Share News

అమెరికా, కెనడాల శ్రీరంగనీతులు

ABN , Publish Date - Oct 26 , 2024 | 04:48 AM

ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య స్వంత అవసరాలే మిత్రత్వానికైనా, శతృత్వానికైనా ఏకైక ప్రాతిపదిక అవుతున్నాయి. ఈ ధోరణి ఎంతో కొంత ముందు నుండే ఉన్నప్పటికీ, సైద్ధాంతికతనో, ఉమ్మడి ప్రయోజనాలో కొంత భూమికను పోషించేవి. ఇప్పుడా

అమెరికా, కెనడాల శ్రీరంగనీతులు

ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య స్వంత అవసరాలే మిత్రత్వానికైనా, శతృత్వానికైనా ఏకైక ప్రాతిపదిక అవుతున్నాయి. ఈ ధోరణి ఎంతో కొంత ముందు నుండే ఉన్నప్పటికీ, సైద్ధాంతికతనో, ఉమ్మడి ప్రయోజనాలో కొంత భూమికను పోషించేవి. ఇప్పుడా మొహమాటాల తెర తొలగి స్వార్థ ధోరణి పెచ్చరిల్లింది. నిన్నటి విధానం మార్చుకుని నేడు కొత్తపాట అందుకోడానికి ఏ మాత్రమూ జంకు చూపించడం లేదు. శాశ్వత స్నేహాల వరకూ ఎందుకు, నిలకడైన స్నేహాలు కూడా ఉండడం లేదు.

అమెరికా తన పౌరుడు, భారత వ్యతిరేకి, ఖలిస్థాన్ వేర్పాటువాది పన్నున్‌పై హత్యాప్రయత్నం జరిగినట్టు, దాంట్లో ప్రథమ నిందితుడు భారత్ ప్రభుత్వ అధికారి వివేక్ యాదవ్ అని, అతన్ని అప్పగించమని న్యూఢిల్లీని కోరింది. ఆయనిప్పుడు ప్రభుత్వంలో పనిచెయ్యడం లేదంటూ, అమెరికా ఆరోపణని ఖండించింది మన దేశం. ఇప్పటికే భారతీయ వ్యాపారి నిఖిల్ గుప్తను ఈ కేసులోనే అమెరికా ఖైదులో ఉంచింది. అమెరికా ప్రతిష్ఠాత్మంగా భావించి కాపాడుతున్న ఆ మహా నాయకుడు పన్నున్ ఒక ప్రకటన చేశాడు. ఏమనంటే నవంబర్ మొదటి వారంలో భారత్ విమానాల్లో బాంబులు పెడతామని! భారత్‌కి వ్యతిరేకంగా తీవ్రవాద ప్రకటనల్ని బహిరంగంగా చేస్తున్నవాడిని అమెరికా కట్టడి చెయ్యదుగానీ వాడిపై కుట్ర పన్నారని భారత్ అధికారుల్ని అప్పగించమని కోరుతుంది. అది మళ్లీ మన మిత్రదేశం. ఇదనే కాదు ముంబై పేలుళ్ల సూత్రధారి హాడ్లీని కూడా అడిగినా అప్పగించకుండా దశాబ్దాలుగా తన దగ్గరే దాచుకుంది. తీవ్రవాదంపై పోరులో మనకు సహకరిస్తే దానికి పోయేదేమిటి?

కెనడా ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివింది. మరో భారత్ వ్యతిరేకి, ఖలిస్థాన్‌వాది నిజ్జార్ హత్య వెనుక భారత ప్రభుత్వం ఉందంటూ ఆ దేశ ప్రధాని బహిరంగ ప్రకటన చేశారు. బుజువులు లేవట. కానీ దర్యాప్తులో తేలిందట. వివాదం ముదిరి దౌత్యవేత్తల బహిష్కరణ దాకా వచ్చింది. చర్చలు మాని రచ్చ చెయ్యడానికి కారణం కెనడా ఎన్నికలకు వెళ్లబోతుంది. ఆ ప్రధానికి, అధికారిక పార్టీకి ఎదురుగాలి. అక్కడి నుండి బయట పడడానికి ఇదో ఎత్తు.

కాబట్టి భారత్ కూడా తన స్వంత బలమే తన నిజమైన మిత్రుడు అని భావించాలి. స్వప్రయోజనాలకు పెద్దపీట వెయ్యాలి. అవసరానికి, సమయానికి తగిన దౌత్యనీతి ప్రదర్శించి అందరితో ఉభయతారకంగా ప్రవర్తించాలి. స్నేహహస్తంలోనే ఉక్కు సంకల్పం కనబడాలి.

– డి.వి.జి. శంకరరావు

Updated Date - Oct 26 , 2024 | 04:48 AM