Share News

బలూచ్‌ హెచ్చరిక!

ABN , Publish Date - Aug 29 , 2024 | 03:05 AM

పాకిస్థాన్‌లో వేర్పాటువాద సంస్థ బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌వో)కు చెందిన సాయుధులు ఇటీవల మరోమారు తమ ప్రతాపం చూపారు. బలూచిస్థాన్‌ ప్రావిన్సులోని పలుప్రాంతాల్లో...

బలూచ్‌ హెచ్చరిక!

పాకిస్థాన్‌లో వేర్పాటువాద సంస్థ బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌వో)కు చెందిన సాయుధులు ఇటీవల మరోమారు తమ ప్రతాపం చూపారు. బలూచిస్థాన్‌ ప్రావిన్సులోని పలుప్రాంతాల్లో పోలీసుస్టేషన్లు, రైల్వేస్టేషన్లు, వాహనాలపై వారు కాల్పులు జరిపారు. పంజాబ్‌నుంచి వస్తున్న ఓ బస్సును ఆపి పాతికమందిని కాల్చివేయడంతో ఆరంభమైన ఈ మారణకాండ కొన్ని గంటలపాటు నిరవధికంగా సాగింది. 2006లో పాకిస్థాన్‌ సైన్యం కాల్చిచంపిన బలూచిస్థాన్‌ నాయకుడు నవాబ్‌ అక్బర్‌ఖాన్‌ బుగ్టీ వర్థంతి సందర్భంగా ఆ వేర్పాటువాద సంస్థ ఈ హననానికి పాల్పడింది. ప్రత్యేక బలూచిస్థాన్‌ దేశం కోసం దశాబ్దాలుగా పోరాటం జరుగుతున్న ఈ ప్రాంతంలో వేర్పాటువాదులు అడపాదడపా హింసకు దిగడం అనాదిగా ఉన్నదే. అయితే, ఒకేమారు అనేక ప్రాంతాల్లో వేర్వేరు లక్ష్యాలపై ఇంతటి విస్తృతస్థాయిలో దాడులు జరగడం, మరణాలు అధికంగా ఉండటం గతంలో లేనిది.


లారీల దహనం, రోడ్లు రైల్వేలైన్ల పేల్చివేత, పోలీసులు, పంజాబ్‌ వలస కార్మికులు లక్ష్యంగా సాగిన ఈ హత్యకాండలో ఓ వందమంది మరణించారని అంచనా. పంజాబ్‌ ప్రావిన్సు సరిహద్దులకు చేరువగా వేర్పాటువాదులు ఈ ఘోరానికి పాల్పడటం పాక్‌ పాలకులకు ఓ హెచ్చరిక. బీఎల్‌వో తన సాయుధ, సాంకేతిక సామర్థ్యాన్ని బాగా బలోపేతం చేసుకున్నదని పాక్‌ విశ్లేషకుల అభిప్రాయం. దీనికితోడు, ఇంటలిజెన్స్ వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. బుగ్టీ వర్థంతి సందర్భంగా ఏటా బీఎల్‌వో దాడులు జరుపుతూ ఉంటుంది. ఇంతటిస్థాయిలో కాకున్నా, ఈ మారు కూడా ఆ సంస్థ విరుచుకుపడుతుందన్న స్పృహ ప్రభుత్వ విభాగాలకు ఉండాలి. వందలమంది పోలీసులు, సైనికబలగాలు ఉన్నప్పటికీ, ఈ వేర్పాటువాద సంస్థ ఎంతో సునాయాసంగా, సమన్వయంతో గంటలపాటు దాడులు కొనసాగించగలగడం పాలకుల వైఫల్యమే.

కొద్దివారాలుగా బలూచిస్థాన్‌లో భారీ ప్రదర్శనలు, ఉద్యమాలు ఉధృతంగా జరుగుతున్నాయి. వనరుల దోపిడీ, మానవహక్కుల ఉల్లంఘనలు, అపహరింతలు, ఊచకోతలు, మౌలికసదుపాయాల కొరత ఇత్యాది అంశాలపై ఓడరేవుపట్టణమైన గ్వదార్‌లో బీవైసీ సంస్థ సమావేశానికి పిలుపునిస్తే అక్కడకు చేరేలోగానే నిరసనకారులమీద సైన్యం కాల్పులు జరిపింది. బలూచ్‌ ప్రజల నినాదాలు చేసినా, నిరసనలు నిర్వహించినా పోలీసులు విరుచుకుపడతారు. అరెస్టుచేయడం, చిత్రహింసలు పెట్టిచంపివేయడం, మాయంచేయడం వంటి విధానాలతో వందలమంది బలూచ్ నాయకులు కనిపించకుండాపోయారు. తమకు తలనొప్పిగా ఉన్న బలూచిస్థాన్‌ వనరులను యథేచ్ఛగా దోచుకోవడానికి దానిని చైనాకు అప్పగించింది పాక్‌ ప్రభుత్వం. చైనా–పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (సీపెక్‌)లో భాగంగా అక్కడ భారీ తవ్వకాలు, ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. కానీ, వీటివల్ల స్థానికులకు వీసమెత్తు ప్రయోజనం లేకపోగా, స్థానికేతరుల ఆక్రమణలు అధికమైనాయి. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నవారిపై పోలీసు అణచివేత హెచ్చుతున్న కొద్దీ, ఉగ్రవాదసంస్థలు బలపడుతున్నాయి.


సైనికబలంతో, ఊచకోతలూ అణచివేతలతో బలూచ్‌ ప్రజలను నియంత్రించలేమని పాక్‌పాలకులకు అర్థంకావాలి. వారి స్వాతంత్ర్యకాంక్షకు చారిత్రక కారణాలున్నాయని, తాము చేసిన, చేస్తున్న ద్రోహాలు వారిని మరింత రెచ్చగొడుతున్నాయని గ్రహించాలి. బలూచ్‌ వేర్పాటువాద శక్తులకు ప్రజల అండదండలు దండిగా ఉండటానికి, యువతరం సాయుధులు కావడానికీ పాక్‌పాలకులు అనుసరిస్తున్న నిరంకుశ విధానాలు కారణం. అత్యంత అరుదైన, విలువైన ఖనిజ సంపద దండిగా ఉన్న ఈ ప్రాంతాన్ని దోచుకోవడమే తప్ప, ప్రజాశ్రేయస్సును పట్టించుకున్నది లేదు. దారిద్ర్యం, ఉపాధిలేమి, దుర్భర జీవితాలు స్థానికులను తిరుగుబాటువైపు నడిపిస్తున్నాయి. పాక్‌ పాలకులు బలూచిస్థాన్‌ను శత్రువుగా చూశారు, ఈ ప్రాంతం నాయకులు, గత ముఖ్యమంత్రుల సలహాలను పెడచెవినపెట్టారు, తమ నిలకడలేని విధానాలతో దానిని మరింత భ్రష్టుపట్టించారు. పాక్‌పాలకుల వైఖరిలో మార్పురావాలి. వేర్పాటువాదుల విధ్వంసానికి ప్రతిగా హింసకు పాల్పడటం, ఉగ్రవాదాన్ని నిర్మూలించేపేరిట ప్రజలను మరింత అణచివేయడమనే విషవలయం నుంచి బయటపడాలి. బలూచ్‌ ప్రజల వాదనలను, బాధలను వినాలి. వారి సంక్షేమం కోసం విశేషమైన కృషి జరగాలి.

Updated Date - Aug 29 , 2024 | 03:05 AM