బుల్డోజర్‌కు బ్రేక్
ABN , Publish Date - Nov 15 , 2024 | 02:03 AM
సామాన్యుడి సొంతింటి కలమీద హిందీకవి ప్రదీప్ రాసిన ఓ కవితను ఉటంకిస్తూ, బుల్డోజర్ కూల్చివేతలను ఇకపై సహించేది లేదంటూ సుప్రీంకోర్టు బుధవారం ప్రశంసనీయమైన తీర్పు వెలువరించింది. అధికారులే...
సామాన్యుడి సొంతింటి కలమీద హిందీకవి ప్రదీప్ రాసిన ఓ కవితను ఉటంకిస్తూ, బుల్డోజర్ కూల్చివేతలను ఇకపై సహించేది లేదంటూ సుప్రీంకోర్టు బుధవారం ప్రశంసనీయమైన తీర్పు వెలువరించింది. అధికారులే న్యాయమూర్తుల్లా వ్యవహరిస్తూ, తక్షణతీర్పులతో ఇళ్ళకూల్చివేత శిక్షను అమలు చేస్తే ఊరుకొనేది లేదని సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది. ఏదో ఒక నేరంలో నిందితుడో, దోషో అయినంతమాత్రాన నోటీసులు ఇవ్వకుండా, నిబంధనలు పాటించకుండా నేరుగా బుల్డోజర్లతో పోయి వారి నివాసాలను నేలమట్టం చేయడం అన్యాయం, అంతకుమించి రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆస్తుల కూల్చివేతకు సంబంధించి దేశవ్యాప్తంగా అమలయ్యే మార్గదర్శకాలను కూడా విడుదలచేసి, వాటిని అతిక్రమించినా, గీతదాటి దూకుడుగా వ్యవహరించినా సదరు అధికారులను వదిలిపెట్టేది లేదని, ధిక్కరణ చర్యలు తీసుకుంటామని కోర్టు స్పష్టంచేసింది. కూల్చివేతల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు తేలితే, బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని అధికారులనుంచి ముక్కుపిండి వసూలు చేస్తానన్న హెచ్చరిక అత్యంత ప్రభావవంతంగా ఉంది. ఒక వ్యక్తి నిందితుడైతే అతడి నివాసాన్ని కూల్చివేయడం ద్వారా మొత్తం కుటుంబాన్ని శిక్షించడం, రోడ్డుపాల్జేయడం సరికాదన్నది మంచిమాట. 95 పేజీల తీర్పులో న్యాయమూర్తులు పలుచోట్ల బాధ, ఆగ్రహం వ్యక్తంచేస్తూ నిర్దిష్టమైన మార్గదర్శకాలతో భవిష్యత్తులో బుల్డోజర్ జస్టిస్‌ను నిలువరించేందుకు యథాశక్తి ప్రయత్నం చేశారు.
ఈ తీర్పుతో సర్వోన్నతన్యాయస్థానం బుల్డోజర్‌ను గ్యారేజీలోకి నెట్టేసిందని అఖిలేష్‌యాదవ్ వ్యాఖ్యానించారు. ఆ మహాయంత్రాన్ని కూల్చివేతలకు వినియోగించి, ఈ తీరున తక్షణశిక్షలు వేయడం యూపీ యోగి కనుగొన్న ప్రక్రియ కనుక విపక్షనేతలంతా ఆయన దృష్టితోనే వ్యాఖ్యలు చేశారు. బుల్డోజర్ బాబాగా ప్రసిద్ధిచెందిన యోగి చేతికి ఏకంగా సంకెళ్ళుపడినంతగా సంతోషించారు. యూపీ ప్రభుత్వానికి ఈ తీర్పు ఎలా అర్థమైందో తెలియదుగానీ, దానిని చక్కగా స్వాగతిస్తూ తనకు అనుకూలంగా భాష్యం చెప్పుకుంది. షోకాజ్ నోటీసులు, అప్పీళ్ళు, గడువులు, బాధితుల వాదనలను వినడం, మినిట్స్ రికార్డుచేయడం, యజమానికే అక్రమకట్టడాన్ని కూల్చివేసే అవకాశం ఇవ్వడం.. ఇలా పలురకాల మార్గదర్శకాలతో అధికారుల ముందరికాళ్ళకు సర్వోన్నతన్యాయస్థానం బలమైన బంధనాలు వేసింది. పాలకుల పక్షాన వారు కట్టుదాటి ప్రవర్తించకుండా లక్ష్మణరేఖలు గీసింది. కానీ, ఇప్పటికే నష్టపోయిన వందలాదిమందికి మాత్రం ఈ తీర్పు న్యాయం చేయలేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి అత్యధికంగా దుర్వినియోగపరచిన ఈ విధానాన్ని ఆ తరువాత బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ అమలు చేసిన విషయం తెలిసిందే. ప్రధానంగా మతహింసలు రేగినప్పుడు నివాసాల కూల్చివేతతో ముఖ్యంగా ముస్లింలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. హర్యానాలోని నుహ్, మధ్యప్రదేశ్‌లో ఖర్గోన్ వంటి చోట్ల మైనారిటీలను హెచ్చరించడానికి, అదుపులో ఉంచడానికి బుల్డోజర్ ఆయుధమైంది. ముస్లింలను ఆ రీతిలో శిక్షించడాన్ని బీజేపీ నాయకులు బాహాటంగా సమర్థించేవారు. నేరస్థులని నిర్థారించేందుకు విడియోలు సరిపోతాయని, న్యాయస్థానాల అవసరం లేదని వ్యాఖ్యానించేవారు.
నిందితులను గుర్తించడం నుంచి నేరం రుజువుచేయడంవరకూ ఉన్న సుదీర్ఘ ప్రక్రియలన్నీ పక్కకు నెట్టివేసి, ఇలా కొంపలు కూల్చడం ద్వారా తక్షణశిక్షలు వేయడాన్ని ప్రజలు కూడా మెచ్చడం, బుల్డోజర్లను బ్యాండ్‌బాజాతో ఘనంగా స్వాగతించడం చూశాం. ఏ నేరానికి ఈ శిక్షవేస్తున్నదీ రాజకీయనాయకులు బాహాటంగా చెబుతుంటే, అధికారులు మాత్రం అక్రమ నిర్మాణమనో, అనుమతులు లేవనో, ఆక్రమణదారులనో చెప్పి సదరు అనుమనితుల లేదా నిందితుల ఇంటినో, దుకాణాన్నో నేలమట్టం చేస్తూపోయేవారు. ఆ నేరానికీ, ఈ శిక్షకూ సంబంధం లేదని న్యాయస్థానాల్లోనూ వాదనలు సాగేవి. కానీ, అసలు నిజం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు వెలువడిన తీర్పు పాలకుల, అధికారుల దూకుడును బాగా నియంత్రిస్తుందని ఆశించాలి. ఒక వర్గాన్ని నియంత్రించేందుకు కూల్చివేతలను ఆయుధంగా వాడేవిషయంలో పాలకుల ఆదేశాలను అధికారులు గుడ్డిగా అమలుచేయకపోవచ్చు. తీర్పు వర్తించని ప్రాంతాలంటూ న్యాయస్థానం ఇచ్చిన మినహాయింపులను పాలకులు దుర్వినియోగం చేయకుండా చూడటం ముఖ్యం. మార్గదర్శకాలు నూరుశాతం అమలయ్యేట్టుగా జిల్లాకోర్టు నుంచి హైకోర్టు వరకూ శ్రద్ధపెట్టాలి.