Share News

సముచిత నిర్ణయం

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:49 AM

తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి చిట్యాల (చాకలి) ఐలమ్మ పేరు పెట్టాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం స్వాగతించదగింది. దొరల అరాచకాలకు ఎదురొడ్డి నిలచిన ఈ వీరవనిత...

సముచిత నిర్ణయం

తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి చిట్యాల (చాకలి) ఐలమ్మ పేరు పెట్టాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం స్వాగతించదగింది. దొరల అరాచకాలకు ఎదురొడ్డి నిలచిన ఈ వీరవనిత పోరాటస్ఫూర్తి భవిష్యత్‌ తరాలకు గుర్తుండేలా హైదరాబాద్‌ కోఠీలోని విశ్వవిద్యాలయానికి ఆమె పేరు పెడుతున్నామని రేవంత్‌ ప్రకటించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేదలకు భూహక్కులు కల్పించడం, పీవీ నరసింహారావు చేపట్టిన భూ సంస్కరణలు లక్షలాదిమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, నిరుపేదలకు మేలు చేకూర్చాయని, ఆ నిర్ణయాల వెనుక ఐలమ్మ భూ పోరాటం స్ఫూర్తి ఉన్నదని అన్నారు రేవంత్‌. విశ్వవిద్యాలయానికి ఐలమ్మ పేరుపెట్టడంతోపాటు, ఆమె మనుమరాలు శ్వేతను రాష్ట్ర మహిళాకమిషన్‌ సభ్యురాలిగా నియమిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. బడుగులకు, వృత్తికులాలకు గుర్తింపునూ, గౌరవాన్ని కల్పించే సముచిత నిర్ణయాలివి.


రవీంద్రభారతిలో ఐలమ్మ 39వ వర్థంతి కార్యక్రమంలో అప్పటికప్పుడు చేసిన ప్రకటనగా కనిపించినప్పటికీ, మహిళా యూనివర్సిటికీ ఈ వీరవనిత పేరుపెట్టాలన్న నిర్ణయం వెనుక పాలకుల మదిలో ఏదో వ్యూహం, వెనుక మేధోమ‌థనం ఉండకపోదు. ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య ఈ పేరును సూచించారంటూ రేవంత్‌ చెప్పడం ఉదాత్తంగా ఉంది. అధికారంలోకి రాగానే ప్రజాభవన్‌కు జ్యోతీబా ఫూలే పేరుపెట్టడాన్ని రేవంత్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఐఐహెచ్‌టీకి కొండా లక్ష్మణ్‌ పేరుపెట్టడం వరకూ తన ప్రభుత్వం తెలంగాణ కోసం పోరాడిన మహనీయులను ఏ విధంగా స్మరించుకుంటున్నదో కూడా ఆయన వివరించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణకు ఏర్పడిన హైడ్రా దూకుడుగా తనపనిచేసుకుపోతున్న నేపథ్యంలో, భూముల ఆక్రమణలను అడ్డుకోవడంలోనూ ఐలమ్మ తమకు స్ఫూర్తిగా నిలిచిందని ముఖ్యమంత్రి చెప్పుకున్నారు. ఇటీవల దివంగతులైన వడ్డేపల్లి కృష్ణ ఐలమ్మమీద రచించిన నృత్యరూపకాన్ని ఈ సందర్భంగా తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు అలేఖ్య పుంజాల బృందం ప్రదర్శించడం సముచితంగా, శోభస్కరంగా ఉంది.


ఐలమ్మ వర్థంతి సందర్భంగా తీసుకున్న నిర్ణయమే అయినప్పటికీ, తెలంగాణ సాయుధపోరాట వారోత్సవాల నేపథ్యంలోనూ ఇది మరింత సరైన నిర్ణయం. దొరల అరాచకాలకు ఎదురొడ్డినిలిచిన ఐలమ్మ తెలంగాణ సాయుధపోరాటానికి ఆది, పునాది. భూమికోసం, భుక్తికోసం, వెట్టినుంచి విముక్తికోసం సాగిన ఆ సుదీర్ఘ పోరాటానికి ఆమె భూసమస్యే వేదికైంది. విస్నూర్ దేశ్‌ముఖ్‌మీద ఆమె తిరుగుబాటు, దొర గూండాలు, రజాకార్లతో నిత్యఘర్షణలు ఒక నిరంతర స్ఫూర్తి. ఒక చిన్న తిరుగుబాటుగా మొదలై, రైతాంగపోరాటంగా మారి నిరుపేదలకు పదిలక్షల ఎకరాల భూపంపిణీకి వీలుకల్పించింది, సమాజంలో అట్టడుగువర్గాలకు, అంటరాని కులాలకు పీడననుంచి విముక్తి దక్కింది. ఆధిపత్యపెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా ఆమె చేసిన ఆత్మగౌరవపోరాటం బడుగులకు కొండంత శక్తినిచ్చింది. దొర అకృత్యాలకు తన కుటుంబం చిన్నాభిన్నమైపోయినా, ఆత్మవిశ్వాసమే ఆయుధంగా భూపోరాటాలకు దారిచూపింది ఆమె. ప్రజాపోరాటాలకు స్ఫూర్తిగా, మహిళాశక్తికీ, చైతన్యానికీ ప్రతీకగా నిలిచిన ఆ యోధురాలి పేరును మహిళావిశ్వవిద్యాలయానికి పెట్టడం సముచితంగా ఉంటుందని ప్రభుత్వం భావించింది. ఆమె ధైర్యం, తెగువ, ప్రతిఘటనాతత్వం మహిళలు, విద్యార్థినులకు ఎల్లవేళలా స్ఫూర్తినివ్వాలన్నది పాలకుల అభీష్టం కావచ్చు. తెలంగాణకు సంబంధించిన చిహ్నాలు, గుర్తింపుల విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య ఒక పోటీ నడుస్తోంది. పాటలు, స్థలాలు, విగ్రహాలు ఇత్యాది అంశాల్లో ఇరుపక్షాల మధ్యా సాగుతున్నదేమిటో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో వెనుకపట్టుపట్టిన లేదా గుర్తింపునకు నోచుకోని అంశాలను ముందుకు తీసుకురావడం, తన ప్రత్యేకతను నిలబెట్టుకోవడం లక్ష్యంగా రేవంత్‌ అడుగులు, నిర్ణయాలు ఉన్నాయి.

Updated Date - Sep 12 , 2024 | 12:49 AM