Share News

యాభై వసంతాల అరుణోదయం

ABN , Publish Date - Dec 14 , 2024 | 05:27 AM

ఏభై ఏళ్లు ఆషామాషీ కాదు, అది ఒక మైలురాయి. సంస్థని ప్రారంభించినవారు, ఆ సంస్థని నడిపినవారు, నేటిదాకా దానికొక ఆలంబనగా నిలిచిన వ్యక్తులు, శక్తులు ఎవరైనా వారికి అభినందనలు తెలపవలసిందే. ఇదొక విలువైన సందర్భం. సమాజానికి అవసరమైన

యాభై వసంతాల అరుణోదయం

ఏభై ఏళ్లు ఆషామాషీ కాదు, అది ఒక మైలురాయి. సంస్థని ప్రారంభించినవారు, ఆ సంస్థని నడిపినవారు, నేటిదాకా దానికొక ఆలంబనగా నిలిచిన వ్యక్తులు, శక్తులు ఎవరైనా వారికి అభినందనలు తెలపవలసిందే. ఇదొక విలువైన సందర్భం. సమాజానికి అవసరమైన వేడుక. 50 ఏళ్ళ పండగ – గతాన్ని మననం చేసుకుంటూ, భవిష్యత్తును తీర్చిదిద్దే ఆవశ్యకత. ప్రజా జీవితంలో, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక రంగంలో అది ఒక కొండగుర్తు. కొన్ని విజయాలు, మరికొన్ని ప్రయత్నాలు ఏవైనా గాని వాటిని పాఠాలుగా ఆత్మ విమర్శతో ముందడుగు వేయడానికి ఉపయోగపడే ఇంధనం వంటిది ఏభైయవ వసంతం.

అనేక ప్రజా సమూహాలు కలగలిసిన సంస్థ గురించి ఆలోచించినప్పుడు ఏభై ఏళ్ళ కాలం పెద్దదే. దీనిని చాలా మంది గుర్తిస్తారు. ఒక మహోత్సవంగా జరపాలని ఆశిస్తారు. ఏభై ఏళ్ళ సందర్భాన్ని ‘స్వర్ణోత్సవాలు’ అంటారు. ఆ పదాన్ని ఇష్టపడనివారు ‘సింపుల్‌’గా 50 ఏళ్ళు అంటారు. పండగ అనో, వేడుక అనో అంటారు. అరుణోదయ మాత్రం ‘50 వసంతాల సభలు’ అంటున్నది. ప్రజలకు సంబంధించిన ఏ సంస్థ అయినా 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం పండగే. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో.. ప్రజల కోసమే పుట్టిన సంస్థ ప్రజల చైతన్యంలో భాగమై ప్రజా జీవితాల కోసం కంకణబద్ధమైన ఆలోచనలను వెదజల్లుతూ నిలబడడం ప్రజావిజయంగా భావించాలి.

1974 ఏప్రిల్‌ 14న పలు సంప్రదింపులతో జంపాల చంద్రశేఖర ప్రసాద్‌ చొరవతో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో మే 12, 1974న లాంఛనంగా ఏర్పడింది. చలపతి, కానూరి వంటివారు, తదనంతరం గొప్ప కవిగాయక సుప్రసిద్ధుల నిర్వాహణతో దూసుకుపోయింది. ఎన్ని అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనా కదం తొక్కుతూ, పదం పాడుతూ పోదాం ముందుకే... అంటూ తన ప్రయాణం సాగించింది. ఈ ప్రస్థానంలో ఎంతో మంది కవిగాయకులు, కళాకారులు ఎన్నో ఆంక్షలు ఎదుర్కొన్నారు, జైళ్ళకు వెళ్ళారు. ప్రజా కళారంగాన్ని ఉవ్వెత్తున ఉద్యమంగా, ఉద్యమాలకు బాసటగా నిలిపారు. వామపక్ష భావాలతో భూమి, భుక్తి, గూడు కోసం వర్గపోరాటాలను రాశిలోనూ, వాసిలోనూ తీర్చిదిద్దారు. ఈ క్రమంలో ఎందరో అమరులయ్యారు. గత ప్రభుత్వం హయాంలో కూడా అరుణోదయ కళాకారులను వేధింపులకు గురి చేశారు. సాంస్కృతిక సంస్థ కార్యాలయానికి తాళాలు వేశారు. కళాకారుల మీద కేసులు పెట్టారు. అయినా ప్రజల కోసం ప్రజాబాణీలను, ప్రజా సంగీతాన్ని ఆసరా చేసుకొని ప్రజల మధ్య రాగాలై, బాణీలై, గానాలై కళారూపాలై తమవంతు పాత్ర పోషించారు.


ప్రజలకు దూరమైన భావాలూ, జీవితాలూ, రాజకీయాలూ కాకుండా వారిని కేంద్రంగా చేసుకుని వారి సమస్యల కోసం వారు నిలిచిన నేలలోంచి నిలబడి కళారూపాలను సృష్టించడంలో అరుణోదయ తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా కుల, వర్గ పోరాటాలను ఎజెండాపైకి తేవడంలోనూ, ఆ అంశాలను సాహిత్యంలో, కళల్లో, కళారూపాలలో ప్రదర్శించిన అరుణోదయ ముందు నిలిచింది.

నిజానికి విద్యార్థి సంఘాలు, అరుణోదయ సంస్థలు ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఐక్య సాంస్కృతిక కార్యాచరణ అవసరం ప్రజలు గుర్తించారు. కానీ ఎలాంటి రాజకీయ, నిర్మాణ సమస్యల వల్ల ఐక్యం కాలేకపోయాయో తెలియదు. కానీ, సాంస్కృతిక పోరాటం మాత్రం తీవ్రంగా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజానికి దేశీయ ప్రజాస్వామ్యం అభివృద్ధి చెంది, ఆయా ప్రజలలో ఐక్యత తీసుకురావాల్సి వుండగా గ్రూపులు, పార్టీలు విడనాడి ప్రజలను విడదీయడం జరుగుతుంది. కులాన్ని గుర్తించని ప్రగతిశీల రాజకీయవాదం ఎంత గొప్పదైనా ప్రజలను కలిపే ప్రయత్నాలలో, ఆలోచనలలో వెనుకబడిపోయారు. వివిధ వర్గాల, కులాల, ఉపకులాల మధ్య గల చిన్న చిన్న వైరుధ్యాలను రూపుమాపలేని విధంగా ప్రణాళికలను తయారు చేసుకున్నారు. ఒకవైపు కుల, మత భావన, ఆధిపత్యం సజావుగా కొనసాగుతుంటే ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చేదెవరు?

ప్రజల సాంస్కృతిక రూపాలు, కళారంగాన్ని, శ్రమ సాంస్కృతిక రంగాన్ని పట్టించుకోకపోవడం ఎందువల్ల జరుగుతోంది? ఇలాంటి చాలా ప్రశ్నలకు ప్రజలకు జవాబు లభించడం లేదు. అందుకే ఈ సంక్లిష్ట సమయంలో సాంస్కృతిక రంగంపై పెనుభారం పడింది. ఈ పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఒక్కో సమస్యను ప్రజలకు విడమరుస్తూ అనేక వేదికల మీద వాటిని ప్రచారం చేస్తున్న అరుణోదయ కళాకారులను అభినందించవలసిందే. ఈ సంస్థను విమలక్క తన భుజస్కంధాలపై మోస్తూ భారమైనప్పటికీ ఆగకుండా సాగుతున్నందుకు అభినందించాలి.

అరుణోదయ తమ కళాకారులను, కార్యకర్తలను తామే కష్టపడి తయారు చేసుకోవడం గమనార్హం. గాలికి వచ్చేవాళ్లు... అలా వచ్చి ఇలా వెళతారు. కానీ, అరుణోదయ స్థిరంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నదంటే కళాకారులను ప్రజలలోంచి వెతికి తమలో భాగం చేయడమే. ప్రజా రాశుల నుండి చేరవలసిన వాళ్ళను వెతుక్కోలేనితనం ఓటమికి దారితీస్తుంది. ప్రజాతంత్ర జనస్వామ్యం గుర్తించని సంస్థలు డీలా పడిపోతాయి. ప్రజలలో పనిచేయని రచయిత, మేధావి కృత్రిమ భావాలకు కాల్పనిక ఆలోచనలకు దగ్గరవుతారు. నాణ్యమైన ఫలితాలను సాధించలేని వ్యక్తుల వల్ల చిన్న ఉద్యమాలు కూడా విజయవంతం కావు. అవును, ఇప్పుడు బహిరంగంగా ప్రజోద్యమాలు అవసరం. వాటి రూపకల్పన, వాటి పని విధానం ప్రజల మధ్య, విశాలాకాశం కింద పురుడు పోసుకోవాలి. కొత్త కొత్తగా ఏర్పడిన సమస్యలు మారుతున్న సాంకేతిక అభివృద్ధి, సామాజిక చలనాలు, ప్రజా ఆకాంక్షలను అధ్యయనం చేసి, మార్కెట్‌ను, మతాన్ని, కొత్త దోపిడీ రూపాలను మనం అర్థం చేసుకోవాలి.

విశాల హృదయంతో ప్రజా సమూహాలను వారి సమస్యల పరిష్కారానికి వారినే సిద్ధం చేయాలి. అలాంటి కృషిని అరుణోదయ కొంత చేయగలుగుతున్నందుకు సంతోషించాలి. సాంస్కృతిక కళారంగం తల్లిలా ప్రజలను చేరదీయాలి. రాజకీయ రంగం చేసే పనికన్నా ఎక్కువ శ్రమపడాలి. రాజకీయ పదజాలం ఎక్కువగా ఉపయోగించడం పాత పద్ధతి. కవిత్వం, గానం, గీతం వంటి వాటిని జీవితాల్లోంచి వెలికి తీసి ప్రజల భాషలో వినిపించాలి. ఏ నిర్మాణానికి అయినా ఒక లక్ష్యం వుంటుంది. దాని లక్ష్యాల కోసం అది పనిచేస్తుంది. ఆ స్వేచ్ఛను ఇతర వేదికలవారు హరించకూడదు. తాము చేయవలసిన పనిని ఇతరులు చేయాలని చెప్పడం సరైనది కాదు.

అరుణోదయ తన పాత ప్రణాళికను మరింత లో చూపుతో ఇతర ప్రగతిశీల సంస్థల కన్నా గుణాత్మకంగా కొత్త చూపుతో తీసుకురావాలని ఆశ. కుల సమస్యను గుర్తించ నిరాకరించిన సంస్థలు కుల సమస్యను రూపుమాపలేవు. అందుకే అరుణోదయ మీద ఆ భారం వుంది. దానిని తమ సుదీర్ఘ కాలపు అనుభవం, ప్రత్యక్ష పరిశీలన, అన్ని కులాల కళాకారులతో కలిసిపోయి ఐక్యంగా పనిచేసే తీరు భవిష్యత్తులో మార్గదర్శి కావాలి. మన దేశంలోని కుల సమస్య, దోపిడీ, ప్రజాస్వామ్య భావాలను క్రమ విధానంలో పెంచి పోషించే ఆలోచనల దిశగా ప్రయాణించాలి. బతుకమ్మ పేరుతో మహిళల సమస్యలను పర్యావరణాన్ని కాపాడుకోవాలనే పిలుపు ఇచ్చి, ఊరూరా తిరిగి పాటలు పాడి, ఆటలు ఆడటం సరికొత్త విధానం. ఇక్కడ బతుకమ్మని కాపాడుకోవడానికి పర్యావరణ ఉద్యమాలు అవసరం. మహిళలపై జరిగే లైంగిక దోపిడీని, కార్పొరేట్లకోసం అడవిని, ఆదివాసీలను తరలించే ఆలోచనలకు అడ్డుకట్ట వేసే అడ్డుకునే ప్రచారం చేయడం జరుగుతోంది. పాత సమస్యలను కొత్త ఆలోచనలతో కొత్త ఎత్తుగడలతో ఎదుర్కోవడం అవసరం. అరుణోదయ ఈ విషయంలో ఆగకుండా తన ప్రయాణం కొనసాగిస్తోంది. అందుకు 50 ఏళ్ళ సభలు జరుపుకుంటున్న సందర్భంలో అరుణోదయకు అభినందనలు.

జయధీర్‌ తిరుమలరావు

(డిసెంబర్‌ 14న హైదరాబాద్‌లోని వీఎస్టీ ఫంక్షన్‌ హాలులో, 15న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో

అరుణోదయ 50 వసంతాల సభలు)


ఇప్పుడు బహిరంగంగా ప్రజా ఉద్యమాలు అవసరం. వాటి రూపకల్పన, పని విధానం ప్రజల మధ్య, విశాలాకాశం కింద పురుడు పోసుకోవాలి. కవిత్వం, గానం, గీతం వంటి వాటిని జన జీవితాల్లోంచి వెలికి తీసి ప్రజల భాషలో వినిపించాలి. అరుణోదయ తన పాత ప్రణాళికను మరింత లో చూపుతో ఇతర ప్రగతిశీల సంస్థల కన్నా గుణాత్మకంగా కొత్త చూపుతో తీసుకురావాలి.

Updated Date - Dec 14 , 2024 | 05:27 AM