పెన్షన్ చిక్కుల్లో ప్రభుత్వాలు, పార్టీలు
ABN , Publish Date - Aug 31 , 2024 | 05:52 AM
కేంద్రంలోని అధికార పక్షంతో సహా రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రులు ఇప్పుడు ఒక ఉభయ సంకటంలో ఉన్నారు. వారు ఎదుర్కొంటున్న సందిగ్ధత పెన్షన్ (పింఛన్) పథకానికి సంబంధించినది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) అనే ఆ కొత్త పింఛన్ పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం (1, ఏప్రిల్, 2025) నుంచి అమలులోకి వస్తుంది. ‘ఇది ఉద్యోగుల గౌరవం, ఆర్థిక భద్రతకు భరోసా ఇచ్చే పథకం’ అని ప్రధాని మోదీ అన్నారు.
కేంద్రంలోని అధికార పక్షంతో సహా రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రులు ఇప్పుడు ఒక ఉభయ సంకటంలో ఉన్నారు. వారు ఎదుర్కొంటున్న సందిగ్ధత పెన్షన్ (పింఛన్) పథకానికి సంబంధించినది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) అనే ఆ కొత్త పింఛన్ పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం (1, ఏప్రిల్, 2025) నుంచి అమలులోకి వస్తుంది. ‘ఇది ఉద్యోగుల గౌరవం, ఆర్థిక భద్రతకు భరోసా ఇచ్చే పథకం’ అని ప్రధాని మోదీ అన్నారు.
ఉద్యోగ విరమణ వయసు దాటిన భారత పౌరులు అందరూ పెన్షన్ పొందడం లేదు. ఆ మాటకొస్తే అసలు ఎటువంటి పింఛన్ పొందనివారే దేశ జనాభాలో అత్యధికంగా ఉన్నారు. కారణమేమిటి? ఒక పౌరుడికి అతని వృద్ధాప్యంలో పెన్షన్‌ను ప్రసాదించే సామాజిక భద్రతా సదుపాయం ఏదీ మన దేశంలో లేదు ప్రైవేట్ రంగంలో ఉద్యోగులుగా ఉన్న కోట్లాది పౌరులు ఉద్యోగ విరమణ అనంతరం ఎటువంటి పింఛన్‌కు నోచుకోవడం లేదు. చివరకు దేశ సరిహద్దులను కాపాడే సాయుధ బలగాలలోని స్వల్ప కాలిక సర్వీస్ కమిషన్డ్ అధికారులకు సైతం పెన్షన్ సదుపాయం లేదు.
దేశ ప్రజల సగటు జీవిత కాలం తక్కువగా ఉన్నప్పుడు పెన్షన్ ఒక సమస్య కాలేదు. ఆ సామాజిక భద్రతకు ఎవరూ ప్రాధాన్యమివ్వలేదు. కొద్ది మంది మాత్రమే పెన్షన్ పొందేవారు. ఉద్యోగ విరమణ అనంతరం దీర్ఘకాలం జీవించే వారూ తక్కువే. 1947లో స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించినప్పుడు భారతీయుల సగటు జీవితకాలం కేవలం 35 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు మన సగటు ఆయుర్దాయం 70 సంవత్సరాలకు పై మాటే. ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ చెల్లించాల్సిన బాధ్యత సగటున పది లేదా పన్నెండు సంవత్సరాల దాకా ఉంటుంది. కుటుంబ పెన్షన్ సదుపాయముంటే అతడు/ ఆమె చనిపోయిన తరువాత భార్య/ భర్తకు పెన్షన్ చెల్లించడం తప్పనిసరి అవుతుంది. ఈ కారణంగానే చాలా మంది యజమానులు పెన్షన్ కల్పనకు విముఖత చూపడం కద్దు. అయితే ఉద్యోగులు విధిగా పెన్షన్‌ను కోరుకోవడం కూడా అంతే కద్దు. ఇది అత్యంత సహజం. ఉద్యోగులు పెన్షన్‌ను కోరుకోవడం పూర్తిగా సమర్థనీయం. సుదీర్ఘకాలం, విధేయంగా సేవలు అందించిన తరువాత జీవన భద్రతకు పెన్షన్ అవసరం. పెన్షన్ అనేది వాయిదా వేసిన వేతనం. మరింత స్పష్టంగా చెప్పాలంటే పెన్షన్ ఒక హక్కు. ఈ హక్కు ప్రతి పౌరుడికీ ఉండాలి. విశ్రాంత జీవితంలో గౌరవప్రదంగా, భద్ర భావనతో జీవించేందుకు పెన్షన్ అనేది ఒక సుగమ బాట.
ప్రభుత్వోద్యోగుల విషయంలో ‘పెన్షన్ హక్కు’ వాదన గెలిచింది. అది సరైన వాదన. కనుక న్యాయమైన తీర్పు. మరి పెన్షన్ హక్కు లేని వారి మాట ఏమిటి? (ఇటువంటి వారే దేశ జనాభాలో అత్యధికంగా ఉన్నారని మనం మరచిపోకూడదు). ఆ ప్రశ్నకు సమాధానం పెన్షన్ హక్కును ఆ అసంఖ్యాక పౌరులకు కూడా కల్పించడమే అని నిస్సంకోచంగా చెప్పి తీరాలి. నిజానికి మన సమాజంలోని అన్ని వర్గాలవారూ ప్రయోజనం పొందేలా ఒక సార్వజనీన పెన్షన్ పథకం ఉండి తీరాలి.
ప్రభుత్వోద్యోగులకు ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ భరోసా సంపూర్ణంగా, సుస్థిరంగా లభించిన తరువాత స్థిరపడిన తరువాత బీమా చేసిన కనీస పింఛన్ భావన కూడా ప్రభవించి బలపడింది. ఈ భావన ప్రకారం ఉద్యోగ కాలం చివరి సంవత్సరంలో పొందిన మూల వేతనం + కరువు భత్యం (బేసిక్ శాలరీ + డీఏ)లో 50 శాతాన్ని పెన్షన్‌గా చెల్లించేందుకు నిర్ణయం జరిగింది. 2004లో పాత పింఛన్ పథకం (ఓల్డ్ పెన్షన్ స్కీమ్ – ఓపీఎస్) స్థానంలో కొత్త పింఛన్ పథకం (న్యూ పెన్షన్ స్కీమ్ – ఎన్‌పీఎస్) అమలులోకి వచ్చింది. ఈ ఎన్‌పీఎస్, పెన్షన్ సదుపాయం రెండు ఆధారాలకు భంగం కలిగించింది: నాన్ కంట్రిబ్యూటరీ డిఫైన్డ్ బెనిఫిట్ స్కీమ్ (దీని ప్రకారం ఉద్యోగి రిటైర్మెంట్ ప్రయోజనాలకు అవసరమైన మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వమే చెల్లించాలి. ఉద్యోగి ఏమీ చెల్లించనవసరం లేదు)ను పూర్తిగా ఒక డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ స్కీమ్ (దీని ప్రకారం పెన్షన్ కోసం ఉద్యోగీ, ప్రభుత్వమూ నిర్దిష్ట మొత్తాలను పెన్షన్‌కై చెల్లించవలసి ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్ మేనేజర్లు ఆ సొమ్మను మదుపు చేసి, వచ్చే రాబడి, పన్ను మినహాయింపుతో ఉద్యోగి పెన్షన్ మొత్తాన్ని నిర్ణయిస్తారు)కు మార్చి వేసింది; కనీస పెన్షన్ భావనను ఎన్‌పీఎస్ పూర్తిగా త్యజించింది.
ఎన్‌పీఎస్‌ను మరింత సులభరీతిలో వివరిస్తాను: ఎన్‌పీఎస్‌లో ఉద్యోగులు తమ మూలవేతనంలో 10 శాతాన్ని పెన్షన్ కోసం చెల్లిస్తారు. ప్రభుత్వం కూడా తన వంతుగా 10 శాతం మొత్తాన్ని జమ చేస్తుంది. ఇలా జమ చేసిన డబ్బుతో ప్రభుత్వం ఎంపిక చేసిన బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలకు చెందిన ఫండ్ మేనేజర్లు వివిధ మార్గాల్లో మదుపు చేస్తారు. ఆ మదుపుల ద్వారా వచ్చే రాబడి ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది. ఇంత రాబడి వస్తుందనే భరోసా ఉండదు. ఈ కారణంగానే ఉద్యోగులు ఎన్‌పీఎస్‌ను వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున నిరసనలు ప్రజ్వరిల్లాయి. నాటి ప్రధాని వాజపేయి ఉద్యోగుల ఒత్తిడికి లొంగలేదు. ఆయన తరువాత ప్రధానమంత్రి అయిన మన్మోహన్‌సింగ్ కూడా ఎన్‌పీఎస్ అమలుకే కట్టుబడి ఉన్నారు. పది సంవత్సరాల పాటు ఉద్యోగుల డిమాండ్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ వచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ సైతం పది సంవత్సరాల పాటు ఉద్యోగుల డిమాండ్‌కు ససేమిరా అంటూ వచ్చారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల తీర్పు పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. మోదీ ప్రభుత్వం యూపీఎస్‌ను తీసుకువచ్చింది.
ఆగస్టు 3, 2022న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఖ్య 69,76,240. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో వీరికి పింఛన్లు చెల్లించేందుకు బడ్జెట్ పరమైన వ్యయం రూ.2,43,296 కోట్లు. మీడియా వార్తల ప్రకారం మార్చి 2023 నాటికి ఎన్‌పీఎస్‌లో 23.8 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 60.7 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు ఉన్నారు. 2024లో వీరి సంఖ్య కొంచెం అటూ ఇటూగా ఉండవచ్చు. అయితే దేశ జనాభాలో వీరి సంఖ్య చాలా చాలా స్వల్పమనేది ఒక సునిశ్చిత వాస్తవం.
నిధులు సమకూర్చని పెన్షన్ పథకం (అన్‌ఫండెడ్ పెన్షన్ స్కీమ్)తో సమస్యేమిటంటే అది ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించే ప్రమాదమున్నది. పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) అలాంటి పథకమే. ప్రభుత్వాలు ఉద్యోగి రిటైర్ అయినప్పుడు అతనికి దక్కవలసిన రిటైర్‌మెంట్ ప్రయోజనాలను కరెంట్ రెవెన్యూ రాబడి నుంచి చెల్లించలేవు. ‘పే యాజ్ యు గో’ రీతిలో చెల్లించడం అసాధ్యం. అందుకు నిధులు సమకూర్చడం అత్యవసరం. ఎవరు సమకూర్చాలి? ప్రభుత్వం సమకూర్చాలి. లేదంటే ఉద్యోగులు సమకూర్చాలి. లేదూ ప్రభుత్వమూ ఉద్యోగులూ ఇరువురూ సమకూర్చాలి. ప్రభుత్వమూ, ఉద్యోగులూ నిధులు సమకూర్చే పెన్షన్ పథకమే ఎన్‌పీఎస్. ఈ కొత్త పెన్షన్ పథకానికి ప్రభుత్వం తన వాటాగా 14 శాతాన్ని, ఉద్యోగి తన వాటాగా 10 శాతాన్ని సమకూరుస్తున్నారు. ‘నిధులు సమకూర్చడమనేది భద్రమైన ఆర్థిక వ్యవహారం.
యూపీఎస్ పెన్షనర్లకు ఆర్థిక భద్రత సమకూరుస్తుందని మోదీ ప్రభుత్వం ఘంటాపథంగా చెప్పుతోంది. ఈ పథకానికి ఉద్యోగులు చెల్లించే వాటా (10 శాతం) యథావిధిగా ఉంటుంది. ప్రభుత్వ వాటా 18.5 శాతానికి పెరుగుతుంది. కనీస పెన్షన్ చెల్లింపునకు యూపీఎస్ హామీపడుతోంది. 25 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసినవారు రిటైర్ అయ్యే ముందు 12 నెలలపాటు తీసుకున్న సగటు మూల వేతనంలో 50 శాతాన్ని కనీస పెన్షన్‌గా నిర్ణయిస్తారు. హీనపక్షం నెలకు రూ.10 వేలు పెన్షన్‌గా లభించే అవకాశం ఉన్నది.
ఈ వ్యాసం రాస్తున్న సమయానికి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు యూపీఎస్‌పై తమ వైఖరి ఏమిటో వెల్లడించలేదు. అసలు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కాంగ్రెస్‌తో సహా ప్రధాన రాజకీయ పక్షాలు యూపీఎస్‌పై తర్జనభర్జనలు చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు అనేకం పెన్షన్ నిధికి ఉద్యోగుల విధిగా తమ వాటాను చెల్లించవలసిన నిబంధనను వ్యతిరేకిస్తున్నాయి.
ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు, ఉద్యోగుల సంఘాలు పరిపూర్ణ సందిగ్ధావస్థలో ఉన్నాయి కోశ సంబంధ దృక్కోణం నుంచి మాట్లాడితే యూపీఎస్‌ను తిరస్కరించవలసిన అవసరం లేదు అయితే కొన్ని ప్రశ్నలు : ప్రస్తుతం పెన్షన్ నిధికి ప్రభుత్వ, ఉద్యోగుల వాటా మధ్య ఉన్న 8.5 శాతం వ్యత్యాసం భవిష్యత్తులో మరింతగా పెరుగుతుందా?; ‘లోటును ప్రభుత్వం భర్తీ చేస్తుందని ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి టి.వి. సోమనాధన్ (ఈయనే యూపీఎస్‌ను సిఫారసు చేసిన కమిటీకి నేతృత్వం వహించారు) ఇది ఇంచుమించు ‘పే యాజ్ యు గో’ వంటి పరిస్థితిని ప్రభుత్వానికి కల్పించదూ?; 10+10 వాటాల మొత్తాన్ని మదుపు చేసే బాధ్యతను ఆమోదం పొందిన పెన్షన్ ఫండ్ మేనేజర్లకు అప్పగిస్తూ 8.5 శాతం ప్రభుత్వ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని ఎవరు ఎక్కడ మదుపు చేస్తారు?; యూపీఎస్ అమలుకు తొలి సంవత్సరానికి గాను అదనంగా ఇచ్చిన రూ.6,250 కోట్లు చాలా తక్కువగా కనిపిస్తోంది. ఇది నిజంకాదా?; కొత్త పెన్షన్ పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించే ముందు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రతించారా? ఉద్యోగుల సంఘాలూ ఆ సంప్రదింపుల్లో పాల్గొన్నాయా? ఎన్‌పీఎస్, యూపీఎస్ ఉభయ సంకటం నుంచి ప్రభుత్వాలు, రాజకీయపక్షాలు ఎలా బయటపడనున్నాయి? పెన్షనర్లకు ఆర్థిక భద్రత ఏ మేరకు సమకూరనున్నది?
యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించే ముందు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రతింపులు జరిపారా? ఉద్యోగుల సంఘాలూ సంప్రదింపుల్లో పాల్గొన్నాయా? ఎన్‌పీఎస్, యూపీఎస్ ఉభయ సంకటం నుంచి ప్రభుత్వాలు, రాజకీయపక్షాలు ఎలా బయటపడనున్నాయి? పెన్షనర్లకు ఆర్థిక భద్రత ఏ ఏరకు సమకూరనున్నది?
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు)