Share News

ఎన్నికలకు ముందు...

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:48 AM

సాంకేతికంగా కాకపోయినా, 17వ లోక్‌సభ సభాకాలం ముగిసిపోయింది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించబోతున్నారు. ఫిబ్రవరి 10వ తారీకు శనివారం నాడు,,,

ఎన్నికలకు ముందు...

సాంకేతికంగా కాకపోయినా, 17వ లోక్‌సభ సభాకాలం ముగిసిపోయింది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించబోతున్నారు. ఫిబ్రవరి 10వ తారీకు శనివారం నాడు సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రసంగం ఒక అధ్యాయం ముగింపును సూచించింది. గత అయిదు సంవత్సరాల పాలనను సమీక్షించింది. అంతే కాదు, అనంతర అధ్యాయంలో కూడా తన పరిపాలనే కొనసాగుతుందన్న ధీమా కూడా ఆయన మాటల్లో వ్యక్తమైంది.

ఇదే ప్రభుత్వం మరింత బలంతో అధికారంలోకి రానున్నదన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించి ఉన్న సానుకూల వాతావరణంలో, ఎన్నికల ప్రకటన రానున్నది. పదిహేడో లోక్‌సభ కాలంలో తన ప్రభుత్వం సాధించిన కీలకవిజయాల కింద ఆర్టికల్ 370 రద్దు, మహిళా రిజర్వేషన్ల బిల్లు, త్రిపుల్ తలాఖ్ నిషేధం, కొత్త నేరచట్టాల రూపకల్పనలను ప్రధాని మోదీ ప్రముఖంగా పేర్కొన్నారు. దృఢ నిర్ణయాలు తీసుకోగలిగిన బలమైన ప్రభుత్వమే ఇవి సాధించగలదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో మరింత బలం తమకు సమకూరిస్తే, మరిన్ని సాహస నిర్ణయాలు తీసుకోగలనన్న సూచన కూడా ఆ మాటల వెనుక ఉన్నది.

సాధించిన విజయాల ప్రతిష్ఠ మీద మాత్రమే నరేంద్రమోదీ, ఆయన పార్టీ ఆధారపడదలచుకోలేదు. ఈ ఎన్నికల్లో శ్రీరాముడి అందడండలు తమకు పుష్కలంగా లభిస్తాయని, తాము ఆలయం నిర్మించినందుకు అవతారపురుషుడు తమకు ప్రతిఫలితం అందిస్తారని వారు గట్టి విశ్వాసంతో ఉన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ మొదటి రోజున నరేంద్రమోదీ లోక్‌సభలో ప్రవేశిస్తున్నప్పుడు ఆయన పార్టీ సభ్యులంతా ‘జై శ్రీరామ్’ అని ఉత్సాహంగా నినాదాలు ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమ మత, రాజకీయ, జాతీయతా నినాదాలన్నిటినీ ‘జై శ్రీరామ్’లోనే దర్శిస్తున్నట్టు అనిపించింది. లోక్‌సభ చివరి రోజున రాష్ట్రపతికి ధన్యవాదాల తీర్మానంతో పాటు, అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిగిన కార్యక్రమాన్ని శ్లాఘిస్తూ కూడా తీర్మానం ఆమోదం పొందింది. రామమందిర శ్లాఘ తీర్మానం చేయడం ద్వారా ‘‘భవిష్యత్ తరాలు తమ వారసత్వ విలువల గురించి గర్వపడడానికి రాజ్యాంగ బలాన్ని సమకూర్చినట్టయింద’’ని ప్రధాని అన్నారు. అంతే కాదు, రామమందిర నిర్మాణం ‘‘సరికొత్త తరహా ప్రజాపాలనకు, సంక్షేమానికి’ దారితీస్తుందని ఆయన అన్నారు. రామమందిర తీర్మానం మీద మాట్లాడడానికి ప్రతిపక్షాలు ముందుకు రాకపోవడాన్ని ప్రధాని విమర్శించారు. అందరికీ అన్నిపనులూ చేయగలిగే ధైర్యం ఉండదని అన్నారు. ఎన్నికలకు ముందు పార్లమెంటు చివరి రోజు సమావేశాలు చూస్తే, ఇంతకాలం ప్రత్యేకంగా ఉన్న అనేక రంగాలు, వ్యవస్థలు అన్నీ కలగలసిపోయినట్టు అనిపించింది.

ఈ దేశానికి ఒకే రాజ్యాంగం ఉండాలన్న సుదీర్ఘకాలపు ఆకాంక్ష, ఆర్టికల్ 370 రద్దుతో నెరవేరిందని, ఈ చర్యతో జమ్మూకశ్మీర్ ప్రజలకు న్యాయం దొరికినట్టయిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. శతాబ్దాలుగా నిరీక్షించిన పనులన్నీ ఈ సభాకాలంలో పూర్తయ్యాయని ఆయన సంతృప్తి ప్రకటించారు. ప్రజల దైనందిన జీవితాల నుంచి ప్రభుత్వం ఎంత తొందరగా నిష్క్రమిస్తే, అంతగా ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్టు అని మోదీ ఈ సందర్భంగా ఒక వ్యాఖ్య చేశారు. మరి, ప్రజల వ్యక్తిగత జీవితాల్లో భాగమైన మతంలోకి ఈ ప్రభుత్వం ఎందుకింత గాఢంగా ప్రవేశిస్తోందో మాత్రం అర్థం కాదు.

ఈ విజయాలు, ప్రధానంగా ఉద్వేగ పూరిత విజయాలు, భారతీయ జనతాపార్టీకి అనుకున్నంత ఘనవిజయాన్ని అందిస్తాయా, వారు కోరుకుంటున్న 400 స్థానాల గమ్యాన్ని చేరుకుంటారా అన్నది చూడవలసి ఉన్నది. ఉద్వేగ పూరిత అంశాలకు, వాస్తవ భౌతిక సమస్యలకు మధ్య స్పర్థ ఏర్పడితే ప్రజల స్పందన ఎట్లా ఉంటుందో కూడా చూడాలి. కనీసమద్దతు ధర కోసం రైతాంగం దేశరాజధానిలో మళ్లీ మోహరించబోతున్నది, అందుకు తగ్గట్టుగా నిర్బంధచర్యలు కూడా కేంద్రం తీసుకుంటున్నది. ఒక్కొక్కరు జారుకోవడం, పొత్తులు కాక కత్తులు దూసుకోవడం, మహాబలశాలి బీజేపీని ఎదుర్కొనలేని నిస్సహాయతలో కూరుకుపోవడం, వీటి మధ్య ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత బలహీనంగా కనపడుతున్నది కానీ, దైనందిన సమస్యల మీద పోరాటాలు నిర్మించగలిగితే బాధిత ప్రజానీకం అందుకు సిద్ధంగానే ఉన్నారు. ఎక్కడ ప్రజలు ఉద్వేగాలకు అతీతంగా ఆలోచిస్తారో అన్న భయంతో, మతతత్వ శక్తులు దేశంలో అక్కడక్కడా హింసను సృష్టించి, విభజన వాతావరణాన్ని సజీవంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాయి.

అపార బలం ఉన్న ప్రభుత్వానికి ఏదైనా చేయగలిగిన సాహసం కూడా ఉంటుంది. ఆ ధైర్యసాహసాలతో అవినీతిని, నల్లధనాన్ని, అర్థిక అంతరాలను, సామాజిక హెచ్చుతగ్గులను కూలదోయడానికి ప్రయత్నించవచ్చు కదా అనిపిస్తుంది. కానీ, విపరీతమైన బలం కలిగిన ప్రభుత్వాలు తమ ప్రతాపాలను ఎప్పుడూ ప్రజల మీదనే చూపిస్తాయని చరిత్ర చెబుతోంది.

Updated Date - Feb 13 , 2024 | 12:48 AM