Share News

మరో గాజా దిశగా...!

ABN , Publish Date - Sep 27 , 2024 | 01:32 AM

మీరు ఈ వీడియో చూడటం హిజ్బొల్లాకు ఇష్టం లేదు, ఇతరులకు షేర్‌ చేయడం దానికి అస్సలు నచ్చదు అంటూ ట్విటర్‌లో ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (ఐడీఎఫ్‌) దానిని పోస్టు చేసింది. దక్షిణ లెబనాన్‌మీద ఇజ్రాయెల్‌ సాగిస్తున్న భయానకదాడుల్లో...

మరో గాజా దిశగా...!

మీరు ఈ వీడియో చూడటం హిజ్బొల్లాకు ఇష్టం లేదు, ఇతరులకు షేర్‌ చేయడం దానికి అస్సలు నచ్చదు అంటూ ట్విటర్‌లో ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (ఐడీఎఫ్‌) దానిని పోస్టు చేసింది. దక్షిణ లెబనాన్‌మీద ఇజ్రాయెల్‌ సాగిస్తున్న భయానకదాడుల్లో ఇప్పటికే లక్షమంది నిరాశ్రయులైన నేపథ్యంలో, తన చర్యలను సమర్థించుకోవడానికి ఇజ్రాయెల్‌ ఈ వీడియో విడుదల చేసింది. హిజ్బొల్లా ఎంత దుర్మార్గమైనదో, భయానకమైనదో తెలియచెప్పడం దీని లక్ష్యం. దక్షిణ లెబనాన్‌ అంతటా హిజ్బొల్లా తన ఉగ్రవాద వ్యవస్థను వి‍స్తరించిందని, భూగర్భంలో సొరంగాలు నిర్మించిందని, మారణాయుధాలను దాచిందని, సామాన్యుల ఇళ్ళను ఆయుధాగారాలుగా మార్చేసిందని ఇజ్రాయెల్‌ వాదన. కొన్ని చిత్రాలు, మరికొన్ని గ్రాఫిక్స్‌తో తయారైన ఈ వీడియోలో ఇజ్రాయెల్‌ తాను మిగతా ప్రపంచానికి చెప్పదల్చుకున్నదీ, ఆరోపించదల్చుకున్నదీ ఉంది. ఇదంతా ఆత్మరక్షణలో భాగమేననీ, లెబనాన్‌మీద దాడిచేయకపోతే తాను నాశనమైపోతాయని ఇజ్రాయెల్‌ చెప్పుకుంటోంది. హిజ్బొల్లాతో చర్చలు, కాల్పుల విరమణ వంటి ప్రతిపాదనలను తిరస్కరించడమే కాక, లెబనాన్‌లోకి చొరబడటానికి సిద్ధంగా ఉండమని తన సైన్యాన్ని ఇజ్రాయెల్‌ ఆదేశించడంతో గాజాయుద్ధం కొత్త మలుపు తీసుకుంది.


మరో పదిరోజుల్లో అక్టోబర్‌ 7 ఘటనకు ఏడాది అవుతుంది. ఇజ్రాయెల్‌ మీద హమాస్‌ అమానుష దాడికి ప్రతీకారంగా, గాజామీద యుద్ధానికి దిగుతూ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమీన్‌ నెతన్యాహూ రెండు ప్రధాన లక్ష్యాలు ప్రకటించారు. హమాస్‌ అపహరించుకుపోయిన వారిని భద్రంగా వెనక్కుతెచ్చి కుటుంబీకులకు అప్పగించడం, ఇజ్రాయెల్‌ ఉనికికి ప్రమాదకరంగా పరిణమించిన ఉగ్రవాద హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టేయడం. మధ్యలో కొద్దిమందిని హమాస్‌ తనకు తానుగా అప్పగించడం, మరికొందరు చనిపోవడం కాక ఇంకా చాలామంది ఇజ్రాయెలీలు హమాస్‌ నిర్బంధంలోనే ఉన్నారు. అమెరికా ఆర్థిక, ఆయుధ సాయంతో ఏడాదిగా ఇజ్రాయెల్‌ సాగిస్తున్న యుద్ధంలో గాజా పూర్తిగా నేలమట్టమై, దాదాపు యాభైవేలమంది మరణించి, లక్షలమంది నిరాశ్రయులైన నేపథ్యంలో, హమాస్‌ సైతం బాగా దెబ్బతిన్నమాట నిజం. కానీ, అది నాశనమైందని ఐడీఎఫ్‌ ఉన్నతాధికారులు కూడా అనడం లేదు. హమాస్‌తో అవగాహనకు వచ్చి మిగిలిన బందీలను సైతం విడిపించనందుకు నెతన్యాహూమీద ప్రజాగ్రహం అధికంగా ఉంది. ఆయన విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీల దశదాటి ఇటీవల దేశవ్యాప్త సమ్మె కూడా జరిగింది. కాలు ఎలా వెనక్కుతీసుకోవాలో తెలియని స్థితిలో, ఇప్పుడు నెతన్యాహూ తన యుద్ధక్షేత్రాన్ని మరింత విస్తరించుకుంటూ పోతున్నారు. హమాస్‌ మాదిరిగానే హిజ్బొల్లాను కూడా కూకటివేళ్ళతో సహా పెకిలించివేస్తానని, అప్పుడు మాత్రమే ఇజ్రాయెలీలు నిశ్చింతగా ఉండగలరని చెబుతున్నాడు.


హిజ్బొల్లాతో యుద్ధం ఇప్పటికిప్పుడు ఆరంభమైందేమీ కాదు కానీ, అమీతుమీ తేల్చుకొనే పని జరుగుతోంది. ఎప్పటిలాగానే అమెరికా సహా ఇజ్రాయెల్‌ మిత్ర, ఆప్తదేశాలన్నీ ఏవేవో సుద్దులు చెబుతూ, యుద్ధానికి హద్దులు గీస్తూంటే ఇజ్రాయెల్‌ మాత్రం తాను అనుకున్నది చేసుకుపోతోంది. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ముందుగా పేజర్లు, ఆ తరువాత వాకీటాకీల పేల్చివేతతో వందలాదిమంది ఫైటర్లని క్షణాల్లో ఎందుకూ కొరగానివారిని చేసి, హిజ్బొల్లా పునాదులను ఇజ్రాయెల్‌ కుదిపేసింది. ఆ తరువాత క్షిపణిదాడుల్లో అగ్రశ్రేణి నాయకత్వాన్ని వరుసపెట్టి హతమారుస్తోంది. లెబనాన్‌ పౌరుల మొబైల్‌ఫోన్లలోకి నేరుగా మెసేజ్‌లు పంపి ఇజ్రాయెల్‌ వారికి హితవులు చెబుతోంది, హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పుడు నేరుగా పొరుగుదేశంలోకి చొచ్చి, భూతల దాడులతో యుద్ధాన్ని పైదశకు తీసుకుపోవాలన్నది నెతన్యాహూ కోరిక. ఇజ్రాయెల్‌ వరుస దెబ్బలకు హిజ్బొల్లా గిలగిల్లాడుతున్నమాట నిజం. రెండు దశాబ్దాల తరువాత ఇజ్రాయెల్‌ చేతిలో ఈ స్థాయిలో చావుదెబ్బతిన్నప్పటికీ, మళ్ళీ కోలుకోదన్న హామీ ఏమీ లేదు. కానీ, హిజ్బొల్లాను నాశనం చేసే పేరిట లెబనాన్‌లోకి చొరబడి, అక్కడ మరో గాజాని సృష్టించే ఇజ్రాయెల్‌ విధానం ఏమాత్రం సరికాదు. ప్రస్తుతానికి హెచ్చరికలతో సరిపెడుతున్న ఇరాన్‌ను యుద్ధబరిలోకి లాగడానికి ఇటువంటి చర్యలు తోడ్పడతాయి. నెతన్యాహూ నిజంగానే ఇజ్రాయెలీల క్షేమాన్ని కాంక్షిస్తున్నపక్షంలో ఇప్పటికైనా యుద్ధానికి కాక, దౌత్యానికి ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం.

Updated Date - Sep 27 , 2024 | 01:32 AM