Share News

‘అమెరికా యుద్ధం’

ABN , Publish Date - Aug 27 , 2024 | 04:48 AM

పశ్చిమాసియాలో వేడెక్కిన పరిస్థితులను చూస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు మూడో ప్రపంచయుద్ధం తప్పదనిపిస్తోందట. క్షిపణులతో దాడులు చేసుకుంటున్న దేశాలతో చర్చలు జరపాల్సిన కమలాహారిస్‌....

‘అమెరికా యుద్ధం’

పశ్చిమాసియాలో వేడెక్కిన పరిస్థితులను చూస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు మూడో ప్రపంచయుద్ధం తప్పదనిపిస్తోందట. క్షిపణులతో దాడులు చేసుకుంటున్న దేశాలతో చర్చలు జరపాల్సిన కమలాహారిస్‌ తీరిగ్గా బస్సులో తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేసుకుంటోందనీ, నిద్రముఖం బైడెన్‌ కాలిఫోర్నియా బీచ్‌లో నిద్రపోతున్నాడనీ ట్రంప్‌ విమర్శించారు. మూడోప్రపంచయుద్ధం వస్తోందంటూ ట్రంప్‌ హెచ్చరించడం గత పదేళ్ళకాలంలో ఇది ముప్పైరెండోసారి అని ఓ సర్వే సంస్థ లెక్కలు వేసింది. కమలనాయకత్వంలో అమెరికా క్షేమంగా ఉండబోదని, మనందరినీ ఆమె అణుయుద్ధంవైపు తీసుకుపోతోందనీ, ప్రపంచంలోని నియంతలు ఆమెను లెక్కచేయరనీ అమెరికన్లను హెచ్చరించడం ట్రంప్‌ లక్ష్యం. నవంబరు 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వీరిద్దరిలో ఎవరు గెలిచినా, ఇజ్రాయెల్‌తో ఎంత ప్రేమగా ఉంటారో తెలియనిదేమీ కాదు.


జో బైడెన్‌ తప్పుకోకుండా, అధ్యక్ష అభ్యర్థిగానే కొనసాగివుండివుంటే, ఎన్నికల ప్రచారం ఇంత వేడిగా సాగేది కాదేమో. విమర్శలతోపాటు విధానాల ప్రస్తావనలు, హామీలు కూడా ప్రచారంలో వినవస్తున్నాయి. డెమోక్రాటిక్‌ పార్టీ కన్వెన్షన్‌ ఆఖరురోజున కమలాహారిస్‌ చేసిన ప్రసంగం ఆకర్షణీయంగా ఉంది. ట్రంప్‌ అధికారంలోకివస్తే దేశాన్ని నాశనం చేస్తాడన్న విమర్శతో పాటు, పార్టీ, జాతి, లింగం, భాష ఇత్యాది భేదాలేవీ లేకుండా ప్రతీ ఒక్క అమెరికన్‌ శ్రేయస్సు కోసం తాను కృషిచేస్తానని ఆమె ప్రకటించారు. గతంలో దేశం చవిచూసిన విభజన, విద్వేషం తన ఏలుబడిలో ఉండబోవని హామీ ఇచ్చారు. అధికారం దక్కితే పట్టపగ్గాల్లేకుండా వ్యవహరించడం ట్రంప్‌కు అలవాటంటూ కొన్ని ఘట్టాలను ఆమె ఉదహరించారు. ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం విశ్వాసం లేని, నిలకడలేని వ్యక్తి అంటూ, అధికార బదిలీ సందర్భంగా ఆయన తన పార్టీ కార్యకర్తలను కాపిటల్‌ హిల్‌ మీద దాడులకు పురిగొల్పిన ఘట్టాన్ని గుర్తుచేశారు. పార్టీ నామినేషన్‌ను ఆమోదిస్తున్న ఈ సందర్భాన్ని తన భావజాలాన్నీ, నేపథ్యాన్నీ వివరించేందుకు ఉపయోగించుకున్నారు. భారతదేశంనుంచి వలసవచ్చిన తన తల్లిప్రయాణాన్ని, తల్లిదండ్రుల జీవితాన్ని వివరించారు ఆమె. శ్రామికులు అధికంగా ఉండే ప్రాంతంలో పెరగడం, మధ్యతరగతి నేపథ్యం, పొదుపుగా బతకడం, ఉన్నదానిలో సర్దుకోవడం వంటి ప్రస్తావనలు ఓటర్ల మనసు గెలుచుకోవడానికి ఉపకరిస్తాయని ఆమె ఆశిస్తున్నట్టుంది. తన విధానాలను వివరిస్తున్నప్పుడు కూడా ఆరోగ్యం, నివాసం, రోజువారీ అవసరాలు, ఖర్చులు ఇత్యాది విషయాలపైనే ఆమె దృష్టిపెట్టారు. చైనాను నెంబర్‌ వన్‌ కానివ్వనంటూ అమెరికన్లను ఉత్సాహపరిచారు కానీ, గాజాయుద్ధం, ఉక్రెయిన్‌కు సాయం అంశాల్లో మార్పేమీ ఉండబోదని ఆమె ప్రసంగం సారాంశం. పాలస్తీనియన్ల బాధలు వర్ణనాతీతం అంటూ ఎప్పటిలాగానే కాస్తంత జాలిపడ్డారంతే.


ఒబామాలు, క్లింటన్లు సహా అనేకమంది దిగ్గజాల మద్దతుతో కమలాహారిస్‌ మరింత శక్తిమంతురాలైనారు. నెలరోజుల క్రితం వరకూ డెమోక్రాట్లలో ఈ మాత్రం ఉత్సాహం లేదు. ట్రంప్‌మీద హత్యాయత్నం జరిగి, రక్తమోడుతున్న మొఖంతో ఆయన గాలిలోకి తన పిడికిలి విసిరిన దృశ్యం చూసిన తరువాత డెమోక్రాట్లు పూర్తిగా నీరుకారిపోయారు. దీనికి కాస్తంత ముందు ట్రంప్‌తో జరిగిన చర్చలో బైడెన్‌ బాగా తడబడి ట్రంప్‌కు ఎక్కడలేని శక్తీ ఇచ్చారు. పార్టీ నాయకుల ఒత్తిళ్ళమేరకు, విధిలేక బరినుంచి తప్పుకోవాల్సివచ్చినప్పటికీ ఆ నిర్ణయంతో బైడెన్‌ పార్టీని గట్టిపోటీకి సిద్ధంచేశారు. జారిపోయి, పారిపోయిన డెమోక్రాట్లు ఇప్పుడు కొత్తనాయకత్వంలో తిరిగి యుద్ధరంగంలోకి అడుగుపెట్టి మంచిపోరాట పటిమను ప్రదర్శించడం ట్రంప్‌ను ఆత్మరక్షణలో పడవేసింది. ఆమె జెండర్‌ను, మూలాలను ప్రస్తావించడం, అవహేళన చేయడం ఆరంభించారు. ఫాసిస్టులు, కమ్యూనిస్టులు అమెరికాను ఆక్రమించుకోవడానికి కుట్రపన్నుతున్నారని హెచ్చరిస్తూ, కమలకు ముందు కామ్రేడ్ అనే పదాన్ని చేర్చి మరీ సంబోధిస్తున్నారు. ట్రంప్‌ వస్తే దేశానికి ఎంత ప్రమాదమో కమల చెబుతున్నారు. ఆయనకు అధికార కాంక్షతప్ప, దేశం మీద ప్రేమలేదని ఆమె హెచ్చరిస్తున్నారు. జూన్‌లో జరిగిన ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో బైడెన్‌ను వెనక్కునెట్టేసిన ట్రంప్‌, వచ్చేనెల చర్చలో కమలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ప్రస్తుతానికి ఎన్నికల సర్వేల్లో కమలాహారిస్‌ ఓ మెట్టుపైనే ఉన్నప్పటికీ, ఎన్నికలకు మరో రెండునెలలు ఉన్నందున గాలి ఎటువైపు బలంగా తిరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. ‘మేకింగ్‌ అమెరికా గ్రేట్‌’ అన్నమాటనే నమ్ముతారో, బహుళత్వాన్నే బలపరుస్తారో చూడాలి.

Updated Date - Aug 27 , 2024 | 04:48 AM