Share News

లీపెన్‌కు బ్రేక్

ABN , Publish Date - Jul 09 , 2024 | 03:03 AM

కెరటం లేచిన తీరు చూస్తే ఉప్పైనై ముంచెత్తుతుందనిపించింది కానీ, తీరం తాకకముందే విరిగిపోయింది. దీన్నే ఫ్రెంచి జీవనసరళిలోకి అనువదించి చెబితే, షాంపేన్ బిరడా ఉవ్వెత్తున ఎగిరింది కానీ...

లీపెన్‌కు బ్రేక్

కెరటం లేచిన తీరు చూస్తే ఉప్పైనై ముంచెత్తుతుందనిపించింది కానీ, తీరం తాకకముందే విరిగిపోయింది. దీన్నే ఫ్రెంచి జీవనసరళిలోకి అనువదించి చెబితే, షాంపేన్ బిరడా ఉవ్వెత్తున ఎగిరింది కానీ, నురగ మాత్రం పొంగలేదు. ఫ్రెంచి తీవ్రమితవాద పార్టీ నేషనల్ ర్యాలీ (ఆర్ఎన్) పరిస్థితి అట్లాగే ఉంది. మరైన్ లీపెన్ నాయకత్వంలోని ఆ పార్టీ ఫ్రాన్స్ సాధారణ ఎన్నికలలో ప్రభంజనం సృష్టిస్తుందని అంతా అంచనా వేశారు. కానీ, ఫలితాలలో మూడోస్థానం దగ్గరే ఆగిపోయింది. ఫ్రెంచి చరిత్రకు, సంస్కృతికి భిన్నమైన ఫాసిస్టు పోకడలు కలిగిన పార్టీ అధికారంలోకి రాకుండా నిలువరించామని, తీవ్రవాద వామపక్ష కూటమి, ఇంతదాకా అధికారంలో ఉన్న మధ్యేవాద కూటమి సంతోషిస్తున్నాయి. తమది వాయిదాపడిన విజయమే తప్ప, ఇది ఓటమి కాదు అంటూ లీపెన్ నిబ్బరంగా ఉన్నారు.

నెలరోజుల కిందట యూరోపియన్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికలలో ఫ్రాన్స్ నుంచి లీపెన్ పార్టీ 31 శాతం ఓట్లతో ఘనవిజయం సాధించింది. ఫ్రెంచి అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ నాయకత్వం వహిస్తున్న కూటమికి 15 శాతం కంటె తక్కువ ఓట్లు వచ్చాయి. మరింత ప్రమాదం రాకముందే జాగ్రత్తపడదామనుకున్నారో, మరే కారణమో కానీ, గత జూన్ 9 నాడు మేక్రాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు ప్రకటించారు. జూన్ 30 నాడు మొదటి రౌండు 76 స్థానాలకు పోలింగ్ జరగగా, జూలై 7 ఆదివారం నాడు రెండో రౌండులో 501 స్థానాలకు పోలింగ్ జరిగింది. మొదటి దశ పోలింగ్ తీరు నేషనల్ ర్యాలీ పార్టీకి అనుకూలంగా జరిగినట్టు, 33 శాతం కంటె అధికంగా ఓట్లు ఆ పార్టీ పొందినట్టు తెలియగానే, దేశంలోని మధ్యేవాదులు, వామపక్షీయులు కలవరం చెందారు.


రెండో దశ ఓటింగ్ కూడా అదే తీరుగా ఉంటే, దేశం తీవ్ర మితవాదుల చేతిలోకి పోవడం ఖాయమని భయపడ్డారు. అందుకని, మధ్యేవాద, వామపక్షీయుల మధ్య అవగాహన కుదిరిందని, ముక్కోణ పోటీని ద్విముఖ పోటీగా మార్చడానికి దాదాపు 200 మంది అభ్యర్థులు విరమించుకోవడం దాన్ని సూచిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. రెండో దశలో గాలిమార్పు కారణంగా, అంతిమ ఫలితాలు భిన్నంగా వచ్చాయి. వామపక్ష కూటమికి 182 స్థానాలు, మేక్రాన్ నాయకత్వంలోని మధ్యేవాద కూటమికి 163 సీట్లు, లీపెన్ పార్టీకి 143 స్థానాలు లభించాయి. ఏ ఒక్క పార్టీకి, కూటమికి మెజారిటీ రాలేదు. మేక్రాన్ కూటమి, వామపక్ష కూటమితో మొత్తంగానో, అందులోని కొన్ని పక్షాలతోనో అవగాహన కుదుర్చుకుంటే తప్ప కొత్త ప్రభుత్వం ఏర్పడదు. కొత్తప్రభుత్వం ఏర్పడడానికి చాలా కాలం పట్టవచ్చునని, అంతదాకా ప్రస్తుత ప్రధానమంత్రి గేబ్రియల్ అట్టల్‌ను కొనసాగవలసిందిగా అధ్యక్షుడు మేక్రాన్ కోరుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షపదవికి 2027లో తిరిగి ఎన్నికలు జరుగుతాయి. గత మూడు పర్యాయాలుగా పోటీపడి ఓడిపోయిన లీపెన్, ఈసారి తప్పనిసరిగా విజయం సాధించగలనని, అందుకు తగ్గ సూచనలు ప్రస్తుత ఎన్నికలు ఇచ్చాయని చెబుతున్నారు.

ఫ్రాన్స్ ఎన్నికల ఫలితాలు అనేక దేశాలలో ఇటీవల వ్యక్తమైన ధోరణులను స్ఫురింపజేస్తున్నాయి. లీపెన్ ఓడిపోయింది, తక్కిన రెండు కూటములు కుమ్మక్కు కావడం వల్లనా, లేక, ఆమె పార్టీ ఇచ్చిన నినాదాలలో అహంకారం ధ్వనించినందునా? అన్న చర్చ కూడా జరుగుతోంది. అబ్ కీ బార్ చార్ సౌ పార్ అంటూ భారత్‌లో ఒకపార్టీ ప్రచార నినాదం ఇచ్చినట్టుగానే, యుకె ఎన్నికల్లో లేబర్ పార్టీ సూపర్ మెజారిటీ నినాదాన్ని ఇచ్చింది. భారత్‌లో పనిచేయలేదు కానీ, యుకెలో లేబర్ పార్టీ లక్ష్యాన్ని సాధించింది. ఫ్రాన్స్‌లో లీపెన్ తిరుగులేని మెజారిటీ అన్న నినాదాన్ని ప్రచారంలో పెట్టింది. తమ విజయం ఖాయమన్న ధోరణి ఆ పార్టీ ప్రచారంలోను, నాయకుల సరళిలోనూ అమితంగా వ్యక్తం కావడం ఓటర్లను విముఖం చేసిందని, మొదటి దశ ప్రచారాన్ని చూశాక, రెండో దశ నిర్ణయం మారిందని అంటున్నారు. నిజానికి, మేక్రాన్ నాయకత్వంలోని అధికార కూటమి మీద ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగింది. అది ఈయూ ఎన్నికలలోనే వ్యక్తమైంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి నినాదాల వారసత్వం ఉన్న ఫ్రాన్స్, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఫాసిజం దాడులకు తీవ్రంగా నష్టపోయిన ఫ్రాన్స్,


తన దేశంలో ఒక ఫాసిస్టు పార్టీని అధికారంలోకి తేవడం అవమానకరమని అధికసంఖ్యాకులు భావించడం వల్ల కూడా లీపెన్ పార్టీకి మొదట ఉధృతంగా కనిపించిన ఆదరణ, తరువాత వెనుకపట్టుపట్టి ఉండవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంగ్లండులో కూడా తీవ్ర మితవాద పార్టీ రిఫామ్ యుకె నాలుగు స్థానాలకే పరిమితం కావడం అక్కడి ప్రజాస్వామ్యవాదులకు ఊరట కలిగించింది. అయితే, రెండు దేశాలలోనూ, తీవ్ర మితవాద పార్టీలకు గణనీయంగా ఓట్లు వచ్చాయి. ఈ ధోరణి పెరుగుదల దిశగానే ప్రయాణిస్తోంది. యుక్తియుతంగా ఓటు చేయడం వల్ల ఫ్రాన్స్ రెండో దశలో ఫలితాలు తారుమారయ్యాయి. అటువంటి సందర్భం భారత్‌లో కూడా 1991 ఎన్నికల్లో కూడా జరిగింది. కాకపోతే, ఆనాటి సందర్భం వ్యూహంతో కాక, ఒక విషాదంతో, సానుభూతి ఓటింగ్‌తో ముడిపడింది. అనేక దశల పోలింగ్ నడుమ రాజీవ్ గాంధీ హత్య జరగకపోతే, ఆ ఎన్నికల్లోనే బీజేపీ విజయం సాధించి ఉండేది.

యుకెలో అయినా, ఫ్రాన్స్‌లో అయినా, దేశంలోని సామాజికార్థిక సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తే తప్ప, అక్కడ త్వరలోనే తీవ్రవాద రైటిస్టులు అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఇప్పుడు వామపక్షాలకు ఫ్రాన్స్ ప్రజలు పెద్దపీట వేశారని సంతోషించేవారు, లీపెన్ ఆత్మవిశ్వాసాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తపడాలి.

Updated Date - Jul 09 , 2024 | 03:03 AM