అడ్వకేట్ల గౌరవం కాపాడాలి!
ABN , Publish Date - Dec 12 , 2024 | 05:28 AM
2019–20లలో సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ సర్టిఫికెట్లు ఐదు సంవత్సరాల కాలపరిమితికి జారీ చేశారు. అవి తయారు చేసి ఇచ్చేసరికి 2022 వచ్చేసింది. 2020, 2021లలో కరోనా వల్ల కోర్టులు జరగలేదు. అయినా 2025 జనవరి 1కి సర్టిఫికెట్ల కాల వ్యవధి ముగిసినందున
2019–20లలో సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ సర్టిఫికెట్లు ఐదు సంవత్సరాల కాలపరిమితికి జారీ చేశారు. అవి తయారు చేసి ఇచ్చేసరికి 2022 వచ్చేసింది. 2020, 2021లలో కరోనా వల్ల కోర్టులు జరగలేదు. అయినా 2025 జనవరి 1కి సర్టిఫికెట్ల కాల వ్యవధి ముగిసినందున మరల ఐదేళ్లకి రెన్యువల్, కొత్తగా ఐదు సంవత్సరాల ప్రాక్టీస్ ముగిసినవారు వెరిఫికేషన్ చేయించుకోవాలని బార్ కౌన్సిల్ సర్క్యులర్ ఇచ్చింది. దాని ప్రకారం డిసెంబర్ 21లోగా సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ అప్లికేషన్లు పంపించుకోవాలి.
2019–2020లలో సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ అప్లికేషన్లు పెట్టమని అన్నప్పుడు, డిగ్రీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాలని, ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నవారిని తొలగించాలన్నది ఉద్దేశ్యమని చెప్పారు. కొన్ని ఫేక్ సర్టిఫికెట్లు కనుగొన్నట్లు ప్రకటించారు. అయితే సకాలంలో అప్లికేషను పెట్టుకోలేని వారు, కొన్ని కారణాల వల్ల డిగ్రీ సర్టిఫికెట్లు దగ్గర లేని వారు సర్టిఫికెట్లు పొందలేకపోయారు. వారిలో చాలా మంది సక్రమంగా బిఎల్/ఎల్ఎల్‌బి చదివి డిగ్రీ పొంది, బార్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారున్నారు. వీరంతా గౌరవప్రదంగా అడ్వకేట్ అనే స్టేటస్ ఉంచుకోవాలి అనుకున్నవారే. అలాగే కొంతమంది ఆడవాళ్ళు కుటుంబ బాధ్యతల వలన ఏక్టివ్ ప్రాక్టీస్ చేయలేకపోయినా, తమ అడ్వకేట్ హోదా ఉంచుకుని, తెలిసిన వారికి సలహాలు ఇస్తూ గౌరవం పొందుతున్నారు... ఇలాంటి వారు సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ పొందలేకపోయారు.
ఇప్పుడు మళ్లీ సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ రెన్యువల్ అప్లికేషన్లు పెట్టమని ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా చూపించడానికి 5 వకాల్తాలు, 5 మెమో ఆఫ్ అప్పియరెన్స్‌లు, డ్రాఫ్టింగ్ డీడ్స్‌కు సంబంధించిన ఆధారాలు పెట్టాలి. లేదా కోర్టు వెబ్‌సైట్ లేదా కాజు లిస్టులో న్యాయవాది పేరు ఉంటే వాటిని, లేదా తీర్పు/ఆర్డరు కాపీలలో న్యాయవాది పేరు ఉంటే వాటిని జతపరచాలి. ఈ ఆధారాలు జత చేయకపోతే బార్ కౌన్సిల్ లిస్టు నుంచి సదరు అడ్వకేట్ పేరును తొలగిస్తారు. వారు ప్రాక్టీస్ చేయడానికి, ఓటింగులో పాల్గొనడానికి అర్హత కోల్పోతారు. ఈ నిబంధనలు అడ్వకేట్లకు సమస్యగా మారుతున్నాయి. బార్ కౌన్సిల్ ఎన్నికలలో ప్రాక్టీస్ చేస్తున్న వారినే ఓటర్లుగా నమోదు చెయ్యాలని, బార్ కౌన్సిల్ సభ్యులుగా ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్లకే అవకాశం కల్పించాలి అనుకోవడం కొంత సబబే. కానీ ఎన్నికలకు, బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్ ఎన్‌రోల్‌మెంట్‌కు ముడిపెట్టడం సరైనది కాదు.
అడ్వకేట్ చట్టం, బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం న్యాయ డిగ్రీ పొంది, బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారందరూ అడ్వకేట్లుగా ప్రాక్టీస్ చేయడానికి అర్హులు. కానీ ఈ నిబంధనల వల్ల కొందరు అడ్వకేట్లకు సమస్య వస్తోంది. కొంతమంది అడ్వకేట్లు ఛాంబర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వారి సలహాలు, డ్రాఫ్టింగ్ కక్షిదారులకు, సహ న్యాయవాదులకు ఎంతో ఉపయోగకరం. వారు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయకపోయినా అడ్వకేటుగా గౌరవం పొందుతుంటారు. మరికొంత మంది అడ్వకేట్లు తమ సీనియర్ల దగ్గర పనిచేస్తూ ఉంటారు. సాధారణంగా సీనియరు మాత్రమే కోర్టులో వకాల్తా వేస్తారు. జూనియర్ అడ్వకేట్ వకాల్తానామాపై సీనియర్‌తో పాటు సంతకం చెయ్యకపోయినా, సీనియర్ తరపున కేసు విచారణ చేసే విధానం అమలులో ఉంది. కొన్ని కారణాల వల్ల జూనియర్ అడ్వకేట్లతో వకాల్తా సంతకం చేయించరు.
కోర్టుల్లో వకాల్తా వేసి కేసులు వాదించడమే కాదు, తాము న్యాయ డిగ్రీ పొందిన జ్ఞానంతో నలుగురికి అవసరమైన న్యాయ సలహాలు ఇవ్వడం కూడా అడ్వకేట్లకు గౌరవం. అందుకు అడ్వకేట్‌గా రిజిస్ట్రేషన్, గుర్తింపు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ నిబంధనల వల్ల వారందరూ అడ్వకేట్ గుర్తింపునకు దూరమవుతున్నారు.
డాక్టర్లు, ఇంజనీర్లు, ఆడిటర్లు... తమ అసోసియేషన్లలో సభ్యులకు ఇటువంటి నిబంధనలు పెట్టలేదు. డాక్టర్లు వైద్యం చేయకపోయినా, ఇంజనీర్లు ఏ ప్రాజెక్టులలో పనిచేయక పోయినా, ఆడిటర్లు ఆడిట్లు చేయకపోయినా, వారందరినీ అసోసియేషన్లలో సభ్యులుగా ఉండనిస్తున్నారు. అటువంటప్పుడు అడ్వకేట్లకే ఈ ప్రాక్టీస్ నిబంధనలు ఎందుకు రూపొందించారో తెలియదు. ఇది ఎవరి ఆలోచన అయినా ఆమోదయోగ్యంగా లేదు.
అడ్వకేట్లు, వారి సంఘాలు, బార్ అసోసియేషన్లు దీని గురించి సరైన ఆలోచన చేయాలి. బార్ కౌన్సిల్ ఎన్నికలలో ఓటర్లుగా పాల్గొనడానికి వేరే పద్ధతులలో ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టవచ్చు. అంతేకానీ బార్ కౌన్సిల్ ఎన్నికల ఓటర్ల జాబితాకు, బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా రిజిస్ట్రేషన్‌కు ముడి పెట్టడం సరికాదు. అడ్వకేట్ అనేది ఒక గౌరవం. ప్రాక్టీస్ చేసినా, చేయకపోయినా, అడ్వకేట్‌గా ఎన్‌రోల్‌మెంట్ కావడం న్యాయ డిగ్రీ పొందిన వారి హక్కు, గౌరవం. ఆ గౌరవాన్ని కాపాడండి.
– పి.పి. శాస్త్రి, అడ్వకేట్, ఏలూరు