లంకలో అరుణోదయం
ABN , Publish Date - Sep 24 , 2024 | 01:40 AM
శ్రీలంక కొత్త అధ్యక్షుడుగా మార్క్సిస్టు నాయకుడు అనుర కుమార దిస్సనాయకే సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. శనివారం జరిగిన ఎన్నికల్లో ఈయన నేతృత్వంలోని ఎన్‌పిపి సంకీర్ణానికి సమీప ప్రత్యర్థి సాజిద్ ప్రేమదాసకంటే...
శ్రీలంక కొత్త అధ్యక్షుడుగా మార్క్సిస్టు నాయకుడు అనుర కుమార దిస్సనాయకే సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. శనివారం జరిగిన ఎన్నికల్లో ఈయన నేతృత్వంలోని ఎన్‌పిపి సంకీర్ణానికి సమీప ప్రత్యర్థి సాజిద్ ప్రేమదాసకంటే పన్నెండు లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. లంకలో పేరున్న రాజపక్సేలు, రణసింఘేలు, ప్రేమదాసల మీద జనం విపరీతమైన ఆగ్రహంతో ఉన్నారని అందుకే బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని ఈయనకు పట్టంకట్టారని విశ్లేషకులు అంటున్నారు. ఆర్థికసంక్షోభం అంచున ఉన్న దేశాన్ని ప్రస్తుత విధానాలు బాగుచేయలేవని నమ్మిన ప్రజలు, తమ భవిష్యత్తును ఈ యాభైఐదేళ్ళ వామపక్ష నాయకుడి చేతిలో పెట్టారు.
పదేళ్ళక్రితం జనతావిముక్తి పెరుమన (జేవీపీ)కు అధ్యక్షుడై, ఆరేళ్ల క్రితం ఆ పార్టీ నేతృత్వంలో నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పిపి) కూటమిని ఏర్పాటు చేసి, అప్పటి అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడినప్పుడు అనుర కుమార దిస్సనాయకే (ఎకెడి)కు మూడుశాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మరో నలభైశాతం ఓట్లు పడటానికి ప్రధాన కారణం ప్రజల ఆర్థిక దుస్థితి, దుర్భరమైపోయిన వారి దైనందిన జీవితాలు. ప్రజల్లో ఉన్న నిరాశానిస్పృహలను ఎకెడి చక్కగా వినియోగించుకున్నారు. ప్రత్యర్థులందరినీ చేతకానివారుగా చీల్చిచండాడి, తాను సచ్ఛీలుడినని చేసిన ప్రచారం జనానికి ఎక్కింది. మిగతావారంతా దోచుకోవడానికి వస్తే, తాను రక్షించడానికి వచ్చానని ఆయన చెప్పుకున్నాడు. కష్టాల్లో ఉన్న జనానికి ఇటువంటి మాటలు సులువుగా ఎక్కుతాయి కనుక, వారికి ఆయన ఓ ఉద్ధారకుడిగా కనిపించాడు. రాజపక్సేలు రగల్చిపోయిన ఆగ్గిని చల్లార్చి, పరిస్థితులను దారికి తెచ్చి, ఇరుగుపొరుగుదేశాల చేయూతతో, ఐఎంఎఫ్ ఆర్థిక సాయంతో దేశాన్ని ఎంతోకొంత గాడినపెట్టాడని మిగతా ప్రపంచమంతా అంటున్న రణిల్ విక్రమసింఘేను కూడా జనం కాదుపొమ్మన్నారు. రాజపక్సేలకు వ్యతిరేకంగా సాగిన ప్రజాఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడం, అధ్యక్ష బరిలోకి దిగబోతున్నానని ముందుగానే ప్రకటించడం ఎకెడికి వివిధ వర్గాలను ఆకట్టుకోవడానికి ఉపకరించింది.
ఆయన సారథ్యం వహిస్తున్న జేవీపీకి హింసాత్మక చరిత్ర ఉంది. 1970, 80 దశకాల్లో అది సాయుధ తిరుగుబాట్లు చేసింది, వందలాదిమంది మరణించారు. ఎల్‌టీటీఈ సారథ్యంలో తమిళుల అస్తిత్వపోరాటం మొదలైన తరువాత ఈ పార్టీ లంక జాతీయవాదానికి ప్రతినిధిగా అవతరించి, ఎల్‌టీటీఈతో ప్రత్యక్ష యుద్ధం కూడా చేసింది. భారత్–శ్రీలంక శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ జేవీపీ సాగించిన హింసలో వందలమంది మరణించారు. ఈ ఒప్పందం ఆధారంగా ఉనికిలోకి వచ్చిన ప్రాంతీయమండళ్ళకు కొద్దిపాటి అధికారాలు బదలాయించడాన్ని కూడా ఈ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎకెడి విజయోత్సవంలో ఎర్రజెండాలు కనిపిస్తున్నా అది మతవాద, మితవాద పార్టీయేనని కొందరి వ్యాఖ్యానం. జేవీపీ అధ్యక్షుడైన తరువాత ఆయన గతకాలపు హింసకు క్షమాపణలు కోరారు కానీ, ప్రాంతీయమండళ్ళు కొనసాగుతాయన్న ఒక్కమాట తప్ప తమిళుల విషయంలో ఆయన వైఖరి పెద్దగా మారలేదు. ఆయనకూ, ఆయన పార్టీకి భారత వ్యతిరేకి అన్నపేరుంది. చైనా అనుకూలుత గురించి ఇక ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఎకెడి రాకతో, అదానీ విండ్ పవర్ ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని అంటారు. భారత ప్రధాని నరేంద్రమోదీ గత పాలకులతో నేరుగా మాట్లాడి అదానీకి ఈ ప్రాజెక్టు ఇప్పించారన్న ఆరోపణలు వెల్లువెత్తినప్పటినుంచి పక్షంరోజుల క్రితం వరకూ కూడా ఎకెడి ఈ ప్రాజెక్టు రద్దు విషయంలో ఒకేమాట మీద ఉన్నారు. సోమవారం దేశ 9వ అధ్యక్షుడుగా ప్రమాణం చేస్తున్న సందర్భంలో, తాను మెజీషియన్‌ని కాదని, దేశాన్ని ఆర్థికసంక్షోభం నుంచి బయటపడవేయడానికి తన సైద్ధాంతిక కట్టుబాటుకు భిన్నమైన శక్తులతో కూడా సానుకూలంగా వ్యవహరిస్తానని తన ప్రసంగంలో మాటిచ్చారు.
వివిధ ట్రేడ్‌యూనియన్లు, సామాన్యులు ఆయనకు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో, విజయావకాశాలు మెరుగుపడుతున్న తరుణంలో భారతదేశం ఆహ్వానించడం, ఆయన పర్యటించడం కూడా జరిగింది. ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో ఎకెడి అధ్యక్షుడిగా నెగ్గినట్టు తేలిన పదినిముషాల్లోనే భారత ప్రతినిధి బృందం స్వయంగా ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపింది. ఇరుగుపొరుగుదేశాలతో సత్సంబంధాలు కొనసాగుతాయన్న ఆయన హామీలో భారత్ వాటా ఎంతో భవిష్యత్తులో తేలుతుంది. 225సీట్ల పార్లమెంటులో మూడు మాత్రమే ఉన్న దిసనాయకే, ఈ వేడి చల్లారకముందే పార్లమెంటు ఎన్నికలకు పోవడానికి సిద్ధపడుతున్నారు. చట్టసభలో అవసరమైనంత సంఖ్యాబలాన్ని సాధించాక ఆ ఎర్రదనాన్ని పూర్తిగా వదిలేసి, అసలు రంగు ప్రదర్శిస్తాడని కొందరి అంచనా.