Share News

భూటాన్‌ బంధం!

ABN , Publish Date - Mar 26 , 2024 | 01:56 AM

భూటాన్‌లో భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన భారతప్రధాని నరేంద్రమోదీ పర్యటన, వాతావరణం కాస్తంత మెరుగుపడటంతో మరుసటిరోజునే జరిగిపోయింది. స్వదేశంలో సార్వత్రక ఎన్నికల ఒత్తిడి...

భూటాన్‌ బంధం!

భూటాన్‌లో భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన భారతప్రధాని నరేంద్రమోదీ పర్యటన, వాతావరణం కాస్తంత మెరుగుపడటంతో మరుసటిరోజునే జరిగిపోయింది. స్వదేశంలో సార్వత్రక ఎన్నికల ఒత్తిడి వంటివి పక్కనబెట్టి రెండురోజులపాటు ప్రధాని ఈ పర్యటన జరపడం భూటాన్‌కు భారతదేశం ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం. ఇచ్చిన మాట ప్రకారం వచ్చినందుకు భూటాన్‌ ప్రధాని దాషో షెరింగ్‌ తోబ్గే దీనిని ‘మోదీకి గ్యారంటీ’గా అభివర్ణించారు. బీజేపీ ఎన్నికల నినాదం భూటాన్‌ ప్రధాని నోటి నుంచి రావడం అటుంచితే, తోబ్గే భారత్‌ అనుకూలుడని అంటారు. భూటాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారత ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. జనవరిలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తోబ్గే తన తొలివిదేశీపర్యటన భారతదేశంలోనే జరిపారు. ఆయన తిరిగివెళ్ళిన నాలుగురోజుల్లోనే మోదీ ఆ సుహృద్భావానికి కొనసాగింపుగా తాను ఆ దేశంలో కాలూనారు. నరేంద్రమోదీని భూటాన్‌ పాలకులు ఘనంగా స్వాగతించారు, గౌరవించారు, 2021లో ప్రకటించిన భూటాన్‌ అత్యున్నత పౌరపురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు.

స్వదేశంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా ప్రధాని ఈ పర్యటనకు సంకల్పించడం విశేషం. ఆర్థికంగా బలోపేతమవుతున్న భారతదేశం నుంచి భూటాన్‌ మరింత ఆర్థిక సహకారాన్ని ఆశించడం సహజం కనుక, భూటాన్‌ పంచవర్ష ప్రణాళికకు భారత్‌ ఆర్థిక సహకారాన్ని రెట్టింపు చేయడానికి నిర్ణయించడం సరైన చర్య. భూటాన్‌ అభివృద్ధికి భారతదేశం కట్టుబడి ఉన్నదని ప్రధాని తన పర్యటనలో హామీ ఇచ్చారు. అక్కడి యువతలో నైపుణ్యాల మెరుగుపరచే శిక్షణాకార్యక్రమాన్ని భారతదేశం పూర్తిగా తన ఖర్చుతో నిర్వహిస్తున్నది. థింపూలో భారతదేశం నిర్మించిన ఆస్పత్రి ఆరంభమూ జరిగింది. అసోంను ఆనుకొని ఉన్న భూటాన్‌ ప్రాంతాల్లో గెల్పూ మైండ్‌ఫుల్‌నెస్‌ సిటీ ప్రాజెక్టు ఆ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. భూటాన్‌ కొత్త ప్రధాని భారతదేశంలో పర్యటించడం, ఇప్పుడు నరేంద్రమోదీ ఆ దేశంలో కాలూని అనేక ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఉభయదేశాల మధ్యా సాన్నిహిత్యం పెరుగుతుంది, ఆర్థిక, వాణిజ్యబంధం హెచ్చుతుంది.

ఇటీవలికాలంలో చైనాకు భూటాన్‌ మరింత దగ్గరవుతున్న విషయం తెలిసిందే. భారతదేశానికి సాంస్కృతికంగానూ, సహజసిద్ధంగానూ ఉపఖండంలోని దేశాలతో ఉన్న సంబంధాలను చైనా తన ఆర్థికబలంతో ప్రభావితం చేస్తున్నది. వేగంగా ఎదిగి భారతదేశంకంటే ఆర్థికంగా నాలుగురెట్లు శక్తిమంతంగా తయారైన కారణంగా డబ్బు వెదజల్లి చాలా దేశాలను అది తనవైపునకు తిప్పుకోగలుగుతోంది. శ్రీలంక, నేపాల్‌, మాల్దీవులు, బంగ్లాదేశ్‌ ఇలా ప్రతీదేశానికీ అది అప్పులు ఇస్తోంది, ప్రాజెక్టులు కడుతోంది. భూటాన్‌ కూడా ఈ ప్రభావానికి అతీతంగా ఏమీ లేదు. చైనా–భూటాన్‌ సరిహద్దు చర్చలు ఆ సాన్నిహిత్యానికి ఓ ఉదాహరణ. సరిహద్దు ప్రాంతాల్లోని భూములను ఉభయదేశాలు పరస్పరం బదలాయించుకొనేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ముందుకు కదిలిన పక్షంలో భారతదేశం రక్షణపరంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సివస్తుంది. సిలిగురి కారిడార్‌ను, అరుణాచల్‌ప్రదేశ్‌లో సరిహద్దు ప్రాజెక్టులను ఇది ఇబ్బందుల్లో పడవేస్తుంది. చైనాతో తన చర్చలు ఒక కొలిక్కివచ్చేవరకూ కొన్ని ప్రాజెక్టుల విషయంలో కాస్తంత నెమ్మదిగా పోవాలంటూ భూటాన్‌ ఇటీవల భారతదేశానికి ఓ సందేశం పంపిందని కూడా వార్తలు వచ్చాయి.

చైనా తన ఆర్థికబలంతో భూటాన్‌ను తనవైపు తిప్పుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. దౌత్యసంబంధాలు అధికారికంగా లేనప్పటికీ భూటాన్‌ను చైనా ప్రభావితం చేయగలుగుతున్నది, సరిహద్దు ఒప్పందాల పేరిట కీలకమైన ప్రాంతాలను తన గుప్పిట్లోకి తెచ్చుకొని భారతదేశాన్ని ఆత్మరక్షణలో పడవేసేందుకు ప్రయత్నిస్తున్నది.

ఈ నేపథ్యంలో భారత ప్రధాని పర్యటనకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఉభయదేశాల బంధాన్ని ఆయన బద్దలు కొట్టలేనిదిగా అభివర్ణించారు. రెండుదేశాల భద్రత పరస్పర సహకారం మీద ఆధారపడి ఉన్నదని ఆయన గుర్తుచేశారు. ‘భారత్‌ కోసం భూటాన్‌, భూటాన్‌ కోసం భారత్‌ అన్నది ఏ మాత్రం తారుమారుచేయలేని ఈ ప్రాంతపు వాస్తవికత’ అని సంయుక్త ప్రకటన వ్యాఖ్యానించడం సంతోషించదగ్గ విషయం.

Updated Date - Mar 26 , 2024 | 01:56 AM