‘బ్రిక్స్’ వేదికగా...
ABN , Publish Date - Oct 25 , 2024 | 02:48 AM
ప్రపంచ ఆర్థికవ్యవస్థలో మూడోవంతు వాటా ఉన్న ‘బ్రిక్స్’ కూటమి తన పదహారవ శిఖరాగ్ర సదస్సును దిగ్విజయంగా జరుపుకుంది. ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నందుకు అంతర్జాతీయ న్యాయస్థానం జారీ చేసిన...
ప్రపంచ ఆర్థికవ్యవస్థలో మూడోవంతు వాటా ఉన్న ‘బ్రిక్స్’ కూటమి తన పదహారవ శిఖరాగ్ర సదస్సును దిగ్విజయంగా జరుపుకుంది. ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నందుకు అంతర్జాతీయ న్యాయస్థానం జారీ చేసిన అరెస్టువారెంట్ కారణంగా గత ఏడాది బ్రిక్స్ సదస్సుకు గైర్హాజరైన రష్యా అధ్యక్షుడు ఈ ఏడాది సదస్సును స్వదేశంలో ఘనంగా నిర్వహించారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో పాటుగా, ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, అరబ్ ఎమిరేట్స్ వచ్చిచేరడంతో ఈ కూటమి ఇప్పుడు ‘బ్రిక్స్ ప్లస్’గా మరింత బలపడిన విషయం తెలిసిందే. దాదాపు ముప్పై ఆరుదేశాలు ఈ సదస్సులో వివిధ రూపాల్లో, పాత్రల్లో భాగస్వాములు కావడం బ్రిక్స్ పట్ల దక్షిణాదిదేశాలకు ఉన్న నమ్మకానికి ఉన్న నిదర్శనమని విశ్లేషకుల అభిప్రాయం. రష్యాతో పాశ్చాత్యదేశాల వైరం పతాకస్థాయిలో ఉన్న కాలంలో, అది ఆతిథ్యమిస్తున్న ఓ సదస్సు విజయవంతం కావడం ఆదేశం పట్ల ఉన్న విశ్వాసాన్ని తెలియచెబుతోందన్నది మరో అభిప్రాయం. మిగతాదేశాల సంగతి అటుంచితే, బ్రిక్స్ సదస్సు మనకు మాత్రం బాగానే ఉపకరించింది. పుతిన్ చొరవ, మధ్యవర్తిత్వం వల్ల ఐదేళ్ళుగా రగులుతున్న ఇండియా–చైనా సరిహద్దులు కాస్తంత శాంతించబోతున్నాయి. ఇంతకాలానికి ఉభయదేశాధినేతలు నవ్వుమొఖంతో కనిపించడం, కరచాలనం చేసుకోవడం, ఓ నలభైఐదునిముషాల పాటు ఎదురెదురుగా కూర్చొని చర్చోపచర్చలు చేసుకోవడం స్వాగతించవలసిన పరిణామమే.
ఈ సయోధ్య ఎంతకాలం అన్న ప్రశ్న అటుంచితే, ఘర్షణలు, ఉద్రిక్తతలు లేని స్థితి ముందుముందు కనీసం కొంతకాలం ఉండబోతోంది. ఎవరు రాజీపడ్డారో, మెట్టు ఎక్కిందెవరో, దిగిందెవరో పూర్తివివరాలు వెలువడితే తప్ప తెలియదు కానీ, ఎల్‌ఏసీ వెంబడి పూర్వపరిస్థితులను పూర్తిగా పునరుద్ధరించబోతున్న మాట మట్టుకు ఇంపుగానే ఉంది. పెట్రోలింగ్ పాయింట్లన్నీ చేతికివచ్చి, సైనిక ప్రతిష్టంభన పూర్తిగా తొలగిపోయి, ఎవరికివారు వెనకడుగువేసే ఈ ఒప్పందాన్ని రెండు దేశాలూ చరిత్రాత్మకంగానే అభివర్ణిస్తున్నాయి. ఒప్పందానికి ఆమోదముద్రవేయడంతోపాటు, రాబోయేరోజుల్లో ఉభయదేశాలు ఎంత చక్కగా, పరస్పర విశ్వాసంతో, సయోధ్యతో మెలగాలో కూడా దేశాధినేతలు సంకల్పం చెప్పుకున్నారు. మోదీ–జిన్‌పింగ్ చేతులు కలిపిన ఆ దృశ్యం చూసినప్పుడు చాలామందికి ఐదేళ్ళక్రితం మహాబలిపురంలో వారి వ్యాహ్యాళి, ఉయ్యాలలూగిన దృశ్యాలు గుర్తుకొచ్చాయి. ఈ అనుబంధం, ఆత్మీయత బూటకమా, వ్యూహాత్మకమా అన్న మీమాంస అటుంచితే, ప్రస్తుత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో, ఇది తాత్కాలికమే అయినప్పటికీ స్వాగతించవలసిన మార్పే. నలభైఐదు నిముషాల పాటు ఇద్దరు దేశాధినేతలు విస్తృతమైన ప్రతినిధి బృందాలతో సహా చర్చల్లో కూర్చోవడం విశేషమైన పరిణామం. రష్యా, చైనా అధ్యక్షులు తనపక్కన ఉండగా భారతప్రధాని థంబ్స్ అప్ ప్రదర్శన మారినవాతావరణానికీ, మూడుదేశాల మధ్యా పెరిగిన సయోధ్య, సమన్వయాలకు నిదర్శనం. మోదీ చూపిన ఆ బొటనవేలు అమెరికా, కెనడాలను ఉద్దేశించినది కావచ్చునని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. సదస్సు యావత్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెరోవైపునా భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు కనిపిస్తూ వచ్చారు. ఇక, భారత్ రష్యా సంబంధాలమీద పుతిన్ ప్రశంసనీయమైన వ్యాఖ్యలు చేశారు. అనువాదం అక్కరలేదని, తాను చెబుతున్నదేమిటో భారత ప్రధానికి అర్థమయ్యే స్థాయిలో రెండుదేశాల మధ్యా సాన్నిహిత్యం ఉన్నదని పుతిన్ వ్యాఖ్యానించడం బాగుంది. కొన్ని సందర్భాల్లో ఇటువంటి అతిశయోక్తులు కూడా ఆత్మీయతలను సూచిస్తాయి.
ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ప్రధాని మోదీ గతంలో కంటే ఎంతో స్వేచ్ఛగా వ్యాఖ్యానించడానికి ఈ వాతావరణం దోహదం చేసింది. ఇరాన్‌తోనూ, దాని మద్దతున్న హమాస్, హిజ్బొల్లాలతోనూ ఇజ్రాయెల్ యుద్ధంలో ఉన్న తరుణంలో ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో మోదీ భేటీ కావడం ఓ విచిత్రమైన దృశ్యం. కజాన్ సదస్సుతో బ్రిక్స్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. బహుళధృవ ప్రపంచం ఆకాంక్షలకు అనుగుణంగా సదస్సు సాగిందని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడం మిగతా ప్రపంచానికి, మరీ ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌కు మేలుచేస్తుందని మనం మరోమారు గట్టిగా చెప్పుకోగలిగాం.