స్వేచ్ఛాజీవి అసాంజే
ABN , Publish Date - Jun 27 , 2024 | 04:38 AM
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ఇప్పుడు స్వేచ్ఛాజీవి. ప్రత్యేక విమానంలో బుధవారం స్వదేశం ఆస్ట్రేలియా చేరుకున్న ఆయన, విమానాశ్రయంలో భార్యనీ, తండ్రినీ ఆప్యాయంగా...
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ఇప్పుడు స్వేచ్ఛాజీవి. ప్రత్యేక విమానంలో బుధవారం స్వదేశం ఆస్ట్రేలియా చేరుకున్న ఆయన, విమానాశ్రయంలో భార్యనీ, తండ్రినీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు, ఎంతో ఉత్సాహంగా తనను పలుకరిస్తున్న మీడియాకు చేతులూపారు. పద్నాలుగేళ్ళ సుదీర్ఘ వివాదం నుంచి తనను బయటపడవేసి, సొంతింటికి చేర్చడంలో కీలకమైన పాత్ర పోషించినందుకు ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌కు ఫోన్‌చేసి ధన్యవాదాలు కూడా తెలియచేశారు. కాస్తంత విశ్రాంతి తీసుకున్నాక త్వరలోనే అసాంజే మీడియా ముందుకు వస్తారని కుటుంబీకులు హామీ ఇచ్చారు. ఏళ్ళతరబడి న్యాయపోరాటం చేస్తూ, ఒకదశలో ప్రాణభయంతో వొణికిపోయిన ఆయన చివరకు ఇలా ఒక ఒప్పందానికి వచ్చి, నిర్దోషిగా బయటపడిన క్రమం, అది అమలుజరిగిన వేగం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తున్నది.
నేరాంగీకారానికి అమెరికా ప్రభుత్వంతో ఓ అంగీకారానికి రాగానే ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. బ్రిటన్‌లోని హైసెక్యూరిటీ జైలునుంచి అసాంజే బయటకు వచ్చారు, ఒక ప్రైవేట్ విమానంలో పశ్చిమ పసిఫిక్‌లోని ఉత్తర మారియానా ద్వీపం చేరుకొని, అక్కడి అమెరికా కోర్టులో తప్పు ఒప్పుకున్నారు. నేరుగా అమెరికాలో అడుగుపెట్టి, అక్కడి కోర్టులో ఆ పనిచేయాల్సిన బాధలేకుండా ఆస్ట్రేలియాకు అత్యంత సమీపంలో ఉన్న ఓ అమెరికన్ ద్వీపాన్ని ఎంచుకున్నారన్నమాట. అసాంజే తన నేరాన్ని అంగీకరిస్తారు, అందుకు బదులుగా అమెరికా ప్రభుత్వం ఆయనకు విముక్తి ప్రసాదిస్తుంది అన్న సమాచారం అందరికీ ముందే తెలిసినప్పటికీ, న్యాయస్థానంలో అసాంజే ఏయే మాటలతో ఆ పనిపూర్తిచేస్తారన్న ఉత్సుకత మాత్రం కాస్తంత మిగలకపోలేదు. గూఢచర్యం చట్టానికి విరుద్ధంగా, దేశభద్రతకు సంబంధించిన అతిముఖ్యమైన సమాచారాన్ని సేకరించడం, వ్యాప్తిచేయడం తప్పేనని ఒప్పుకుంటే కథ సుఖాంతం అవుతుంది కనుక ఆయన ఆ పని సవ్యంగా పూర్తిచేశారు, క్షేమంగా బయటపడ్డారు.
అసాంజేను అమెరికాకు అప్పగించండంటూ బ్రిటన్ దిగువకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పుమీద మరో రెండువారాల్లో ఆయన ఎగువకోర్టులో అప్పీలు చేసుకోవాల్సి ఉండగా ఈ ఒప్పందం కుదిరింది. అమెరికా ఆయన మీద పెట్టిన కేసుల లెక్కప్రకారం 175సంవత్సరాల వరకూ జైలుశిక్ష అనుభవించాల్సి రావచ్చు. కానీ, అధికారంలో బైడెన్ ప్రభుత్వం ఉండటం, ఈ ఏడాది చివర్లో అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరగబోతూండటంతో వాతావరణం కలిసొచ్చింది.
దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ వస్తున్న ఒత్తిడికి బైడెన్ లొంగుతున్న విషయం ఫిబ్రవరిలోనే అర్థమైంది. అసాంజే మీద కేసులు ఉపసంహరించుకోవాలని ఆస్ర్టేలియా ప్రభుత్వం విజ్ఞప్తిచేయడం, సానుకూలంగా పరిశీలిస్తానని బైడెన్ హామీ ఇవ్వడంతో ఈ నేరాంగీకార ఒప్పందం ద్వారా బయటపడిపోవడానికి అసాంజేకు వీలుకలిగింది. మూడుగంటల విచారణలో ఆయన వాక్‌స్వాతంత్ర్యం, భావ ప్రకటనాస్వేచ్ఛ ఇత్యాది ప్రస్తావనలతో తనను తాను సమర్థించుకుంటూ కొన్ని వ్యాఖ్యలు, విశ్లేషణలు చేశారు. ఒక జర్నలిస్టుగా రహస్యపత్రాలు సేకరించి, ప్రజలకు తెలియచేసే హక్కును కూడా గుర్తుచేశారు. అయినా, అంతిమంగా న్యాయమూర్తికి కావాల్సిన ఆ నాలుగుమాటలూ అన్నందుకు అసాంజేమీద విమర్శలు రావచ్చు కూడా.
అమెరికా రక్షణ వ్యూహాలను, రహస్యాలను, యుద్ధనేరాలను, కుట్రలను, విదేశీప్రముఖుల రహస్య హత్యలను ప్రపంచానికి బహిరంగపరిచి, హీరోలాగా వెలుగుతున్నవాడు, ఎందరికో స్ఫూర్తినిచ్చినవాడు ఇలా అడ్డుతోవలో బయటకు రావడం చాలామంది మెచ్చకపోవచ్చు కూడా. కానీ, అన్ని హక్కులకూ, స్వేచ్ఛలకూ నిలయమని చెప్పుకొనే అమెరికా, దాని మిత్రదేశాలు అసాంజేను తీవ్రంగా వేధించాయి. చివరకు అత్యాచారం కేసులు పెట్టడానికి కూడా వెనుకాడలేదు. హిల్లరీ క్లింటన్ ఈమెయిల్స్ వ్యవహారాన్ని వికీలీక్స్ బయటపెట్టడంతో రాజకీయంగా ఆ వ్యవహారాన్ని వాడుకొని గెలిచిన డోనాల్డ్ ట్రంప్ తన పదవీకాలమంతా అసాంజే వెంటపడ్డారు.
భవిష్యత్తులో పాత్రికేయులు, ప్రజావేగులెవరూ ఇటువంటి సాహసాలకు పూనుకోకుండా భయోత్పాతంలో ముంచాలన్నది లక్ష్యం. ప్రభుత్వాలు దేశరహస్యాలని వేటిని అంటాయో, తమ అకృత్యాలను ప్రజలకు తెలియనివ్వకుండా ఎలా దాస్తాయో వికీలీక్స్ బయటపెట్టింది. అందుకు శిక్షగా పద్నాలుగేళ్ళు కోల్పోయిన అసాంజే ఇప్పుడు స్వేచ్ఛాజీవి అయినందుకు సంతోషించాలి.