Share News

పీడితుల పిల్లనగ్రోవి అరుణోదయ నాగన్న

ABN , Publish Date - Oct 19 , 2024 | 05:49 AM

పాటలు ఎన్నో కదా! ఒక గాయకుడు ఎన్నిసార్లు తన కోసం పాడుకుంటాడు? తన కోసం కొన్ని, జనం కోసం కొన్ని, తన జన కోసం మరికొన్ని పాడుకుంటాడా? ఏమో! తెలియదు. కాని, పాట ఏదైనా గాయకుడి గొంతులో ఒక దృశ్యం ఉంటుంది. పక్షిలా, పక్షుల గుంపుల్ని మోస్తున్న మహా వృక్షంలా గాయకుడు

పీడితుల పిల్లనగ్రోవి అరుణోదయ నాగన్న

ఒక గాయకుడు ఎందుకు పాడతాడు? పాటలు ప్రత్యేకంగా ఒక గొంతుని కోరుకుంటాయా? పాటలు ఎలా పలుకుతాయి? ఎవరు రాసినా, కన్నతల్లి గర్భంలా ఎవరు మోసి జన్మనిచ్చినా, పాట పెరిగి పెద్దదై జీవించేది గాయకుడి గొంతులోనే. పసితనాన్ని, బాల్యాన్ని, యవ్వనాన్ని, వృద్ధాప్యాన్ని, మరణాన్ని, ఆపై అమరత్వాన్ని పలికించేది ఆ గొంతు తడితోనే.

నాగన్న గాయకుడు. అరుణోదయ పాటలు కోరుకున్న ఆత్మీయ గొంతుక. నాగన్న గొంతు పీడితుల పిల్లన గ్రోవి. నాగన్న ఎన్నో పాటలని ప్రాణప్రదంగా పలికించాడు. లాలిగా, జోలగా, లయగా, గోదావరి లోయగా, పోరుగా, నక్సల్బరీ హోరుగా, ఎరుపు దిక్కుగా, నెత్తుటి జెండాగా, అడవి మల్లెగా, వేకువజాము పల్లెగా, అరుణోదయ బాటగా పాడుతూనే ఉన్నాడు.


పాటలు ఎన్నో కదా! ఒక గాయకుడు ఎన్నిసార్లు తన కోసం పాడుకుంటాడు? తన కోసం కొన్ని, జనం కోసం కొన్ని, తన జన కోసం మరికొన్ని పాడుకుంటాడా? ఏమో! తెలియదు. కాని, పాట ఏదైనా గాయకుడి గొంతులో ఒక దృశ్యం ఉంటుంది. పక్షిలా, పక్షుల గుంపుల్ని మోస్తున్న మహా వృక్షంలా గాయకుడు కదులుతూ, మెదులుతూ కనిపిస్తాడు. ఒంటరిగా, తుంటరిగా, ముసి ముసిగా, మసి మసిగా, కన్నీళ్ళలా, కాలిపోతున్నట్టు, గాలి ఆగి పోతున్నట్టు ఉంటాడు. దగ్గరగా వస్తాడు. కళ్ళ మీదికొచ్చి, మసకబార్చి రెప్పపాటులో దూరమవుతాడు. మనసులో భావాలని, భావోద్వేగాలని తాకి కొత్త సముద్రాల్ని సృష్టిస్తాడు. సప్త స్వరాల ఆరోహణ–అవరోహణల కెరటాలుగా వినిపిస్తాడు.

నాగన్న గాన కెరటం. నాజార్‌లా, కానూరి తాతలా, అరుణోదయ రామారావులా మన మనసులో కూర్చొని గుండెల్ని కెలుకుతుంటాడు. ‘‘కొమ్మల్లో రెమ్మల్లో కమ్మంగా పాడేటి నల్లాని ఓ కోయిలమ్మ, నల్ల నల్లాని నా కోయిలమ్మ’’ అంటూ వెంటపడతాడు. పాట వెంట పాట. నాగన్నది పాటల జీవితం. నాగన్న గొంతు పాటల ప్రవాహం! ఆ ప్రవాహం అడవిలా చిక్కగా ఉంటుంది. అమరత్వంలా రమణీయంగా ఉంటుంది. నాగన్నకు ఆయన గొంతు ఒక ఆభరణం. రాజకీయ విశ్వాసం, నిర్మాణ నిబద్ధత ఆయనకు అవార్డులు. విప్లవ ఆరాటం, పోరాటం ఆయన వ్యక్తిత్వం. నాగన్న అస్తిత్వానికి పునాది ఆయన తోడబుట్టిన మధుర స్వరం. పీడిత ప్రజల విముక్తి ఆయన స్వప్నం. ఆ స్వప్నాన్ని సజీవంగా ఆలపించే అరుణోదయ నాగన్న జీవితం ధన్యం.

– లెల్లే సురేష్‌

(నేటి సాయంత్రం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలో అరుణోదయ నాగన్నకు సుద్దాల హనుమంతు జాతీయ పురస్కార సత్కార సభ)

Updated Date - Oct 19 , 2024 | 05:49 AM