Share News

కుదరని పొత్తు

ABN , Publish Date - Sep 11 , 2024 | 04:41 AM

హర్యానాలో కాంగ్రెస్‌–ఆమ్‌ ఆద్మీపార్టీ మధ్య ఎన్నికల పొత్తు ఫలించకపోవడంతో రెండు పార్టీలు వేరువేరుగా తమ అభ్యర్థుల జాబితాలు విడుదల చేస్తున్నాయి. అక్టోబర్ 5న రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకు గురువారంలోగా...

కుదరని పొత్తు

హర్యానాలో కాంగ్రెస్‌–ఆమ్‌ ఆద్మీపార్టీ మధ్య ఎన్నికల పొత్తు ఫలించకపోవడంతో రెండు పార్టీలు వేరువేరుగా తమ అభ్యర్థుల జాబితాలు విడుదల చేస్తున్నాయి. అక్టోబర్ 5న రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకు గురువారంలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఆఖరునిముషం వరకూ పొత్తుకోసం ప్రయత్నించామనీ, ఫలించకపోవడంతో ఒంటిరిగా పోతున్నామని ఆప్‌ నాయకులు తేల్చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో జంటగాసాగి, ‘ఇండియా’ కూటమి ఐక్యతా సందేశాన్ని ఇటీవలే ఇచ్చామనీ, ఇప్పుడు వేరుపడితే బాగుండదని రాహుల్‌ భావించి, తదనుగుణంగా పొత్తుకోసం ఆయన రాష్ట్ర నాయకులమీద గట్టి ఒత్తిడి తెచ్చారు. ఇప్పుడు కనుక హర్యానాలో చేయి కలిపితే, ఫిబ్రవరిలో ఢిల్లీలో జరగబోయే ఎన్నికల్లో ప్రతిఫలంగా ఆప్‌ నుంచి ఎంతో సాధించవచ్చునని కాంగ్రెస్‌ ఆలోచన. కానీ, రాష్ట్ర పెద్దలకు, మరీ ముఖ్యంగా భూపీందర్‌ సింగ్ హూడాకు ఈ పొత్తువాసన గిట్టకపోవడంతో చివరకు వెన్నుపోటు పొడిచారని ఆప్‌ నాయకులు అంటున్నారు.


తొంభై అసెంబ్లీ స్థానాల్లో ఆదిలో పదిహేను, ఆ తరువాత పదిస్థానాలను డిమాండ్‌ చేసిన ఆప్‌కు హర్యానాలో అంతబలం లేదని రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుల వాదన. మరీముఖ్యంగా ఆ పార్టీ అడుగుతున్న వాటిలో కొన్ని బలమైన కాంగ్రెస్‌ అభ్యర్థులున్న, వారు సులువుగా గెలవగలిగే స్థానాలున్నాయి. అసలు ఆప్‌తో పొత్తే వద్దనీ, ఓ నాలుగైదు ఇచ్చినా కూడా అక్కడ ఆప్‌ గెలవకపోగా, కాంగ్రెస్‌ ఆ మేరకు నష్టపోతుందని స్థానికనాయకుల వాదన. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఆప్‌ పోటీచేసిన కురుక్షేత్రలో బీజేపీ గెలిచిందనీ, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయాల ఆధారంగా చూసినప్పుడు ఒంటరిపోరే ఉత్తమం, జంటగా పోతే నష్టమేనని వారి నమ్మకం. ఐదేళ్ళక్రితం సగానికిపైగా స్థానాల్లో పోటీచేసిన ఆప్‌ ఒక్కటీ గెలవనిమాట నిజం. గెలుపోటముల లెక్కలను అటుంచినా, పొత్తుతో ఆప్‌ను హర్యానాలో బలోపేతం చేయడం కాంగ్రెస్‌కు భవిష్యత్తులో ఎనలేని నష్టం చేస్తుందని, అరవింద్‌ కేజ్రీవాల్‌ది భస్మాసుర హస్తమని కాంగ్రెస్‌ నాయకుల నమ్మకం. ఈ కారణంగానే, ఒక దశలో ఆప్‌ ఐదుస్థానాలకు సరిపెట్టుకుంటానని చెప్పినా కూడా అది ప్రతిపాదించిన సీట్లలో తాము కచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో రాష్ట్ర నాయకులు పడనివ్వలేదు. అటు దేశరాజధాని ఢిల్లీలోనూ, ఇటు పంజాబ్‌లోనూ తాము అధికారంలో ఉన్నందున, ఈ రెండింటి మధ్యనా ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ స్వరాష్ట్రంలో పార్టీ ఎదుగుదల దృష్ట్యా కొన్ని స్థానాలు కీలకమైనవని, వాటినే తాము కోరుకున్నామని ఆప్‌ అంటోంది. ఇప్పుడు హర్యానాలో పొత్తుపొడవకపోవడంతో రేపు ఈ రెండు పార్టీల మధ్య ఢిల్లీలో పొత్తుఉండబోదని విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ఆఖరు నిముషంలో ఏమైనా కొత్త మలుపులుంటాయోమో తెలియదు కానీ, ఈ రెండు పార్టీలూ విడివడటంతో అసలే కష్టాల్లో ఉన్న బీజేపీకి ఇప్పుడు కాస్తంత ధైర్యం వచ్చిందని అంటారు.


మంగళవారం బీజేపీ విడుదల చేసిన ౨1మంది అభ్యర్ధుల జాబితాలో ఏడుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు దక్కలేదు. వీరిలో ఇద్దరు మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు సైతం ఉన్నారు. ఈ లిస్టుతో పార్టీలో అసంతృప్తిరేగి, తిరుగుబాట్లు, రాజీనామాలు సాగుతున్నాయి. గతవారం 67మందితో కూడిన తొలిజాబితా విడుదలైనప్పుడు కూడా పార్టీ ఇదేవిధమైన ప్రతికూలత ఎదుర్కొంది. నలభైసిట్టింగ్‌లను మార్చడం, ఇద్దరుమంత్రులతో సహా ఏడుగురు ఎమ్మెల్యేలకు టికెట్‌ ఇవ్వకపోవడం, కొద్దిగంటల్లోనే దానిని ఉపసంహరించుకొని కొన్ని సవరణలు చేయడం తెలిసినవే. ఈ రెండుజాబితాలతో రాష్ట్ర బీజేపీ కనివినీ ఎరుగనంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పటికీ, ఈ స్థాయిలో ప్రక్షాళనచేయనిదే మూడోమారు అధికారంలోకి రావడం అసాధ్యమని పార్టీ పెద్దల నమ్మకం. ఇటీవలివరకూ బీజేపీతో పొత్తులో ఉన్న దుష్యంత్‌ చౌతాలా పార్టీనుంచి తిరుగుబాటుచేసినవారికి పెద్ద ఎత్తున టిక్కెట్లు ఇవ్వడంతో ఈ చిచ్చురేగింది. ముఖ్యంగా అత్యంత కీలకమైన జాట్‌ ఓటుబ్యాంకు తనకు దూరమైందన్న భయం బీజేపీని పీడిస్తున్నది. రైతు ఉద్యమాలు, ఆ తరువాత మహిళా రెజ్లర్ల ఆందోళనలు, బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ పక్షాన బీజేపీ పెద్దల అనుచిత ప్రవర్తన ఇత్యాదివి జాట్లను పార్టీకి దూరం చేశాయి. ఖాప్‌ పంచాయితీలు సైతం పలు తీర్మానాలతో తమ అసంతృప్తిని బాహాటంగా ప్రకటించాయి. అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్‌లోనూ ఉన్నాయి కానీ, వినీశ్‌ ఫోగాట్‌, బజ్రంగ్‌ పునియా ఇత్యాది యువ, జాట్‌ రెజ్లర్ల ప్రవేశంతో ఈ మారు జాట్ల మద్దతు కచ్చితంగా తనకు దక్కుతుందన్న సమధికోత్సాహంలో ఆ పార్టీ ఉంది. హ్యాట్రిక్‌ కోసం బీజేపీ, అధికారం కోసం కాంగ్రెస్‌ సాగిస్తున్న ఈ హోరాహోరీ పోరులో ప్రజలు ఏ పక్షాన ఉంటారో చూడాలి.

Updated Date - Sep 11 , 2024 | 04:41 AM