Share News

బాంబు భయాలు

ABN , Publish Date - Oct 24 , 2024 | 02:25 AM

భారతీయ విమానాలకు ఒక్కసారిగా పెరిగిన బాంబు బెదిరింపు కాల్స్‌ మన వ్యవస్థలకు పెను సవాల్‌ విసురుతున్నాయి, మన సామర్థ్యానికి అగ్నిపరీక్ష పెడుతున్నాయి. వందకుపైగా బెదిరింపు కాల్స్‌తో పౌర విమానయానరంగం...

బాంబు భయాలు

భారతీయ విమానాలకు ఒక్కసారిగా పెరిగిన బాంబు బెదిరింపు కాల్స్‌ మన వ్యవస్థలకు పెను సవాల్‌ విసురుతున్నాయి, మన సామర్థ్యానికి అగ్నిపరీక్ష పెడుతున్నాయి. వందకుపైగా బెదిరింపు కాల్స్‌తో పౌర విమానయానరంగం అప్పటికే వొణికిపోతుండగా, ఒక్క మంగళవారం నాడే మరో యాభై బెదిరింపులు కాల్స్‌ రావడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. బాంబు బెదిరింపు కాల్స్‌ చేసినవారిని వదిలేది లేదని, జీవితఖైదు విధించేట్టుగా చట్టాలు చేస్తామని, వారిని జీవితంలో విమానం ఎక్కబోనివ్వమని పౌర విమానయానమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు గట్టిగా బెదిరించినా ఈ ఉధృతి తగ్గలేదు. వారం రోజుల్లో మొత్తం 169 విమానాలకు బెదిరింపులు రావడమే కాక, దేశీయ సర్వీసులతో పాటు అంతర్జాతీయ నగరాలకు వెళ్ళే విమానాలకు కూడా అవి విస్తరించడం పెను సంక్షోభాన్ని సృష్టిస్తున్నది. ఒకపక్కన ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతున్నా, మెయిల్‌ ద్వారా హెచ్చరికలు వస్తున్నాయంటే, ఈ దుష్టచేష్టలకు పాల్పడేవారు బాగా తెగించారని అర్థం. ఒక పద్ధతి ప్రకారం సదరు శక్తులు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నప్పటికీ, తేలికగా తీసుకొనే పరిస్థితి లేదు. చివరకు ఈ మెయిల్‌, సోషల్‌ మీడియా పోస్టుల్లో వచ్చే హెచ్చరికలకు విలువేమిటని కూడా ఊరుకోగలిగే అవకాశం లేదు. ఫలానా విమానంలో బాంబు ఉన్నదనో, దానికి ముప్పు ఉన్నదనో ఒక సమాచారం ఏ రూపంలో, ఎక్కడనుంచి అందినా దానిని నిశితంగా పరిశీలించాల్సిందే, విమానాన్ని క్షుణ్ణంగా గాలించి ఏ ప్రమాదమూ లేదని నిర్ధారించుకున్నాక ఎగరనివ్వాల్సిందే. ఈ కారణంగానే ఎగురుతున్న విమానాలను అర్ధంతరంగా దింపాల్సివచ్చింది, ఎగరాల్సినవాటిని గంటలపాటు నిలిపివేయాల్సివచ్చింది. ఒక కాల్‌ లేదా ఒక హెచ్చరిక సందేశంతో దేశంలోని దాదాపు ప్రతీ ఎయిర్‌లైన్స్‌నీ దుండగులు భయపెట్టారు, బెదిరించారు. సదరు సంస్థల వ్యవస్థలన్నీ తీవ్రంగా భయపడ్డాయి, హడావుడి పడ్డాయి, ఆర్థికంగానే కాదు, పలురకాలుగా ఇబ్బందిపడుతున్నాయి. చేపట్టవలసిన చర్యలన్నీ పూర్తయితే కానీ విమానం కదిలేందుకు అవకాశం లేదు. ఈ బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తుల లేదా సంస్థల లక్ష్యం ఏమిటన్నది అటుంచితే, ఇంతటి దుర్మార్గానికి పాల్పడుతున్నవారిని జైల్లో పెడతామనో, రాబోయే రోజుల్లో విమానం ఎక్కబోనివ్వమనో హెచ్చరించినంత మాత్రాన ఫలితం ఉండబోదని ఇప్పటికే తేలిపోయింది.


ప్రభుత్వ విభాగాలు అనేకం రంగంలోకి దిగాయి, దోషులను గుర్తించేందుకు యథాశక్తి ప్రయత్నిస్తున్నాయి. బెదిరింపు సందేశాలు పుట్టింది ఎక్కడో, ద్రోహులెవ్వరో కనిపెట్టడం వేరు, వారిని ఎక్కడనుంచో ఇక్కడకు పట్టుకురావడం వేరు. ఒప్పందాలు, అవగాహనలు లేని దేశాలతో, సంయుక్త విచారణకు సహకరించనివారితో వ్యవహరించడం మరీ కష్టం. అయితే, ఒక్కసారిగా ఉధృతమైన ఈ బెదిరింపు సందేశాల వెనుక ఉన్నది ఎవరో అల్లరిచిల్లర వ్యక్తులు కారని మాత్రం రూఢీగా చెప్పవచ్చు. వారు తమ లొకేషన్‌ కనిపెట్టలేని రీతిలో, ఎవరికీ చిక్కని అత్యాధునిక సాంకేతిక విధానాల్లో ఈ పాడుపనిచేస్తున్నందున మనదేశానికి హానిచేయాలన్న వారి కసి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్‌ సింగ్‌ పన్నూ ఎయిరిండియా విమానాలు లక్ష్యంగా చేసిన ప్రకటన, ఖలిస్తానీ శక్తులను వెనకేసుకొస్తున్నందుకు కెనడాతో పతాకస్థాయికి చేరిన వైరం ప్రస్తుత పరిణామాల నేపథ్యంగా చాలామందికి కనిపిస్తున్నది. ఒక్కో బెదిరింపు కాల్‌తో సదరు విమానయాన సంస్థకు మూడునుంచి నాలుగుకోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నదని అంచనా. ఇక, ప్రయాణీకులు అనుభవించిన ప్రాణభయం, మానసిక వేదన, ఇతరత్రా కష్టనష్టాలు వెలకట్టలేనివి.


ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నవారిని పట్టుకోవడం, శిక్షించడం ఎప్పటికైనా జరిగితీరాలి. ఎంతకాలం పట్టినా, ఎంత ఖర్చయినా సరే, ఆ ద్రోహులను వదిలిపెట్టకూడదు. భవిష్యత్తులో ఈ తరహా బెదిరింపుకాల్స్‌తో మనను ఎవరూ భయపెట్టలేని రీతిలో నిర్దిష్టమైన వ్యవస్థలను రూపొందించుకోవాలి. విమానాలను మరింత క్షుణ్ణంగా పరిశీలించి, భద్రంగా మార్చడం, ప్రయాణీకులను, వారి సామగ్రిని మరింత శ్రద్ధగా పరీక్షించడం, ఆయా వ్యవస్థలనూ, విధానాలను లోపరహితంగా తీర్చిదిద్దుకోవడం వంటివి చేయగలిగినప్పుడు, ఒక ఉత్తుత్తి బెదిరింపునకు వెంటనే ఉలిక్కిపడి విమానాన్ని నేలమీదకు దించేయాల్సిన అవసరం ఉండదు.

Updated Date - Oct 24 , 2024 | 02:26 AM