మరో ‘మహా’పోరాటం
ABN , Publish Date - Oct 16 , 2024 | 03:51 AM
కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించింది. మహారాష్ట్రలో నవంబరు 20న ఒకేదశలో, జార్ఖండ్‌లో నవంబరు 13, 20వతేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది...
కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించింది. మహారాష్ట్రలో నవంబరు 20న ఒకేదశలో, జార్ఖండ్‌లో నవంబరు 13, 20వతేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. 288 శాసనసభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబరు 26తో గడువు ముగియబోతుంటే, 81 స్థానాలున్న జార్ఖండ్ శాసనసభ గడువు వచ్చే ఏడాది జనవరి 5వ తేదీతో ముగియనుంది. ప్రస్తుతం మహారాష్ట్రని మూడుపార్టీల ‘మహాయుతి’ సంకీర్ణం ఏలుతూంటే, జార్ఖండ్‌లో జెఎంఎం–కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. హర్యానాలో ఘనంగా గెలవగలనని అనుకొని, ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌కు మహారాష్ట్ర ఎన్నికలు మరో అగ్నిపరీక్ష. ప్రత్యర్థి పార్టీలను చీల్చి దక్కించుకున్న మహారాష్ట్రను మరోవిడత నిలబెట్టుకోవడం బీజేపీకి మహాపరీక్ష.
ఎదురుగాలులు వీస్తున్నాయని అనుకున్న హర్యానాలో మూడోసారి ధాటీగా అధికారంలోకి రావడంతో బీజేపీ మంచి ఉత్సాహం మీద ఉంది. సార్వత్రక ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి తీవ్ర నిరాశను మిగల్చి, సొంతకాళ్ళమీద నిలబడలేకుండా చేసిన నేపథ్యంలో, హర్యానా మానసికంగా మంచి శక్తినీ ఉత్తేజాన్ని ఇచ్చింది. అయితే, మొన్నటి లోక్‌సభ ఎన్నికల సందర్భంలో 48స్థానాలున్న మహారాష్ట్రలో మహాయుతి కూటమి 17 మాత్రమే నెగ్గిన విషయం తెలిసిందే. ఇందులో తొమ్మిది బీజేపీవి. సరిగ్గా ఐదేళ్ళక్రితం అప్పటి శివసేన–బీజేపీ కూటమి 41స్థానాలు గెలుచుకొని, అందులో 23 బీజేపీ వాటాగా ఉన్న స్థితిని దృష్టిలో పెట్టుకుంటే, అనంతరకాలంలో రాష్ట్రంలోని రెండు ప్రధానపక్షాలైన శివసేన, ఎన్సీపీలను ముక్కలు చేసి, ఆ చీలికలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ పట్ల ప్రజలు సానుకూలంగా లేరని అర్థం. శివసేనను చీల్చిన ఏక్‌నాథ్ షిండే దేశవ్యాప్తంగా వెన్నుపోటు రాజకీయాలకు ప్రతీకగా నిలిచిపోయారు. ఆ తరువాత శరద్‌పవార్‌నుంచి చీలిన అజిత్‌పవార్‌కు కూడా బీజేపీ అధికారంలో వాటా ఇచ్చింది. ఎన్నికల సంఘం దగ్గరా, న్యాయస్థానాల్లోనూ ఉద్ధవ్ ఠాక్రే, శరద్‌పవార్‌లు ఓడినప్పటికీ, మొన్న జూన్‌లో ప్రజాక్షేత్రంలో వారికి మంచి ఊరట దక్కింది. ఇక, వరాల వరదతో మహారాష్ట్రను ముంచెత్తుతున్న బీజేపీకి రాబోయే ఎన్నికలు పెద్ద పరీక్ష. బీజేపీ–షిండే మధ్య విభేదాలు ఉన్నాయని, అజిత్ పవార్ మళ్ళీ వెనక్కుపోతారని ఏవో వార్తలు వినబడుతున్నప్పటికీ, మహాయుతి ఆదినుంచీ సంఘటితంగానే వ్యవహరిస్తున్నది. వేలకోట్ల విలువైన ప్రాజెక్టులు, పథకాలతో ఉద్ధవ్, శరద్‌ల మీద ప్రజలకున్న సానుభూతిని తుడిచిపెట్టేసే ప్రయత్నమైతే చేస్తున్నది.
హర్యానాలో గెలిచివుంటే కాంగ్రెస్‌కు బేరసారాలు ఆడగలిగే శక్తి ఉండేదని, మహావికాస్ అగాఢీలో దానిమాట చెల్లేదని, ఇప్పుడు సీట్లసర్దుబాటు చర్చల్లో కాంగ్రెస్‌ది పైచేయి కాలేదని విశ్లేషణలు సాగుతున్నాయి. అంత అహంకారం పనికిరాదనో, మిత్రులను విస్మరిస్తే ఇలాగే జరుగుతుందనో హర్యానా ఓటమి నేపథ్యంలో ఇండియా బ్లాక్ పార్టీలు కాంగ్రెస్ మీద విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఉద్ధవ్ ఠాక్రే కూడా ఓ నాలుగుమాటలు ఎక్కువే విసిరి కాంగ్రెస్ చేతులు కట్టేసే ప్రయత్నం చేశారు. మహావికాస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రేను ముందే ప్రకటించాలన్న అంశంతో సహా శరద్ పవార్ పార్టీ, కాంగ్రెస్‌ల ముందు శివసేన ఉంచుతున్న డిమాండ్లు చాలా ఉన్నాయట. మూడు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటు చర్చలు తీవ్రస్థాయిలో ఉద్రిక్తంగా సాగుతున్నాయని వార్తలు వినబడుతున్నాయి. ఇచ్చిపుచ్చుకోవడాల్లో ఎంతోకొంత రాజీపడి, అతిత్వరగా ఆ ప్రక్రియ ముగించి, సంఘటితంగా కదనరంగంలోకి దిగి పోరాడాల్సిన అవసరం ఉందని హర్యానా ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఎక్కువ ఎంపీసీట్లు గెలుచుకోవడంతో మహావికాస్ అగాఢీలోని మూడుపార్టీలకు ఎక్కడలేని ధైర్యమూ వచ్చింది. ఏక్‌నాథ్‌షిండే ప్రభుత్వం పతనం ఆరంభమైందని, మహారాష్ట్రీయులు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతిని మట్టిలో కలిపేస్తారని వారంతా భీకరప్రకటనలు చేశారు. కానీ, లోక్‌సభ ఎన్నికల్లో అద్భుతం జరిగినంత మాత్రాన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలు బ్రహ్మరథం పడతారన్న గ్యారంటీ ఏమీలేదు. హర్యానా ప్రజలు ఈ రెండు సందర్భాల్లోనూ విభిన్నంగా ఓటేసిన విషయాన్ని మహావికాస్ నేతలు మరిచిపోకూడదు.