ్‌ కూడా చిన్నపిల్లాడిలా గంతులేస్తూ జట్టుతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. జట్టు చీఫ్‌కోచ్‌ హోదాలో ఆఖరిరోజును చిరస్మరణీయం చేసుకున్నాడు.

విజేత భారత్‌కే గాకుండా అఫ్ఘానిస్తాన్‌, అమెరికా జట్లకు ఈ ప్రపంచకప్‌ ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ఆట ఆడటమే కష్టంగా ఉన్న తమ దేశంలో పాలకులను ఒప్పించి, ఎన్నో సవాళ్లను అధిగమించి, ఒక్కో మెట్టు ఎక్కుతూ విశ్వసమరంలో సెమీఫైనల్‌ దాకా చేరిన అఫ్ఘానిస్తాన్‌ ఆటగాళ్ల ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఆతిథ్య జట్టు హోదాలో టోర్నీలో అడుగుపెట్టిన అమెరికా, అంచనాలకు మించిన ఆటతీరుతో సూపర్‌–8 దశకు చేరి పిట్టకొంచెం కూత ఘనం అన్న సామెతను గుర్తుచేసింది. అపజయమన్నదే లేకుండా ఫైనల్‌ చేరిన దక్షిణాఫ్రికా ప్రదర్శననూ తక్కువ చేయలేం. మెగా టోర్నీలో తొలిసారి ఫైనల్‌ చేరిన సఫారీ జట్టు కప్పుకోసం తుదికంటా పోరాడిన తీరు అమోఘం.


భారత్‌ సాధించిన ఈ అమోఘ విజయాన్ని ఆస్వాదిస్తూనే నవతరం ఆటగాళ్లు మున్ముందు ప్రతిష్టాత్మక సిరీస్‌లకు సన్నద్ధం కావాలి. రోహిత్‌, కోహ్లీ, జడేజాలాంటి గొప్ప ఆటగాళ్ల వారసత్వాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగాలి.

Updated Date - Jul 02 , 2024 | 12:52 AM