Share News

చైనాతో జాగ్రత్త!

ABN , Publish Date - Apr 10 , 2024 | 02:20 AM

అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటనలో కేంద్రరక్షణమంత్రి రాజనాథ్‌సింగ్‌ మంగళవారం చైనాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యధికులకు అంతగా ఆనలేదు. ఇటీవల ఆరుణాచల్‌లోని ముప్పైప్రాంతాలకు చైనా తన పేర్లు పెట్టుకున్న...

చైనాతో జాగ్రత్త!

అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటనలో కేంద్రరక్షణమంత్రి రాజనాథ్‌సింగ్‌ మంగళవారం చైనాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యధికులకు అంతగా ఆనలేదు. ఇటీవల ఆరుణాచల్‌లోని ముప్పైప్రాంతాలకు చైనా తన పేర్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. 11నివాసప్రాంతాలు, ౧2పర్వతాలు, నాలుగు నదులు, ఒక మార్గం, కొంత భూభాగానికి చైనా క్యాబినెట్‌ నిర్ణయం మేరకు నామకరణం జరిగిందని, మే 1వతేదీనుంచి కొత్తపేర్లు అమల్లోకి వస్తాయని గ్లోబల్‌ టైమ్స్‌ పదిరోజుల క్రితం ప్రకటించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజ్‌నాథ్‌ సింగ్‌ దీనిమీద స్పందించారు. ‘ఇటీవల చైనా మన భూభాగంలోని కొన్ని ప్రాంతాలకు తన పేర్లు పెట్టుకుంది. ఒకవేళ మనం కూడా ఆ దేశంలోని ప్రాంతాలకు మన పేర్లు పెడితే, కేవలం పేరుమార్పిడితే ఆ ప్రాంతాలు మనవైపోతాయా? అని ఆయన ప్రశ్నించారు. బహిరంగసభ కాబట్టి ఆయన జాగ్రత్తగా మాట్లాడి ఉండవచ్చును కానీ, పాకిస్థాన్‌ విషయంలో ఇటీవల ఎంతో ఘాటుగా, తీవ్రంగా మాట్లాడిన ఆయన చైనావరకూ వచ్చేసరికి మరీ మెత్తగా స్పందించినట్టు చాలామందికి అనిపించింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌ తనదని ఎప్పటినుంచో అంటున్న చైనా, దానిని జాంగ్‌నన్‌ అని పిలుచుకుంటూ, భారత్‌ మీద అలిగినప్పుడో, ఆగ్రహం కలిగినప్పుడో అక్కడి కొండలూ కోనలకు తన భాషలో పేర్లు ప్రకటిస్తూండటం తెలిసిన విషయమే. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలోనే ఈ నామకరణోత్సవాన్ని ఆరంభించి, ఇప్పటికి నాలుగుసార్లు ఆ పని చేసింది. చైనా ఇలా కొత్తగా పేర్లుపెడుతున్నప్పుడల్లా, పేర్లుమార్చినంత మాత్రాన నిజాలు మారిపోవని భారతదేశం అంటూ వస్తున్నది. మనలను ఎవరైనా అవమానించినా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా సహించేది లేదన్న రాజ్‌నాథ్‌ వ్యాఖ్య బాగున్నది కానీ, నిజానికి చైనా చర్యలు ఎప్పటినుంచో అదేరీతిలో ఉంటున్నాయి. 2014వరకూ ఒక్కబుల్లెట్‌ కూడా పేలని ఉభయదేశాల సరిహద్దులు అనంతరకాలంలో నిత్య ఉద్రిక్త ప్రాంతాలుగా మారిపోవడం తెలిసిందే. చొరబాట్లు, దురాక్రమణలు, దాడులతో అది మనని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అరుణాచల్‌లో మన నాయకులు కాలూనగానే చైనా ఖండిస్తుంది, కొన్ని ప్రాంతాలకు కొత్తగా పేర్లుపెడుతుంది. ఇందుకు ప్రతిగా అరుణాచల్‌ ఎప్పటికీ భారత్‌ అంతర్భాగమేనని మన నాయకులు ప్రకటిస్తారు, ట్వీట్లు చేస్తారు. తన అసమర్థతతో కాంగ్రెస్‌ దేశభద్రతకు ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టిందో, మోదీ ప్రభుత్వం ఆ తప్పుల్ని చక్కదిద్ది దేశాన్ని ఎంత భద్రంగా ఉంచుతోందో ఎన్నికల సభల్లో పాలకులు చెప్పుకొస్తుంటారు.

కానీ, చైనా పేర్లమార్పు వెనుక అంతర్జాతీయస్థాయి ఎత్తుగడలు, న్యాయపరమైన వ్యూహాలున్నాయని కొందరి వాదన. దీనికి తోడు ఇప్పుడు చైనా అరుణాచల్‌ప్రదేశ్‌కు ఎదురుగా, వాస్తవాధీనరేఖ (ఎల్‌ఏసీ) వెంట తనవైపున 175గ్రామాలను నిర్మిస్తోందట. ఇప్పటికే ఎల్‌ఏసీగుండా చైనా నిర్మించిన ఆరువందల గ్రామాలకు ఇవి అదనం. అరుణాచల్‌ నుంచి లద్దాఖ్‌వరకూ చైనా గ్రామాలకుగ్రామాలు కడుతూపోతున్నందున రాబోయే రోజుల్లో సరిహద్దులు మరింత ప్రమాదకరం కాకతప్పదు. సరిగ్గా నిర్వచించని, సరిహద్దులుగా భావిస్తున్న ప్రాంతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి చైనాకు ఈ చర్య ఉపకరిస్తుంది. సరిహద్దుల్లో కడుతున్న ఈ గ్రామాలన్నీ ఇకపై గస్తీకి, ఒకవేళ ఘర్షణతలెత్తితే సైనికస్థావరాలుగా ఉపయోగపడతాయి. భవిష్యత్తులో ఎల్‌ఏసీని కచ్చితంగా నిర్ణయించే సందర్భంలో ఈ గ్రామాల ఉనికి చైనాకు తోడ్పడుతుంది. వాస్తవాధీనరేఖకు అత్యంత సమీపంలో రహదారులు, రైల్వేలైన్లు ఇత్యాది మౌలిక సదుపాయాల విస్తరణతో చైనా మనకు చెక్‌పెడుతున్నది. లద్దాఖ్‌కు అతిసమీపంలో, సరిహద్దులకు ఆవల హోతాన్‌ ఎయిర్‌బేస్‌లో ఇటీవల రెండవ రన్‌వే కూడా సిద్ధమైంది. చైనా మన భూభాగాల్లోకి చొరబడుతూ క్రమపద్ధతిలో గస్తీలేని ప్రాంతాలను సృష్టిస్తున్నదని, అలా ఇప్పటికే చాలా భూభాగాన్ని తన వశం చేసుకున్నదని విపక్షాలు అరోపిస్తున్నాయి. మోదీ అధికారంలో ఉన్నంతకాలం ఒక్క అంగుళం కూడా ఎక్కడికీ పోదని బీజేపీ నాయకులు మరోపక్క హామీ ఇస్తున్నారు. సరిహద్దులు, దురాక్రమణలకు సంబంధించిన వాస్తవాలను ఇప్పటికైనా ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉన్నది.

Updated Date - Apr 10 , 2024 | 02:20 AM